Sunday, May 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీసీలకు కేంద్రం తీవ్ర అన్యాయం

బీసీలకు కేంద్రం తీవ్ర అన్యాయం

- Advertisement -

తెలంగాణకు ఏం అభివృద్ధి చేశారని మోడీ వస్తున్నారు
కార్పొరేట్‌ శక్తులకు దోచిపెడుతున్న కేంద్రం : వీహెచ్‌ దీక్షాశిబిరంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-అంబర్‌పేట

రాజకీయాలకు అతీతంగా జనాభ ప్రతిపాదికన బీసీ అభ్యున్నతి జరగాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ఆమోదించకుండా బీసీలకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్‌ చేర్చకపోవడాన్ని నిరసిస్తూ శనివారం హైదరాబాద్‌ అంబర్‌పేట డీడీ కాలనీలో మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు జాన్‌వెస్లీ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ”విభజించు-పాలించు” విధానంతో బీసీలను మోసం చేస్తోందన్నారు. ప్రభుత్వ రంగాల్లో రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర జరుగుతోందన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి చేసిందని మోడీ వస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన హామీలు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఇతర వాగ్దానాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజల చెవిలో పువ్వులు పెట్టడానికి మరోసారి రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు. కార్పొరేట్‌ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతూ బీసీల హక్కులను కాలరాస్తోం దన్నారు. హనుమంతరావు 80 ఏండ్ల వయసులో దీక్ష నిర్వహించడం అభినందనీయమన్నారు.

వి.హనుమంతరావు మాట్లాడుతూ.. జనగణనలో ఓబీసీ కాలమ్‌ చేర్చితేనే బీసీల అసలు జనాభా బయటపడుతుందని, తద్వారా అన్ని రంగాల్లో న్యాయం జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. ఓబీసీ కాలమ్‌ చేర్చడంలో కేంద్రానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రధానికి పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదని వాపోయారు. తాను ఓబీసీని అని చెప్పుకునే ప్రధాని మోడీ.. ఓబీసీల హక్కుల విషయంలో ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్‌, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, నాయకులు గుజ్జ కృష్ణ, మోతె రోహిత్‌, ఆర్‌.లక్ష్మణ్‌ యాదవ్‌, యాదగిరిగౌడ్‌, శంభుల శ్రీకాంత్‌గౌడ్‌, మాజీ కార్పొరేటర్లు దిడ్డి రాంబాబు, పులి జగన్‌, గరిగంటి రమేష్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -