తెలుగు రాష్ట్రానికి చెందిన సాహస యాత్రికురాలు గిరిజ పైడిమర్రి ఇటీవలె ‘గిరిగమనం’ అనే యాత్రా గ్రంథాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా అమెరికా ఓహోయో రాష్ట్రానికి చెందిన గ్రాండ్‌మా ఎమ్మా గేట్‌వుడ్ గురించి తెలుసుకోవడం కూడా అవసరంగా అనిపించింది. ఆమె తన 67వ ఏట అపలాచియన్ ట్రయల్ మొత్తాన్ని 2050 మైళ్లు ఒంటరిగా నడిచింది. అదీ రెండు, మూడుసార్లు. స్త్రీల యాత్రా చరిత్రలో అదీ 76 ఏండ్ల కిందట సైన్స్ గొప్పగా అభివద్ధి చెందని కాలంలో ఇదొక అద్భుతం. ఈ యాత్ర గురించి రచయిత బెన్ మాంటిగోమరీ ”గ్రాండ్ మా గేట్ వుడ్స్ వాక్”, ”ది ఇన్స్పైరింగ్ స్టోరీ ఆఫ్ ద వుమెన్ హూ సేవ్డ్ ది అపలాబియన్ ట్రైల్” (2012) అనే పుస్తకంలో 1955లో ఆ సాహసోపేతమైన ప్రయాణాన్ని వర్ణించారు. ఆ అద్భుత విశేషాలను నేటి సోపతి కవర్ స్టోరీలో మీ ముందు ఉంచుతున్నాను.
నిజానికి ఎమ్మా గేట్ వుడ్ సాహస యాత్రికురాలైనప్పటికీ ఆమె బాల్య యవ్వన కాలాల్లో, పెండ్లి తర్వాత భర్తతో నరకం అనుభవించింది. గేట్ వుడ్ అమెరికా ఓహోయోలోని గేయాన్ టౌన్‌షిప్‌లో పదిహేను మంది పిల్లల్లో ఒకరిగా రైతు కుటుంబంలో హ్యూ కాల్డ్ వెల్, ఎవలివ్‌కే లకు జన్మించింది. అంతర్యుద్ధంలో తండ్రి కాలు తీసేశారు. తర్వాత అతను తాగుడికి, జూదానికి బానిసయ్యాడు. కుటుంబాన్ని పోషించే బాధ్యత తల్లి కాల్డ్ వెల్‌పై పడింది. ఎమ్మా గేట్‌వుడ్ ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే చదవగలిగింది. కానీ ఎన్‌సైక్లోపీడియాలు, గ్రీక్ క్లాసిక్స్ చదివేది. వన్యప్రాణులు, ఔషదాలు, ఆహారంగా ఉపయోగపడే అటవీ మొక్కల గురించి అధ్యయనం చేసేది. ఆమె భావకురాలు కూడా మంచి కవిత్వం రాసేది. 1907 మే 5న తన 19 ఏండ్ల వయసులో 27 ఏండ్ల పెర్రీ క్లేటన్‌ను వివాహం చేసుకుంది. అతను ప్రాథమిక పాఠశాలలో టీచరుగా చేస్తూనే పొగాకు రైతుగా పని చేసేవాడు. పదకొండుమంది పిల్లలను కన్న గేట్‌వుడ్ ఇంటి పనులు చేసేది. దీంతోపాటు భర్త ఆమెను పొగాకు మడులను కాల్చడం, కంచెలు నిర్మించడం, సిమెంట్ కలపడంలాంటి కూలీ పనులలో పెట్టాడు. సమాజంలో, బయట పెర్రీ క్లీటన్ మర్యాదస్తుడు. కానీ ఇంట్లో భార్య పట్ల అత్యంత హింసాత్మకంగా వ్యవహరించేవాడు. భార్యను కొడుతూనే గడిపాడు.
