మందు సిట్టింగ్‌లతో వల.. కత్తులతో దారుణ హత్య
నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట జిల్లా యర్కారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మౌనిక భర్త, బీఆర్‌ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో మహిళా నిందితురాలు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి కారు, బైక్, హత్యకు ఉపయోగించిన కత్తి, ఐదు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఎస్పీ నరసింహ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఈ నెల 22న జరిగిన చింతలపాటి మధు హత్య కేసును ఛేదించేందుకు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డ ప్రాంతంలో చింత సైదులు అద్దె ఇంట్లోనే హత్య జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం, టెక్నికల్ బృందాలు ఆధారాలు సేకరించాయి. ప్రధాన నిందితుడిగా యర్కారం గ్రామానికి చెందిన మిద్దె జీవన్‌ను గుర్తించారు. 2007లో జరిగిన యర్కారం గ్రామ మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో రవీందర్ కొడుకు జీవన్ ఈ హత్యకు పథకం రచించాడు. మధు బతికి ఉంటే తనకు ప్రాణహాని తప్పదనే భావనతో ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నట్టు విచారణలో జీవన్ ఒప్పుకున్నాడు. మధును హత్య చేసేందుకు జీవన్ తన స్నేహితులు సూర్యాపేట మండలం రామన్నగూడానికి చెందిన చింత సైదులు, అర్వపల్లి మండలం రామన్నగూడానికి చెందిన మేదరి ప్రసాద్ సహకారం తీసుకున్నాడు. తనకు బంధువైన యార్కరం గ్రామానికి చెందిన మిద్దె ఆనంద్‌ను కూడా ఈ కుట్రలో భాగస్వామిని చేశాడు. తాళ్లగడ్డలో సైదులు అద్దె ఇంట్లో వీరు కలిసి మద్యం తాగేవారు. ఈ క్రమంలో మధు హత్యకు గతంలోనే రెండుసార్లు ప్రయత్నించినట్టు దర్యాప్తులో తేలింది. చింత సైదులు నివాసంలో తరచూ మద్యం, దావతులు నిర్వహిస్తూ మధుతో స్నేహం కొనసాగించారు. సైదులు భార్య ముల్కలపల్లి భవానికి కూడా ఈ విషయం చెప్పి సహకరిస్తే రూ.3 లక్షలు ఇస్తామని ఒప్పించారు. తాళ్లగడ్డ ప్రాంతానికి చెందిన భరత్ చంద్‌ను కూడా కుట్రలో భాగస్వామి చేశారు.
గత శుక్రవారం మధ్యాహ్నం ‘చేపలు, మందు తీసుకొచ్చారు. దావత్ చేసుకుందాంరా’ అంటూ చింత సైదులు, మేదరి ప్రసాద్ మధుకు ఫోన్ చేసి పిలిచారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మధు అక్కడికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని వెంటనే జీవన్‌కు ఫోన్ చేసి చెప్పగా.. అతడు భరత్ ద్వారా రెండు సార్లు మద్యం పంపించాడు. సాయంత్రం మధు మద్యం మత్తులో ఉన్న సమయంలో జీవన్, ఆనంద్ ఇద్దరూ కారులో అక్కడికి చేరుకున్నారు. మేదరి ప్రసాద్ మధు చేతులు, కాళ్లు పట్టుకోగా మటన్ కోసే కత్తితో చింత సైదులు దాడి చేశాడు. అనంతరం అదే కత్తితో మధు మెడ, ముఖం, భుజాలపై జీవన్ విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి కారులో తీసుకెళ్లి యర్కారం గ్రామ శివారులోని కల్వర్టు కింద పడేశారు. మధు బైక్‌ను మిద్దె ఆనంద్ తీసుకెళ్లి బాలెంల శివారులోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో వదిలేశాడు. అదే సమయంలో సైదులు, ప్రసాద్ మరో బైకుపై వెళ్లి హత్యకు ఉపయోగించిన కత్తి, మధు సెల్‌ఫోన్‌ను అడివేముల శివారులోని కాల్వలో పడేశారు.
నమ్మదగిన సమాచారం మేరకు సూర్యాపేట రూరల్ పరిధిలోని టేకుమట్ల గ్రామం వద్ద జాతీయ రహదారి-65పై ఖమ్మం హైవే టీ-జంక్షన్ వద్ద సోమవారం ఉదయం ప్రధాన నిందితులు మిద్దె జీవన్, మిద్దె ఆనంద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి లభించిన సమాచారంతో చింత సైదులు, మేదరి ప్రసాద్, భరత్ చంద్‌ను ఈనాడు కార్యాలయం సమీపంలో ఉదయం పది గంటల సమయంలో అరెస్టు చేశారు. సైదులు భార్య భవాని ప్రస్తుతం పరారీలో ఉన్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామన్నారు. గతంలో జరిగిన హత్య కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్షలు పడిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఈ కేసులో కూడా పక్కా సాక్షాధారాలతో కోర్టులో బలమైన చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. ఈ కేసులో బాగా పనిచేసి పర్యవేక్షణ చేసిన సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ వెంకటయ్య, రూరల్ సీఐ రాజశేఖర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, ఎస్‌ఐలు ఏడుకొండలు, శివతేజ, మహేందర్ నాథ్, రూరల్ ఎస్‌ఐ బాలు నాయక్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని, పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బందిని, టెక్నికల్ టీంను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ఎస్‌ఐలు ఏడుకొండలు, శివతేజ పాల్గొన్నారు.
హత్యకు ప్రతీకారమే మధు హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



