వారికి రాజ్యాంగ హక్కులు ఉండవా?
బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ
ఆపార్టీది విభజించు…
పాలించు సిద్ధాంతమే
భారత విదేశాంగ విధానంలో మోడీ సర్కార్ పూర్తి వైఫల్యం
ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి
రాజకీయ కక్షలు ఉండవు..
మాది పారదర్శక పాలనే..
విచారణ ఆధారంగానే బండి సంజయ్ కుమారుడిపై చర్యలు
సున్నిత అంశం అయినందునే మహిళా ఐపీఎస్‌తో విచారణ కమిటీ ఏర్పాటు
మీడియాతో ఇష్టాగోష్టిలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అనీ, బ్రిటీష్ పాలకుల మాదిరిగానే విభజించు పాలించు సిద్ధాంతంతో ఆ పార్టీ పాలన సాగుతున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. ముస్లింలు, మావోయిస్టులు ఈ దేశ పౌరులు కాదా? వారికి హక్కులుండవా? రాజ్యాంగం అన్ని మతాలు, కులాలు, ప్రజలందరికీ సమాన హక్కులిచ్చిన విషయాన్ని మరిచారా? వారిపై ఎందుకింత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు? అని ప్రశ్నించారు. ముస్లింలపైనా, మావోయిస్టులపైనా ప్రధాని వ్యాఖ్యలు సరిగాదన్నారు. అబ్దుల్ కలాం, జాకీర్ హుస్సేస్ ముస్లింలు కాదా? వారు దేశ అభివృద్ధిలో పాలుపంచు కోలేదా? అని నిలదీశారు. ఏ ప్రధాని అయినా దేశ ప్రజలందరూ ఐకమత్యంగా కలిసుండాలని కోరుకుంటారనీ, ప్రధాని మోడీ మాత్రం ముస్లింలను వేరుచేసి చూడటం ఏంటని ప్రశ్నించారు. కమ్యూనిజం గొప్ప ఫిలాసఫీ అనీ, అది అంటరానిది ఎలా అవుతుందని ప్రశ్నించారు. పేదలకు భూములు పంచాలనీ, కూలిరేట్లు పెంచాలనీ, అందరికీ ఇండ్లు కట్టివ్వాలని కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తే ఆచరణలో భూములు పంచింది, కూలిరేట్లు పెంచింది, ఇండ్లు కట్టిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తుచేశారు. బీజేపీ సిద్ధాంతాన్ని కాదనే వాళ్లను ఖతం చేసే పనిలో మోడీ సర్కారు ఉందని విమర్శించారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పార్టీ తమదనీ, ప్రాణాల విలువ ఏంటో తమకు తెలుసన్నారు. మావోయిస్టులు బుల్లెట్ అంటే కాదు బ్యాలెట్ అని మేం అన్నామనీ, చివరకు మావోయిస్టులను బ్యాలెట్ లైన్‌లోకే తెచ్చామని చెప్పారు. ఆయుధాలు అప్పగించి మావోయిస్టులు లొంగిపోవడం పెద్ద అచీవ్‌మెంట్ అనీ, ఈ విషయంలో తెలంగాణ పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని అభినందించాల్సి ఉండాల్సిందని అభ్రిపాయపడ్డారు. గణపతి కూడా ప్రజాస్రవంతిలోకి రావాలని కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తాను అందరివాడిననీ, రాజకీయ కక్షలకు పాల్పడ కుండా పారదర్శక పాలన అందించడమే తన లక్ష్యమని అన్నారు. కేసుల విషయంలో విచారణ అధికారం ప్రభుత్వానిదనీ, శిక్షించే అధికారం కోర్టులదని తెలిపారు. తాను ప్రధాని మోడీతో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నాననీ, ఆ కార్యక్రమంలో ప్రధాని మాటలకు రాజకీయాలు ఆపాదించవద్దని కోరారు. మెట్రో, సదరన్ పార్టు రీజనల్ రింగురోడ్డు, తుమ్మిడిహట్టి, ఇలా కొన్ని పెండింగ్ అభివృద్ధి పనులను సింగిల్ విండో విధానం తీసుకొచ్చి పరిష్కరించాలని ప్రధాని మోడీని కోరగా…తమతో కలిసి వస్తే మరింత అభివృద్ధి సాధ్యమని చెప్పారనీ, ఆ కార్యక్రమంలో రాజకీయ చర్చలకు తావు లేదని స్పష్టం చేశారు. యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ గుజరాత్ ప్రభుత్వానికి(మోడీ సర్కారుకు) అభివృద్ధి విషయంలో సహకరించినట్టుగానే తెలంగాణ అభివృద్ధి విషయంలో ఆయన్ను స్పిరిట్‌గా తీసుకుని సహకరించాలని ప్రస్తుత ప్రధాని మోడీని కోరానని తెలిపారు. గత ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులను రాబట్టడంలోనూ, డీపీఆర్‌లు ఇవ్వడం, సంప్రదింపులు జరపడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆర్‌ఆర్‌ఆర్, కాకతీయ మెగా టెక్స్‌టైల్స్, ఎయిర్‌పోర్టుల క్లియర్, డిఫెన్స్ ల్యాండ్, ఏడీబీ నిధులు, నేషనల్ హైవేలను కేంద్రంతో మాట్లాడి తమ ప్రభుత్వం క్లియరెన్స్ తెస్తున్నదని తెలిపారు. తెలంగాణకు కేంద్రం నుంచి సహకారం అందీ అందనట్టుగానే ఉందన్నారు. యూరియా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమనీ, రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేయడమేంటని నిలదీశారు.
మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానం వైఫల్యం
‘బంగారం కొనొద్దు, విమానాల్లో ప్రయాణించొద్దు, పెట్రోల్ వాడకం తగ్గించండి’ అని ప్రధాని మోడీ చెప్పడం అంటే విదేశాంగ విధానంలో ఆయన పూర్తిగా విఫలమైనట్టేనని సీఎం అన్నారు. ఆయన తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలా మాట్లాడారని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్నారు. రాహుల్ గాంధీ మొదటి నుంచి అదే చెబుతున్నారని చెప్పారు. అన్నిపార్టీలను పిలిచి విదేశాంగ విధానంపై చర్చించాలనీ, ప్రతిపక్షాల సలహాలు తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఎన్నికల ముందు ఆయా రాష్ర్టాలకు ప్యాకేజీలు ప్రకటించడం…అవి అయిపోగానే టెంట్ చాపలా చుట్టుకుని వెళ్లిపోవడం…చూస్తుంటే బీజేపీ పాలన అచ్చం జెమినీ సర్కస్‌లా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
2029లో జమిలి ఎన్నికలు
కొత్తగా కాంగ్రెస్ పార్టీ కేరళలో గెలిచిందన్నారు. బీజేపీ బెంగాల్‌లో గెలిచిందనీ, కేరళలో మూడు, తమిళనాడులో ఒక సీటును సంపాదించిందని చెప్పారు. తమ పార్టీకి తమిళనాడులో ఐదు, బెంగాల్‌లో రెండు సీట్లు వచ్చాయని సీఎం తెలిపారు. సర్ లేకపోతే బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం రాకపోయేదన్నారు. ఆ పార్టీకి సర్ ఒక ఆయుధంగా మారిందని విమర్శించారు. తర్వాతి టార్గెట్ తెలంగాణ అని ప్రధాని మోడీ అనటంపై స్పందిస్తూ..జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీకి డిపాజిట్ రాలేదని గుర్తుచేశారు. మున్సిపాలిటీల్లో బీజేపీ పరిస్థితి ఏమిటి? అనేది అందరికీ తెలుసునన్నారు. జమిలి ఎన్నికలు 2029లో పెట్టడానికి అవకాశం ఉందన్నారు. నియోజవర్గాల పునర్విభజన అంశంపై మాట్లాడుతూ..ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదిక ఎక్కడ ఉందని ప్రశ్నించారు. 50 శాతం జనాభాప్రాతిపదికన, 50 శాతం ఆర్థికాభివృద్ధి అంశాల వారీగా ఉండాలని తాను చెప్పడం కొత్తేం కాదన్నారు. మహిళా రిజర్వేషన్లు, జమిలీ ఎన్నికలు, సీట్ల పెంపు, డీలిమిటేషన్ అన్నింటినీ కలిపి బిల్లుగా పెట్టడం వల్లనే వ్యతిరేకించాల్సి వచ్చిందన్నారు. దామాషా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయొచ్చుగదా? రోజుకు నాలుగు జిల్లాల వివరాలు, ప్రజల అభిప్రాయాలు సేకరిస్తే 150 రోజుల్లో పూర్తి అవుతుంది కదా? అని ప్రశ్నించారు. కేంద్రం చెప్పినట్టు నియోజకవర్గాల సంఖ్య పెంచితే కొన్ని ప్రాంతాల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టే ఒక విధానం రూపొందించాలని అడుగుతున్నామని చెప్పారు. తమిళనాడులో