ఆడవిలోనే శాంతి
భర్త క్రూరంగా మారినప్పుడు గేట్‌వుడ్ ప్రాణాలను రక్షించుకునేందుకు అడవుల్లోకి పారిపోయేది. అక్కడ ఆమెకు శాంతీ, రక్షణా దొరికేవి. 1939లో పళ్లు, పక్కటెముకలు విరిగేంతగా ఆమెను భర్త కొట్టాడు. పట్టణ మేయర్ ఆమెకి ఉద్యోగం ఇస్తుంది. 1941లో భర్తకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పినాక విడాకులు మంజూరు అవుతాయి. ముగ్గురు పిల్లల సంరక్షణ బాధ్యత, భర్త ద్వారా భరణం మంజూరు అయ్యాయి. అయితే విడాకులు మంజూరు కాకుండా ఉండడానికి ఆమెను పిచ్చిదని ప్రచారం చేసి పిచ్చాసుపత్రిలో చేర్పిస్తానని భర్త బెదిరించేవాడు. విడాకులు వచ్చిన ఆరేండ్ల తర్వాత గేట్ వుడ్ కొన్ని ఉద్యోగాలు చేస్తూ ఇంటిని సంభాలిస్తూ కవిత్వం కూడా రాయడం మొదలుపెట్టింది. 1951కల్లా ఆమె పిల్లలందరూ సమర్థులైపోయారు. 1950ల ప్రారంభంలో నేషనల్ జియోగ్రాఫిక్ August పత్రిక చదువుతున్నప్పుడు గేట్ వుడ్ అపలాచియాన్ ట్రైల్ గురించి వ్యాసం చదివి ప్రేరణ పొందింది. అందులోని ప్రకృతివర్ణన బొమ్మలు ఎమ్మాని ఆకర్షించాయి. యాత్ర చేయగల ఆరోగ్యం తనకి ఉండడం యాత్ర చేయడానికి పెద్దగా నైపుణ్యం, అనుభవం అవసరం లేకపోవడం కూడా నచ్చాయి.
నేను చేశాను, నేను చేస్తానని చెప్పాను
గేట్‌వుడ్ 1954 జూలైలో మైనేలో మౌంట్ కటాడిన్ నుంచి దక్షిణానికి హైకింగ్ చేయడానికి బయలుదేరింది. ఆ దశలో ఆమె చాలా సమస్యలు ఎదుర్కొంది. మొదటగా దారి తప్పిపోయింది. కళ్లాద్దాలు పగిలిపోయాయి. తీసుకువెళ్లిన ఆహారం కూడా అయిపోయింది. దారిన ఉన్న రేంజర్లు ఆమెను ఇంటికి తిరిగి వెళ్లమని ఒప్పించారు. కానీ ఆమె రెండోసారి మే 3, 1955న జార్జియాలోని యేంట్ ఓగర్ థోర్స్ నుంచి ఉత్తరంవైపు నడక ప్రారంభించి 146 రోజుల తర్వాత సెఫ్టెంబర్ 25న మౌంట్ కటాడిన్ వద్ద ముగించింది. బాక్సర్ పీక్ శిఖరంపై ఆమె రిజిస్టర్‌లో సంతకం చేసి America the Beautifulపాటలోని మొదట చరణాన్ని పాడి ”నేను చేశాను, నేను చేస్తానని చెప్పాను. నేను చేశాను” అని గట్టిగా చెప్పింది. ఆ యాత్రలో ఆమె ప్రయాణానికి అవసరమైన సామాగ్రి గుడారం, స్లీపింగ్ బాగ్ తీసుకెళ్ల లేదు. వర్షం నుంచి రక్షించుకోవడానికి ఒక షవర్ కర్టెన్ మాత్రం తీసుకెళ్లింది.
అద్భుతమైన రికార్డులు
తన వంకరపాదాలకు కాన్వాస్ కెడ్స్ బూట్లు వేసుకుంది. భుజాలకి సాధారణమైన డెనిమ్ సంచీలో చిన్న నోట్‌బుక్, కొన్ని బట్టలు, ఆహారం పెట్టుకుంది. ఉండడానికి ఆశ్రయం దొరకనప్పుడు ఆకుల కుప్పల మీద పడుకునేది. చల్లని రాత్రుళ్లలో వెచ్చదనం కోసం పెద్ద బల్లపరుపు రాళ్లను వేడి చేసుకునేది. ఆహారం అయిపోయనప్పుడల్లా అడవిలో చెర్రీ పండ్లు.. ఇతర తిన దగ్గ అటవీ మొక్కలు తినేది. ఆమె ఒంటరి హైకింగ్ వార్తలను, స్పోర్ట్స్, ఇలస్ట్రీటడ్ ఆమె ట్రైల్‌లోని అనుభవాలు వివరిస్తూ కథనాలు రాసింది. అమెరికాలో ఉన్న అన్ని పత్రికలూ గేట్‌వుడ్ అపలాచియన్ ట్రైల్ కథనాలు ప్రచురించాయి. ఆమె అనేక అవార్డులు గెలుచుకున్నారు. టెలివిజన్ కార్యక్రమాల్లో ప్రత్యేక అతిథిగా ఆహ్వానించబడ్డారు. ఆమె ఘనత ”కాంగ్రెషనల్ రికార్డ్స్‌లో నమోదు చేశారు. గేట్‌వుడ్ 1957లో అపలాచియన్ ట్రైల్‌ను మళ్లీ పూర్తిగా నడిచారు. గర్గ్ స్కౌట్స్ సభ్యులకు శిక్షణ ఇచ్చారు. 1958లో న్యూయార్క్‌లోని అడిరోన్ డాక్ పర్వాతాలలో ఆరు పర్వతాలను అధిరోహించారు.
మొదటి మహిళా ట్రైల్ హైకర్‌గా
1959లో 71 ఏండ్ల వయసులో వందేండ్ల కిందట కప్పిన బండ్ల వెనక 2000 మైళ్ల ఒరెగాన్ ట్రైల్‌ను ఒంటరిగా నడిచింది. ఈ యాత్రకు ఆమెకి ఇండిపెండెన్స్, మస్సారీ నుంచి పోర్ట్‌లాండ్ ఓరెరగాన్ వరకు మూడు నెలలు పట్టింది. రోజుకి 22 మైళ్లు (35 కిలోమీటర్లు) నడిచింది. పోర్‌లాండ్‌లో ఆమె రాకను గ్రాండ్‌మా గేట్‌వుడ్ డేగా జరుపుకున్నారు. 1964లో 76 ఏండ్ల వయసులో అపలాచియన్ ట్రైల్‌ను మూడుసార్లు పూర్తి చేసిన మొదటి మహిళా ట్రైల్ హైకర్‌గా గుర్తించింది. 1967 ప్రతి జనవరిలో ఒహియోలోని హైకింగ్ హిల్స్ స్టేట్ పార్క్ నాయకత్వం వహించారు. 1973లో ఆమె చివరి నడక చేశారు. ఈ వార్షిక నడక కొనసాగింది. 2013లో 4 వేల మంది ప్రజలు ఈ నడకలో గేట్‌వుడ్‌తో చేరారు. 1973లో ఆమె మరణానికి కొద్దిరోజుల ముందు అపరిమిత కాలపరిమితి గల టికెట్‌లో సుదీర్ఘ బస్సు యాత్ర చేశారు. సంయుక్త రాష్ట్రాలన్నింటినీ మూడు కెనడియన్ ప్రావిన్స్‌లను సందర్శించారు.
నేను చేశాను, నేను చేయగలను
ఆమె తన జీవితకాలంలో 14,000 మైళ్లకుపైగా (23,000 కిలోమీటర్లు) నడిచారు. ఇది భూమి చుట్టూ సగానికిపైగా దూరం నడిచిన దానికి సమానం. 67 ఏండ్ల వయసులో అప్పాలచియన్ ట్రైల్, గేట్‌వుడ్ అన్ని వేల మైళ్ల హైకింగ్ వెనకాల కారణం.. ఆమె ఎదుర్కొన్న గృహహింస. గృహహింసను తప్పించుకున్న సర్వైవర్‌గా ఆమె ఈ అప్పాలాచియన్ ట్రైల్ పర్వాతాల హైకింగ్‌ను చేస్తూనే పోయారు. ఈ హైకింగ్ ఆమెను హింసా, వేదనల నుంచి తప్పించుకునేలా చేసింది. దీని ద్వారా స్వేచ్ఛనీ, శక్తిని పొంది తనేదైనా చేయగలనన్న విశ్వాసాన్ని పొందారు. తనని దేనికీ పనికిరాని వస్తువుగా, ఏండ్ల తరబడి పిల్లల్ని కనే యంత్రంగా, గుర్తింపు లేని ఇంటి పనులు చేసే పనిమనిషిగా, బయట పొలాల్లో శ్రామికురాలుగా, ఫ్యాక్టరీలో కార్మీకురాలిగా మాత్రమే చూసిన భర్త హేళనకు ఆమె చెప్పిన సమాధానమే ఈ అద్భుతమైన యాత్ర. అందుకే అప్పాలచియన్ ట్రైల్ పూర్తి చేశాక ‘నేను చేశాను, నేను చేయగలను’ అని తన క్రూరుడైన భర్తకే కాదు, ఈ పితస్వామ్య వ్యవస్థకి గొంత్తెత్తి గాండ్రించినట్లు సమాధానం చెప్పారు. పిల్లల్ని పెంచి, పెద్ద చేశాకే ఆమె ఆ హింసాత్మక వాతావరణం నుంచి, పీడక భర్త విముక్తి పొందే ప్రయాణం చేశారు.
ట్రెక్కింగ్ ఒక ప్యాషన్
ఇక గిరిజ గిరిగమనం పుస్తకం చదువుతున్నంతసేపు నాకు గ్రాండ్‌మా గేట్‌వుడ్ చేసిన కఠినమైన అప్పాలాచియన్ ట్రైల్ యాత్ర గుర్తుకు వస్తూనే ఉంది. గేట్‌వుడ్ ఒకసారి కాదు, పలుమార్లు వేలమైళ్లు హైకింగ్ చేశారు. యాత్ర చేసి ఆమె తన గురించి తాను తెలుసుకోవాలని, ఆ తెలుసుకుంది, సాధించింది. యాత్ర చేసి తాను మానసికంగా, భౌతికంగా విముక్తి స్వేచ్ఛని పొందినట్లు చెబుతారు. యాత్రలు, ట్రెక్కింగ్‌లు, హైకింగ్‌లు చేసే స్త్రీలకు, ఇంట్లోంచి ప్రకతిలోకి చేసే ప్రయాణానికి, పొందే సాంత్వనకీ, ఆనందానికి రకరకాల మానసిక, కుటుంబక, వ్యక్తిగత కారణాలు ఉంటాయి. ఎమ్మా గేట్‌వుడ్‌కి ఉన్నట్లు గిరిజపైడిమర్రికి మాత్రం ట్రెక్కింగ్ ఒక ప్యాషన్! అంతులేని దాహం! సమాజాన్ని, ప్రకతిని, ప్రపంచాన్ని, తనని తానూ తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి యాత్ర ఒక వాహిక! ఒక దారి! ఒక గైడ్!
గొప్ప తాత్విక కోణం వుంది
లోక సంచారిణిలాగా గిరిజ చేసే యాత్రలకి, ఇతర స్త్రీలు చేసే యాత్రలకి చాలా తేడా ఉంది. కుటుంబంతో చేసే యాత్రల్లో ప్రకతి, సమాజం, చరిత్ర, మనుషులు, జీవన విధానం, సంస్కతుల పరిశోధనకి ఆస్కారం ఉండదు. అదొక విహార యాత్రల్లా ముగిసిపోతాయి. అలా యాత్రలు చేసిన స్త్రీల వ్యక్తిగత అవగాహన ఇది. యాత్ర పేరుదో ఇల్లు దాటినా భర్త పిల్లల బాగోగులు, తిండీ, రక్షణ చూసుకోవడం మళ్లీ స్త్రీల మీదే పడుతుంది. అదొక కుటుంబ యాత్రలా మిగిలిపోతుంది. ఒక నిరాశ మిగులుతుంది. స్త్రీలు స్వేచ్ఛగా తాము చూడాలనుకున్నవి పరిశోధించాలనో, అనుభవించాలనో అనుకొన్నవి ఏదీ చేయకుండానే నిరాశతో మళ్లీ నాలుగ్గదుల ఇంట్లోకి వెళ్లిపోవాల్సి ఉంటుంది. కానీ గిరిజ చేసే యాత్రలకి ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉంది. ఆమె యాత్రలకు ఎన్నుకునే దేశాలు, ప్రాంతాలు కూడా చాలా ప్రత్యేకమైనవి, చరిత్రాత్మకమైనవి. ఆమెలో ఒక ప్రకతి దర్శనం మాత్రమే కాదు.. యాత్రా విశేషాలలో గొప్ప తాత్విక కోణం ఉండడం వల్ల వెళ్లిన చోటల్లా స్థానిక ప్రజల జీవన దర్శనం, సంఘర్షణలు, వాళ్ల జీవన తాత్వికత కనిపిస్తాయి.
