కేంద్రం ప్రకటించిన ఆర్‌డీఎస్‌ఎస్‌లోకి ‘తెలంగాణ’
రాష్ర్ట మంత్రివర్గం కీలక నిర్ణయం..జూన్ 1 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం
లక్ష ఎల్‌ఐజీ, ఎమ్‌ఐజీ గృహ సముదాయాల నిర్మాణం..జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం
క్యాబినెట్ వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంలు) ప్రయివేటీకరణకు మార్గం సుగమమైంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ పంపిణీ సంస్థల పునరుద్ధరణ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్)లో చేరేందుకు రాష్ర్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకంలో చేరడం వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయని కేంద్రం ప్రకటించినా, వాటన్నింటి సారాంశం డిస్కంలను ఫ్రాంచైజ్‌లుగా చేసి ప్రయివేటుకు అప్పగించడమే ప్రధాన లక్ష్యం. వీటి అమలు కోసం కేంద్ర ప్రభుత్వం అనేక షరతులు విధించింది. 2017 జనవరి 2న అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆర్‌డీఎస్‌ఎస్‌లో చేరుతున్నామని ప్రకటించి కేంద్ర ప్రభుత్వంతో ట్రై పార్టీ ఒప్పందం చేసుకుంది. విద్యుత్ ఉద్యోగ సంఘాలతో పాటు పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఈ ఒప్పందం అమలును నిలిపివేసింది. ఇప్పుడు దీనికి ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
సబ్సిడీల కోసమే రైతు డిస్కం ఏర్పాటుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినప్పుడే విద్యుత్ ఉద్యోగులు, విద్యుత్‌రంగ నిపుణులు ఇలాంటి ప్రమాదాన్ని అంచనావేసి, ఆ ఏర్పాటును వ్యతిరేకించారు. ఇప్పుడు మంత్రివర్గ ఆమోదంతో ఆ ముసుగు తొలగిపోయినట్టు అయ్యింది. శనివారం మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు ఆర్‌డీఎస్‌ఎస్‌లో చేరుతున్నాయనీ, మెరుగైన విద్యుత్ కోసమే తాము దీనికి ఆమోదం తెలిపామని వివరించారు. గత బీఆర్‌ఎస్ సర్కార్ చేసిన నిర్ణయాన్నే తాము అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని జూన్ 1న ఆసీఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ఈ విడతలో కేటాయించనున్న 2.5లక్షల ఇండ్లలో ప్రతి నియోజక వర్గానికి 2 వేల ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. అందులో 1500 కొత్తవి కాగా, మిగతా 500 ఇండ్లు వివిద కారణాల చేత పూర్తి కాని వాటిని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. రాష్ర్టంలో ఉన్న 14,800 పూరి గుడిసె వాసులందరికి సెకండ్ ఫేస్‌లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. కోర్ అర్బన్‌లోని 24 నియోజకవర్గాల్లో ఎల్‌ఐజీ స్లాబ్ కింద లక్ష ఇండ్లు నిర్మించాలని క్యాబినెట్ నిర్ణయించిందని తెలిపారు.
అందులో 18 వేల మంది మాత్రమే స్థలాలున్నాయన్నారు. మిగతా వారికి నివసించే ప్రాంతాల్లోనే ఇండ్లు కట్టిస్తామన్నారు. ఇందుకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు. లక్ష ఇండ్లలో ఎంఐజీ స్లాబ్ కింద 30 శాతం ఇండ్లను నిర్మిస్తామనీ, వాటిని లబ్దిదారులకు నామినల్ ధరపై కేటాయించడం ద్వారా వచ్చే మొత్తాన్ని ఎల్‌ఐజీకి వెచ్చిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. 2027 గోదావరి పుష్కరాల పనులకు రూ.1,000 కోట్లు కేటాయిస్తూ మంత్రి వర్గం ఆమోదం తెలిపిందన్నారు. తొలివిడతగా రూ.300 కోట్లు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ర్టంలోని డీసీఎమ్‌ఎస్‌లను మార్క్‌ఫెడ్‌లో, తెలంగాణ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను హాకాలో విలీనం చేసేందుకు క్యాబినెట్ నిర్ణయించిందని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మిగిలిన పనులను యుధ్ద ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి భూ సేకరణకు రూ. 587 కోట్లు కేటాంచినట్టు తెలిపారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ హబ్ పాలసీని క్యాబినెట్ ఆమోదించినట్టు తెలిపారు. 2030 నాటికి రూ. 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్శించేలా ఈ పాలసీని రూపొందించినట్టు పొంగులేటి తెలిపారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల గురించి మీడియా ప్రతినిధులు అడగ్గా… ‘త్వరలో నిర్వహించబోయే క్యాబినెట్ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటాం..’ అని ఆయన చెప్పారు. విలేకర్ల సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్షణ కుమార్ కూడా పాల్గొన్నారు.