అతిపెద్ద పార్టీ అయిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలవకపోవడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ జపం లేకుండా బీజేపీ బతకలేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై ఫోక్సో కేసు నమోదు చేయడంపై డీజీపీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నామనీ, మహిళా ఐపీఎస్ అధికారితో విచారణ కమిటీ వేసి బాధిత కుటుంబంతో వివరాలను రికార్డు చేయించాలని ఆదేశించామని తెలిపారు. ప్రధాని పర్యటనలో భద్రత నిమిత్తం 10 వేల మంది పోలీసులు ఉండటంతో కేసు విచారణ కొంత ఆలస్యమైందన్నారు. తమ ప్రభుత్వం ఎవ్వరినీ వదలనీ, విచారణ ప్రకారమే చర్యలు ఉంటాయని తెలిపారు. సెన్సిటివ్ అంశం కావడంతో పోలీసులు జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారని చెప్పారు. 30 ఏండ్లు పోలీసు అధికారిగా పనిచేసిన ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఈ కేసు విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడటం సరిగాదన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ గురైందని ఆరోపించిన ప్రవీణ్‌కుమార్‌నే విచారణ సమయంలో ప్రభాకర్‌రావు మంచోడు అన్నట్టు స్టేట్‌మెంట్ ఇవ్వడాన్ని బట్టే ఆయన తీరేంటో అర్థం అవుతుందన్నారు. బీ.ఆర్.ఎస్ పాలనలో విద్యావ్యవస్థ ఆగమైందని మొత్తుకున్న ఆర్.ఎస్.పీ ఇప్పుడు కేసీఆర్‌కు దొరరత్న అవార్డు ఇచ్చే పనిలో ఉన్నారని దెప్పిపొడిచారు. భగీరథ్ పై కేసు విషయంలో ఆధారాలుంటే పోలీసులకు ఇవ్వాలని ప్రవీణ్‌కుమార్‌కు సూచించారు. హ్యామ్ రోడ్లపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. విద్యావారంలో భాగంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యాంటీ డ్రగ్ మూవ్‌మెంట్ కార్యక్రమం ఎల్‌బీ స్టేడియంలో చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ అంశం తన దృష్టిలో ఉందనీ, ఒక విధానపరమైన నిర్ణయం ద్వారా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టిపై సహకరించాలని మహారాష్ట్ర సీఎం, ప్రధాని మోడీలకు లేఖలు రాశామని తెలిపారు. ఈ విషయంలో ప్రధాని పెద్దరికం పాత్ర పోషించాలని కోరారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు ఉపయోగం కలిగించే ఆ ప్రాజెక్టుపై బీజేపీ ఎంపీలు ఎవరి పక్షం వహిస్తారో చూడాల్సి ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనీ, అవసరమైతే గణాంకాలతో సహా వివరిస్తామని తెలిపారు. పంటల మార్పిడి విధానంపై డైరెక్ట్‌గా కాకుండా క్షేత్రస్థాయి నుంచి రైతులను చైతన్యపరుస్తామన్నారు. ఆ తర్వాతనే ఒక విధానపరమైన తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నామనీ, తాను కూడా స్వయంగా జిల్లాల పర్యటనలకు వెళ్తానని చెప్పారు. కాళేశ్వరంపై సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో చర్యలు తీసుకునేలా చూస్తామన్న కిషన్‌రెడ్డి హామీ ఏమైందని ప్రశ్నించారు.
21న క్యాబినెట్ సమావేశం
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపుపై ఈ నెల 21న జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామనీ, జూన్ 2 లోపు జర్నలిస్టుల ఇండ్ల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు. క్యాబినెట్ ఆమోదం ఉంటేనే చట్టబద్ధత ఉంటుందన్నారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగానే క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.