మరింతగా తెలుసుకోవడానికి
ఆమె ప్రయాణం కేవలం భౌగోళిక సంచారకం మాత్రమే కాదు. అది మనసు లోతుల్లోకి కావల్సిన దాని కోసం చేసే అన్వేషణ. ఎత్తైన మంచు పర్వతాలు, పచ్చని అడవులు, వాగులు, నదులు జలపాతాలు, గుడులు, చారిత్రక కట్టడాలు ప్రకతి లోపలి నిశ్శబ్దం, ఒకింత ఒంటరితనం అన్నీ కూడా గిరిజ ఆత్మ పరిశీలనకు సహకరించాయి. ఆమె మాటల్లో చెప్పాలంటే ఆమె తనను తాను మరింతగా తెలుసుకోవడానికి ఈ జీవన మలిసంధ్యలో తనకి బహుశా ఏం కావాలో అర్థం చేసుకోవడానికి ప్రయాణిస్తోందని అనిపిస్తుంది. తన గమనం ఏంటో ఎక్కడికో స్పష్టంగా తెలుసుకుని ప్రయాణిస్తోంది. గిరిగమనం పుస్తకంలో ఆమె తన వ్యక్తిత్వంలోని సున్నితమైన అంశాలను తనకు తెలియకనే వ్యక్తపరుస్తూ పోయింది. తనదీ, తనతోటి స్త్రీలనీ, యాత్రా స్థలాల్లోని స్త్రీలనీ, అయిన అనుభవాలను సున్నితంగా మానవీయంగా చిత్రించే, విశ్లేషించే ప్రయత్నం చేసింది. ప్రకతిలో మనిషికి ఉన్న సంబంధాన్ని, ప్రకతిలో సమాజానికి, ప్రకతికీ రాజ్యానికీ మధ్య ఉండే రాజకీయార్థిక, మార్కెట్ సంబంధాలని, ప్రకతికీ మనిషికీ మధ్య ఉత్పత్తి సంబంధాలు, సాంస్కతిక సంబంధాల్నీ విశ్లేషించే ప్రయత్నం చేసింది.
ప్రయాణాలు తెచ్చే గుణాత్మక మార్పు
ప్రతీ యాత్రలో తనలోకి, ప్రకతిలోకి అక్కడి స్థానిక సామాజిక చలనంలోకి తొంగి చూసే ప్రయత్నం చేసింది. ఆమె యాత్రా విశేషాల్లో సాహితీకరణలో తన భావోద్వేగాలకు దగ్గరగా ఉండే సరళమైన భాషను ఉపయోగిస్తూ పోయింది. యాత్రని తాత్విక కోణంలో చూడ్డం, విశ్లేషించడం వలన రచనకు ఒక గాఢత చేకూరింది. తన యాత్రని ఒక మామూలు ప్రయాణంగా చూడలేరు. గిరిజ చేసిన ప్రతీ యాత్రా స్త్రీ హదయం, జీవితం, ప్రకతి, స్వేచ్ఛల సాహసాల మధ్య నడిచిన ఒక ఆత్మాన్వేషణ, సత్యాన్వేషణగా సాగింది. ఆమె యాత్రల్లో స్త్రీగా తన అనుభవాల్లోంచి అసలు స్త్రీలు యాత్రలు చేస్తే వచ్చే మనో శారీరక మార్పులను వీలైనంతమటుకు ప్రతీ యాత్రా కథనంలో చెబుతూ పోయారు. స్త్రీల వ్యక్తిత్వంలో ప్రయాణాలు తెచ్చే గుణాత్మక మార్పులను పూలలో దారంలా తెలీకుండానే చెబుతూ పోయారు.
ఎన్నో అవరోధాలు
స్త్రీలు చాలామంది హైకింగ్‌కి ఎందుకు ముందుకు రారు అని అడిగిన ప్రశ్నకు గిరిజ తన సుదీర్ఘ యాత్రానుభవాల్లో పరిశీలించిన వాస్తవాలను ఇలా చెబుతారు. కనిపించే కనిపించని కారణాలు, నిషేధాలు అనేకం ఉన్నాయి. సామాజిక, సాంస్కతిక, సంప్రదాయాలు సరిహద్దులు.. అంటే స్త్రీలు ఒంటరిగా ప్రయాణం చేయకూడదని చెప్పే సంప్రదాయక సరిహద్దులన్నమాట. అలాగే సామాజిక అపవాదులు భరించాలన్న భయం. స్త్రీల ప్రయాణాల బాధ్యత పెళ్లి తర్వాత భర్తది ముందు తల్లిదండ్రులది. అంటే స్త్రీలు ఎప్పుడూ ఒకరి రక్షణలో ఉండాల్సిందే. పెళ్లి కాకుండా ప్రయాణం చేసే స్త్రీకి పెండ్లి కాదన్న భావన కూడా బలంగా ఉంది. ఇవే కాకుండా పెండ్లి అయిన స్త్రీలకు ప్రయాణాల్లో లైంగిక వేధింపులు ఉంటాయన్న భయం. సాంస్కతిక, సామాజిక నియమ నిబంధనలు, భర్త అత్తమామలు ఒప్పుకోకపోవడం, రోజుల తరబడి యాత్రలకు అలవాటు పడితే ఇంటి పని, పిల్లల సంరక్షణ ఎవరు చూస్తారన్న ఆధిపత్య భావన. ఇంకా స్వయం నిర్ణయాధికారం లేకపోవడం, ఆర్థిక పరాధీనత. సహజమైన శారీరక పరిస్థితులు మెన్ట్స్రువల్ పీరియడ్స్, గర్భధారణ, శారీరక బలహీనతలు. పబ్లిక్ స్థలాల్లో స్త్రీలకి కావల్సినా బాత్రూమ్స్, కనీస సౌకర్యాలు లేకపోవడం, ఉన్నా శుభ్రంగా లేకపోవడం వంటివి ఎన్నో కారణాలు. ఇక యాభైలు దాటిన స్త్రీలు కీళ్ల నొప్పులు గుండె, షుగర్ సమస్యలు ఉండడం వలన కూడా ప్రయాణాలు చేయడానికి భయపడుతుంటారు. వీటన్నింటినీ అధిగమించి స్త్రీలు యాత్రలు చేయడానికి బయటకు రావాలంటారు గిరిజ.
