Sunday, May 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్పొరేట్ లాభాపేక్షతోనే పర్యావరణ కాలుష్యం

కార్పొరేట్ లాభాపేక్షతోనే పర్యావరణ కాలుష్యం

- Advertisement -

సీఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు
బీరంగూడలో ఘనంగా మెగా హెల్త్ క్యాంప్
నవతెలంగాణ – అమీన్‌పూర్
కార్పొరేట్ లాభాపేక్షతోనే పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు తెలిపారు. మేడే ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని సిఐటియు, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం బీరంగూడలోని భ్రమరాంబిక నగర్, మాస్టర్ మైండ్ స్కూల్ ఆవరణలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఈఎస్ఐ రామచంద్రాపురం ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సిఐటియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు ప్రారంభించి ప్రసంగించారు. ప్రస్తుత వాతావరణ మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎండలు మండుతుండాల్సిన సమయంలో వర్షాలు కురవడం ప్రకృతి వైపరీత్యానికి నిదర్శనమన్నారు. కార్పొరేట్ కంపెనీలు కేవలం లాభాల కోసం పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయని, ఫలితంగా సామాన్య ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని విమర్శించారు. అభివృద్ధి చెందిన దేశాలు కాలుష్య నివారణకు నిధులు ఖర్చు చేయకుండా వెనకాడుతున్నాయని, దీనివల్ల మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే దేశంలో పౌష్టికాహార లోపం కూడా ప్రజారోగ్యంపై పెను ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

భ్రమరాంబిక నగర్ కాలనీ అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ.. ఒకప్పుడు ఎవరూ ప్లాట్లు కొనేందుకు ముందుకు రాని బీడు భూముల్లో, అగర్వాల్ రబ్బరు కార్మికుల కోసం ఈ కాలనీని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. సాండ్విక్, ఏసియన్ పెయింట్, వీబిసి వంటి పరిశ్రమల కార్మికులు ఎన్నో కష్టనష్టాలకోర్చి, మనోధైర్యంతో ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్నారని గుర్తు చేశారు. నేడు ఈ ప్రాంతం ప్రైమ్ ఏరియాగా, అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చెందడం అభినందనీయమని, కాలనీవాసుల ఐకమత్యమే దీనికి కారణమని కొనియాడారు. మేడే ఉత్సవాల ముగింపు సందర్భంగా కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలతో పాటు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ కె.కల్పనా రఘునాథ్, ఈఎస్ఐ రామచంద్రాపురం సూపరిండెంట్ డాక్టర్ సత్యనారాయణ, ఐద్వా జిల్లా కార్యదర్శి నాయిని లలిత, సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రాజయ్య, రైతు సంఘం నేత వెంకట్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, నాయకులు పాండురంగారెడ్డి, నరసింహారెడ్డి, జార్జ్, శ్రీనివాస్, అర్జున్, సత్తిబాబు, వీరస్వామి, జిలాని, సునీత, పద్మావతి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. సమాజం పట్ల బాధ్యతతో, సోదర భావంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ శిబిరంలో ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, రామచంద్రాపురం ఈఎస్ఐ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, స్థానిక హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొనగా, వందలాది మంది కాలనీవాసులు, మహిళలు పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -