కార్పొరేటీకరణ–ప్రైవేటీకరణకు బీజేపీ ఉత్సాహం
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరణ ఆగ్రహం
నవతెలంగాణ – కాటారం
కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా పక్కన పెట్టిందని భారత విద్యార్థి సమైక్య (ఎస్ఎఫ్ఐ) జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరణ తీవ్రంగా విమర్శించారు. సోమవారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేసిన ప్రకటనలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి చేసిన కేటాయింపులు తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయని తెలిపారు.
కేంద్ర బడ్జెట్లో మొత్తం రూ.13,92,89,000 కోట్లలో విద్యారంగానికి కేవలం 2.6 శాతం మాత్రమే కేటాయించడం విద్యపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. జిడిపిలో కనీసం 6 శాతం విద్యపై ఖర్చు చేయాలన్న లక్ష్యానికి ఈ కేటాయింపులు చాలా దూరంగా ఉన్నాయని విమర్శించారు.
పాఠశాల విద్యకు కేవలం రూ.83,562 కోట్లు మాత్రమే కేటాయించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకుండా పోతాయన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక పాఠశాలలు మూసివేతకు గురవుతుండగా, ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాల లేమి ఉన్నా వాటిని తీర్చే ఉద్దేశం బీజేపీ ప్రభుత్వానికి కనిపించడం లేదని మండిపడ్డారు.
ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో విద్యారంగానికి తగిన బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలు విద్య హక్కు నుంచి మరింత దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇది ప్రత్యక్షంగా పేద విద్యార్థులపై దాడేనని స్పష్టం చేశారు.
అలాగే ఉన్నత విద్య కోసం కేటాయించిన రూ.55,727 కోట్లు విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలలు, పరిశోధనా సంస్థల అవసరాలకు ఏమాత్రం సరిపోవని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం విద్యను సామాజిక బాధ్యతగా కాకుండా వ్యాపారంగా మారుస్తూ కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణకు తలుపులు తెరిచిందని ఆరోపించారు.
పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేసిన ఈ బడ్జెట్ను వెంటనే సవరించాలని, కొఠారి కమిషన్ సూచనల ప్రకారం విద్యారంగానికి కనీసం 35 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాటారం డివిజన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