విశాల ప్రపంచంలోకి వెళ్లాక
ప్రయాణాల్ని కేవలం ప్రకతి సౌందర్యాన్ని ఆస్వాదించేదిగా మాత్రమే కాకుండా తాత్విక కోణంలో అర్థం చేసుకున్న గిరిజ జీవితాన్ని ఆనందంగా సంత్రృప్తిగా గడుపుతున్నారు. ఒకసారి విశాల ప్రపంచంలోకి వెళ్లాక, ఆ విశాల విశ్వంలో మనకు అణువంత జ్ఞానోదయం కలుగుతుంది. దానిలో జీవితంలో సానుకూల దక్పథం ఏర్పడుతుంది. అలా ట్రెక్కింగ్‌ని తన ప్యాషన్‌గా ఎంచుకున్నారు గిరిజ. ఇల్లు, వంటిల్లు, ఉద్యోగ నిర్వహణ బాధ్యతలను అధిగమించి ట్రెక్కింగ్ చేస్తున్న వారిలో తన ముప్పై ఏండ్ల యాత్రా జీవితంలో తెలంగాణ నుంచి గిరిజ పైడిమర్రి, చెన్నైకి చెందిన వనతినే చూశాను అంటారు ప్రముఖ ట్రెక్కర్, సీనియర్ జర్నలిస్ట్ ఆలూరి రాఘవ. అయితే వనతి ఇంకా చిన్న వయసులో ఉంది. పర్యటించిన స్థలాలు తక్కువ.. కానీ గిరిజ ఆసేతుహిమాచల పర్యంతం తిరిగిన లోక సంచారిణి! ఇలా ఎన్నో ప్రదేశాల్లో తిరిగాక రాసిన గిరిగమనం ఇది.
అసామాన్య యాత్ర
మొత్తానికి గిరిజ గిరుల వెంట, అడవులు, నదులు, వాగుల వెంట చేసిన గమనం అసామాన్యమైనది. చాలామంది యాత్రా విశేషాలు ఇలా ఇంత సాహసవంతంగా ఉండవు. విదేశాల్లో ఉన్న ఇద్దరు కొడుకులు తల్లి సాహసం చూసి భయపడి మందలించేంతగా ఆమె చేసిన యాత్రలు ఒళ్లు గగుర్పొడుస్తాయి. కొండల్ని, పర్వతాలని ఢకొీడుతూ మంచులో, వర్షంలో అధిరోహించడం, వెదురు కర్రల మీద ఊహించినంత ఎత్తులో ఉన్న వంతెనలను దాటడం, బలంగా ఉధతంగా ప్రవహించే వాగులకి ఎదురీదుతూ కాళ్ళతో బ్యాలెన్స్ చేస్కుంటూ 16 కిలో మీటర్లు ధైర్యంగా దాటడం, దానికోసం ఎంత సాహసం అయినా చేయడం ఏంటిది? ఇదే గిరిజ వ్యక్తిత్వం! నేను చెప్పినట్లు ఎమ్మా గేట్ వుడ్ తన వ్యక్తిగత జీవితంలోని గహహింస వల్ల కలిగిన డిప్రెషన్ని అధిగమించడానికి అప్పాచియాన్ ట్రైల్ సాహసం చేస్తే గిరిజ పైడిమర్రికి మాత్రం వ్యక్తిత్వ వికాసంలో భాగంగా మహిళా సాధికారతను సాధించే సాధనం యాత్ర.
