సైనిక శిక్షణ పొందుతున్న ప్రజానీకం
హవానాలో సీఐఏ చీఫ్ పర్యటన…ఏజెంట్లకు దిశానిర్దేశం
హవానా : క్యూబాపై అమెరికా చేస్తున్న ఒత్తిడి ప్రజల రోజువారీ జీవితాలపై ఇప్పటికే ప్రభావం చూపుతోంది. అమెరికా విధించిన చమురు దిగ్బంధనం కారణంగా అనేక నివాస గృహాలు, కార్యాలయాలలో విద్యుత్ సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీనికి తోడు ఆర్థిక సంక్షోభం క్యూబన్ల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురవుతున్నప్పటికీ అమెరికా దాడికి తెగబడితే దానిని తిప్పికొట్టేందుకు ప్రజలు సమాయత్తమవుతున్నారు. ఇదిలా వుండగా కొద్ది రోజుల క్రితం సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ ఇటీవలే హవానాలో పర్యటించడం దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉద్రిక్తతలు కీలక స్థాయికి చేరుకుం టున్నాయని చెప్పడానికి ఇది ఓ సంకేతం. క్యూబాలో గూఢ చర్య కార్యకలాపాలు నిర్వ హించేందుకు అమెరికా కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది. వాటిలో ఓ కేంద్రానికి చెందిన అధి కారులు, ఏజెంట్లతో రాట్‌క్లిఫ్ సమావేశమైన చిత్రాలను సీఐఏ విడుదల చేసింది.
దాడి చేయాలి…లేదా చావాలి
క్యూబా ప్రతిఘటించలేని విధంగా దాడి చేయాలని, లేదా చావాలని పిలుపు ఇవ్వడమే రాట్‌క్లిఫ్ పర్యటన ఉద్దేశమని విశ్లేషకులు తెలిపారు. కాగా రాట్‌క్లిఫ్ పర్యటనపై క్యూబా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ ద్వీపం అమెరికాకు ఎందుకు ముప్పు కలిగించదో ఆయనకు వివరించామని తెలిపింది. అయితే ఇదంతా చెవిటి వాని ముందు శంఖం ఊదిన చందమే. రష్యా, చైనా నిఘా కేంద్రాలకు క్యూబా అధికారులు ఆశ్రయం కల్పిస్తున్నారని, ఆ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలను అడ్డుకుంటున్నారని రాట్‌క్లిఫ్ ఆరోపించారు. ఆయన హవానా నుంచి బయలుదేరిన కొన్ని గంటలకే క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రోపై అమెరికా అభియోగం మోపబోతోందన్న వార్తలు వచ్చాయి. వచ్చే నెలలో రౌల్ కాస్ట్రోకు తొంభై ఐదు సంవత్సరాలు నిండుతాయి. నడవడానికి సైతం ఇబ్బంది పడుతూ సహాయకులపై ఆధారపడుతున్న ఆయనపై ఎలాంటి చర్య తీసుకున్నా అది ప్రమాదకరమే అవుతుంది. ఇరు దేశాల మధ్య అంతంత మాత్రంగా ఉన్న దౌత్య సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంది.
ప్రాణత్యాగంకు సిద్ధమే
రౌల్ కాస్ట్రోపై అభియోగాలు మోపడం ద్వారా క్యూబాపై సైనిక చర్యకు అమెరికా సన్నాహాలు చేస్తోందని, దేశాన్ని రక్షించుకునేందుకు అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని అధికారులు స్పష్టం చేశారు. దేశ పౌరులు సైనిక శిక్షణ పొందుతున్న దృశ్యాలను ప్రభుత్వ మీడియా ప్రచురించింది. ప్రభుత్వం నుంచి ఆయుధాలు పొందిన క్యూబన్లు గెరిల్లా యుద్ధం చేస్తారు. సైనికులు పురాతన సోవియట్ ఆయుధాలతో విన్యాసాలు చేస్తున్న దృశ్యాలు కొన్ని వీడియోలలో కన్పిస్తున్నాయి. క్యూబా సాయుధ దళాల వద్ద ఆత్యాధునిక ఆయుధాలు లేనప్పటికీ అమెరికా భూతల దాడులను అవి సమర్ధవంతంగా తిప్పికొట్టగలవని చరిత్రకారులు తెలిపారు. చమురు దిగ్బందనం, విద్యుత్ కోతల కారణంగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నప్పటికీ వారిలో ధైర్యం ఏ మాత్రం సడలడం లేదు.