జీవితంలో ఓ భాగం చేసుకోవాలి
గిరుల్ని, తరుల్ని, నదుల్ని అలవోకగా దాటేస్తూ ఆమె వంటిళ్లల్లో, ఇళ్లల్లో, బంధీలుగానో, భయస్థులుగానో ఉండిపోయే స్త్రీలకు సాధికారత కోసం ఇచ్చిన పిలుపు గిరిగమనం. ఒక వనిత, వైష్ణవి మరికొద్దిమంది గిరిజ స్నేహితురాళ్లు మాత్రమే కాదు గిరిజ తన యాత్రానుభవాలను యాత్రా సాహిత్యంగా మలిచి వయసు మళ్లిన, మధ్య వయసు స్త్రీలకే కాదు యువతులకి యాత్రలు, ట్రెక్కింగ్ జీవితంలో భాగం చేసుకొమ్మని పిలుపునిచ్చారు. 200 గజాల నుంచి 1600 గజాల ఇంట్లో డిప్రెషన్లతో, అసంతప్తులతో చేసే ఇరుకు నడక నుంచి బయటకొచ్చి విశాలమైన మైదానాలు, కొండలు, అడవుల్లో, ప్రయాణం చేస్తూ నదీనదాలు దాటుతుండడం ఎంతటి ఆత్మ విశ్వాసం. దీనివల్ల తమ దేహాలు, జీవితాల మీద ఎంతటి సాధికారత ఏర్పడుతుందో చూడమని పిలుపునిస్తున్నారు.
హైకింగ్ సామూహిక శక్తి
హైకింగ్ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం లాంటి సొంత ప్రయోజనాలతో పాటు ఒక బృందంలో కలిసి హైకింగ్ చేయడం అనేది పరస్పర అనుబంధాన్ని సామూహిక లేదా ఉమ్మడి అనుభవాల్ని జోడిస్తుంది. చాలామంది ఉమెన్ హైకర్స్ ఒకే ఆర్తులు, లక్ష్యాలు పంచుకునే ఇతరులలో కలిసి హైకింగ్ చేయడం, యాత్రల్లో పరస్పరం సహాయం చేసుకునే దయాగుణంతో పాటు కుల, మత, ప్రాంత, వర్గ వివక్షలు కొన్నిసార్లు చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. విశాల మానవత్వాలతో, హదయ సంస్కారాలతో పాటు సంకుచితత్వాలని కూడా యాత్రల్లో చూస్తాం. అలా వివక్షలతో సామాజిక వికారాలతో ఉన్నవాళ్లు యాత్రల్లో ఒంటరిగానే మిగిలిపోయుంటారు. హైకింగ్ చేయడం అపారమైన ఆత్మవిశ్వాసాన్ని, సంతప్తిని, ఐక్య భావాన్ని పెంచుతుంది. ఈ భావన తామంతా ఒకే సమూహానికి చెందిన వారమన్న ఐక్యతా భావనని పెంచుతుంది. ఒంటరితనం తగ్గుతుంది. యాత్ర తర్వాత కూడా స్నేహాలు జీవితాంతమూ కొనసాగే అవకాశాలుంటాయి. శారీరక సమర్థతలను, సవాళ్లను, ప్రకృతి సౌందర్యాలను కలిసి పంచుకోవడం అనేది పరస్పర బంధాలను పెంచుతుందంటారు గిరిజ.
ట్రేక్ నిర్వహించడం ఆమె బాధ్యత
మేఘాలయ ట్రెక్‌కి టూరిజంలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వైష్ణవి తీసుకెళ్లింది. దీనికోసం కుటుంబంలో ఎంతో పోరాటం చేసింది. 3, 4 నెలలు ఒక రాష్ట్రంలో ఉండి అక్కడి భాష, సంస్కృతి, భౌగోళిక పరిసరాలు తీసుకుని ప్రతి వారాంతంలో ప్రయాణికులతో ట్రెక్ నిర్వహించడం ఆమె బాధ్యత. కంపెనీ ఏ రాష్ట్రానికి పంపిస్తే అక్కడికి వెళ్తుంది. వైష్ణవి తెలుగమ్మాయి. తెలంగాణ అమ్మాయి.
యాత్రల్లో మానసిక ప్రయోజనాలు
ప్రకతిలోని దశ్యాలు, శబ్దాలు, పరిమళాలు మెదడులో ప్రశాంత పరిచే ప్రతి స్పందనని ప్రేరేపించి ”కార్టిసాల్” లాంటి ఒత్తిడి పెంచే హార్మోన్ల స్థాయిలను తగ్గిస్తాయి. స్త్రీల రోజువారి జీవితంలోని ఒత్తిళ్లకి హైకింగ్, ఒక శక్తివంతమైన విరుగుడు. కలసి నడవడంలోని, నడకలోని లయబద్ధమైన కదలిక, స్వచ్ఛమైన గాలి, సహజ కాంతితో కలసి మానసిక ఆందోళనను శాంతపరచడంలో సహాయపడతాయి. విడవని ఇంటి బాధ్యతలు, డిప్రెషన్‌ల నుంచి దూరం చేసి వర్తమానంలో ఉన్నామనే స్పహకు, జాగురూకతను కలిగిస్తుంది. స్నేహితులతో లేదా ఒంటరిగా చేసే యాత్రలు ప్రకతిలో సమయం గడపడం వల్ల ఆందోళన, డిప్ర్రెషన్‌ను తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది మంచి నిద్ర, ఏకాగ్రత, ప్రశాంతత పెరగడానికి దోహదం చేస్తుంది. దీనికి కారణం ఆరోగ్యకరమైన ఎండార్ఫిన్స్ హార్మోన్ల విడుదల. స్త్రీలలో మెనోపాజ్ ముందరి (పెరి) తర్వాతి దశల్లో హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో ఎముకల్లో పొందుతూ పెంచి ఆస్టియో పోరోసిస్‌ను తగ్గిస్తుంది. కండరాల బలాన్ని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పని హైకింగ్ రక్తపోటుని, షుగర్‌నీ కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది.
స్త్రీల హైకింగ్ – వచ్చే లాభాలు
– ముఖ్యంగా సామూహికంగా చేసే ప్రయాణాల్లో దొరికేది అపారమైన ఆనందం, సామూహికత్వ, ఐక్య భావన, స్నేహం వాళ్లకే తెలీని ఒక రకమైన అంతర్గత శక్తిని స్వేచ్ఛనీ సాహసాన్ని అనుభూతి చెందడం. హైకింగ్ ఒక మామూలు వ్యాపకం కంటే కూడా ఎక్కువ శక్తిని అందిస్తుందని తెలుసుకోవడం. ముఖ్యంగా స్త్రీలకి యాత్రల్లో అడవి బాటలు, కాలి బాటలపై నడవడం అనేది శారీరక బలాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు ప్రీ మెనోపాజ్, మెనోపాజ్ దశల్లోని హార్మోన్ల మార్పులను ఎదుర్కునే శక్తిని ఇచ్చే వ్యాయామంగా ఉంటుంది.
– హైకింగ్, ట్రెక్కింగ్, నడక ఒక రకంగా బహిరంగ సాహజ యాత్ర రూపంలో ఉండే పూర్తి శారీరక వ్యాయామం. ఓర్పుని, బలాన్నీ పెంచే వ్యాయామం. కొండలపైకి ఎక్కుతున్నప్పుడు పిరుదులు, తొడ ముందరి క్వాడ్రిసెప్స్ కండరాలు, తొడ వెనుక హోమ్ స్ట్రింగ్ కండరాలు ఎక్కువగా పని చేస్తాయి. అదే కిందికి దిగేటప్పుడు కాలి చీలమండలు, తుంటి శరీర మధ్యభాగం చురుకుగా మారి శరీర స్థిరత్వాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే చెట్ల వేళ్లు, రాళ్లు, ఎగుడు దిగుడు దారుల్లో ప్రయాణించడం శరీర సమతుల్యతను సవాలు చేస్తూ ఉంటుంది. కాళ్లు, శరీర మధ్య భాగానికి స్థిరత్వాన్ని ఇచ్చే కండరాలను ఉత్తేజపరచి దఢపరుస్తుంది.
– హైకింగ్, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. హదయస్పందన రేటును పెంచడం, రక్త ప్రసరణ వేగాన్ని పెంచడమే కాదు కండరాలకు ఆక్సిజన్, ఇతర పోషకాలను రక్తం ద్వారా అందిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. హైకింగ్ అప్పుడు పైకి ఎక్కడం అనేది బరువుని మోసే పనిలాగా ఉంటుంది. కాబట్టి ఎముకల సాంద్రతని పెంచడానికి ఉపయోగపడుతుంది.
– స్త్రీలలో మెనోసాజ్ దశలో వచ్చే ఆస్టియో ఫోరోసిస్ అనే ఎముకలు వ్యాధిని నివారిస్తుంది.
గీతాంజలి, 8897791964



