Thursday, May 28, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివైద్యవిద్యలో కనిపించని సంక్షోభం

వైద్యవిద్యలో కనిపించని సంక్షోభం

- Advertisement -

భారతదేశంలో వైద్యుడు అంటే ఇప్పటికీ ఒక ప్రత్యేక గౌరవం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో “డాక్టర్” అనే పదం కేవలం ఒక వృత్తి కాదు, అది కుటుంబాల ఆశ, సామాజిక స్థానం, ఆర్థిక భద్రత, జీవిత విజయానికి ప్రతీక. అందుకే చిన్న వయసు నుంచే వేలాది మంది విద్యార్థులు పోటీ పరీక్షల ఒత్తిడిలోకి వెళ్తున్నారు. ఎంబీబీఎస్ సీటు కోసం సంవత్సరాల శ్రమ. ఆ తర్వాత మరో పెద్ద యుద్ధం-పీజీ ప్రవేశ పరీక్ష. ఒకే మూడు గంటల పరీక్ష భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి వెళ్లిపోయింది. పీజీ సీటు వస్తే కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటాయి. “ఇక జీవితం సెట్ అయిపోయింది” అనుకుంటారు. కానీ ఆ సీటు సాధించిన తర్వాత చాలామంది యువ డాక్టర్లు ఎదుర్కొంటున్న వాస్తవం మాత్రం చాలా కఠినంగా ఉంది. వైద్య విద్యలోని ఈ కనిపించని సంక్షోభం గురించి ఇప్పుడు సమాజం, ప్రభుత్వాలు, వైద్య సంస్థలు నిజాయితీగా చర్చించాల్సిన అవసరం వచ్చింది. తమిళనాడులో అనస్తీషియా పీజీ విద్యార్థిని సుగిర్త సెల్వకుమార్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా వైద్య విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. రోజుకు ఇరవై గంటల పని, తీవ్రమైన మానసిక ఒత్తిడి, సీనియర్ల ప్రవర్తన తనను ఆ స్థితికి నెట్టాయని ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొంది. కొద్దిరోజులు చర్చ జరిగింది. తర్వాత మళ్లీ మౌనం నెలకొంది. కానీ, సమస్య మాత్రం అలాగే కొనసాగుతోంది.

ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చిన వివరాల ప్రకారం గత ఐదేళ్లలో కనీసం 58 మంది పీజీ వైద్య విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, వైద్య విద్యా వ్యవస్థలో పెరుగుతున్న మానసిక సంక్షోభానికి హెచ్చరిక. జాతీయ వైద్య కమిషన్ నిర్వహించిన సర్వేలో సుమారు 37 వేల మంది వైద్య విద్యార్థులు మానసిక ఆరోగ్య సమస్యలు, ఆత్మహత్య ఆలోచనలు ఉన్నట్లు స్వయంగా వెల్లడించారు. ఇవి బయటపడిన సంఖ్యలు మాత్రమే. చాలా మంది ఇప్పటికీ మౌనంగానే బాధపడుతున్నారనే అభిప్రాయం వైద్య వర్గాల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా వైద్య విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ఆందోళన పెరుగుతోంది. 2016లో జెఎఎంఎ జర్నల్‌లో ప్రచురితమైన విశ్లేషణ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్లలో దాదాపు 28 శాతం మంది డిప్రెషన్ లేదా డిప్రెసివ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు తేలింది. అంటే ఈ సమస్య వ్యక్తిగత బలహీనత కాదు, వైద్య శిక్షణ నిర్మాణంలో ఉన్న లోపాలకు సంబంధించినది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితి కూడా పెద్దగా భిన్నంగా లేదని రెసిడెంట్ డాక్టర్లు చెబుతున్నారు. గత కొన్నేళ్లలో రెండు రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలను భారీగా ప్రారంభించాయి.

తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ కూడా ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒక మెడికల్ కాలేజీ లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఇది ఆరోగ్య రంగానికి అవసరమైన పెట్టుబడే. కానీ భవనాలు పెరగడం మాత్రమే సరిపోదు. అందులో పనిచేసే యువ డాక్టర్ల పని పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది కూడా అంతే ముఖ్యం. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, కింగ్ కోఠి వంటి ఆస్పత్రులు రోజూ వేలాది మంది రోగులతో నిండిపోతుంటాయి. వరంగల్ ఎంజీఎం, నిజామాబాద్, ఖమ్మం వంటి ప్రాంతీయ బోధనా ఆస్పత్రుల్లో కూడా ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ కేజీహెచ్, గుంటూరు, కర్నూలు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులు భారీ రోగుల భారాన్ని మోస్తున్నాయి. ఈ వ్యవస్థలో అసలు ఆధారం ఎవరు అంటే, పీజీ రెసిడెంట్ డాక్టర్లే. ఒక పీజీ డాక్టర్ జీవితం బయటివారికి కనిపించేది కాదు. ఉదయం వార్డు రౌండ్స్‌తో మొదలయ్యే రోజు ఎప్పుడు ముగుస్తుందో చాలాసార్లు వారికి కూడా తెలియదు. ఎమర్జెన్సీ కేసులు, ఐసీయూలు, ప్రసూతి గదులు, ఆపరేషన్ థియేటర్లు, రాత్రి డ్యూటీలు, సెమినార్లు, థీసిస్ పని, పరీక్షల సిద్ధత- అన్నీ ఒకేసారి నడుస్తుంటాయి. చాలామంది రెసిడెంట్లు వరుసగా 24 నుంచి 36 గంటల వరకు నిద్ర లేకుండా పని చేస్తున్నామని చెబుతున్నారు.

ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే- పీజీ విద్యార్థులను క్రమంగా “చౌకబారు మానవ వనరు”గా ఉపయోగించే పరిస్థితి ఏర్పడింది. రోగులను చూడటంతో పాటు ల్యాబ్ పనులు, స్కాన్లు జరిగాయా చూడటం, ఇతర విభాగాలతో సమన్వ యం చేయడం, ఫార్మాలిటీలు పూర్తి చేయడం వంటి అనేక పనులు కూడా వారిపైనే పడుతున్నాయి. అంటే వారు కేవలం విద్యార్థులు కాదు, ఆస్పత్రి వ్యవస్థను నడిపించే ప్రధాన శ్రమశక్తిగా మారిపోయారు. ఇది కేవలం సిబ్బంది కొరత సమస్య మాత్రమే కాదు. వైద్య విద్యలో చాలా కాలంగా కొనసాగుతున్న ఒక ప్రమాదకర భావజాలం కూడా ఉంది – “మేము కూడా ఇలాగే కష్టపడ్డాం, మీరు కూడా పడాలి” అనే భావన. నిద్ర లేకుండా పని చేయడం, ఆకలితో డ్యూటీలు చేయడం, సెలవులు తీసుకోకపోవడం- ఇవన్నీ గొప్పతనంగా చూపించే సంస్కృతి ఇంకా కొనసాగుతోంది. కొందరు రెసిడెంట్లు స్నానం చేసి వచ్చినా, అల్పాహారం చేసినా సీనియర్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తారని పేర్కొన్నారు.వైద్య రంగంలో క్రమశిక్షణ అవసరం. కానీ క్రమశిక్షణ పేరుతో అవమానం, మానసిక వేధింపులు సాధారణం కావడం ప్రమాదకరం. “నువ్వు ఈ సీటుకు అర్హుడు కాదు”, “నీ వల్ల ఏమీ కాద” వంటి వ్యాఖ్యలు యువ డాక్టర్ల ఆత్మ విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇప్పటికే అలసట, ఒత్తిడిలో ఉన్న వ్యక్తులపై ఇలాంటి మాటలు మరింత మానసిక భారంగా మారతాయి.మహిళా రెసిడెంట్ డాక్టర్ల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. ప్రస్తుతం చాలా మెడికల్ కాలేజీల్లో మహిళా విద్యార్థుల సంఖ్య యాభై శాతం దాటుతోంది. అయినా పెళ్లి, గర్భధారణ, చిన్నపిల్లల సంరక్షణ వంటి అంశాల్లో అవగాహనలేని వ్యాఖ్యలు, ఒత్తిళ్లు ఎదురవుతున్నా యని వైద్య వర్గాల్లో వినిపిస్తోంది. రాత్రి డ్యూటీలు, భద్రత సమస్యలు కూడా అదనపు భారమే.

ఈ పరిస్థితి చివరకు రోగుల భద్రతపైనా ప్రభావం చూపుతుంది. నిద్రలేని, అలసిపోయిన డాక్టర్ తీసుకునే నిర్ణయాల్లో పొరపాట్ల అవకాశాలు పెరుగుతాయి. అమెరికాలో రెసిడెంట్ డాక్టర్ల పని గంటలను వారానికి 80 గంటలకు పరిమితం చేసే విధానాలు అమల్లో ఉన్నాయి. అక్కడ జరిగిన అధ్యయనాలు పని గంటలు తగ్గించిన తర్వాత వైద్యపరమైన పొరపాట్లు, రోగులపై ప్రతికూల ప్రభావాలు తగ్గినట్లు చూపించాయి. అంటే “ఎక్కువ పని = మంచి శిక్షణ” అనే భావనకు శాస్త్రీయ ఆధారాలు బలంగా లేవు.ఇక్కడ మరో ముఖ్యమైన అంశం- పీజీ సీటు వదిలివేయడంపై భారీ జరిమానాలు. కొన్ని రాష్ట్రాల్లో ఐదు లక్షల నుంచి నలభై లక్షల వరకు సీట్ లీవింగ్ ఫీజులు ఉన్నాయి. అంటే మానసికంగా ఇబ్బంది పడుతున్నా, ఆరోగ్యం దెబ్బతిన్నా చాలామంది బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇది ఒక రకంగా ఆర్థిక బంధనమే. ఇలాంటి పరిస్థితుల్లో ఫిర్యాదు ఎందుకు చేయరని చాలామంది ప్రశ్నిస్తారు. కానీ వ్యవస్థలో భయం బలంగా పనిచేస్తోంది. థీసిస్ నిలిపివేస్తారనే భయం, పరీక్షల్లో ఇబ్బందులు పెడతారనే అనుమానం, మరింత వేధింపులు ఎదురవు తాయనే ఆందోళన రెసిడెంట్లను మౌనంగా ఉంచుతోంది.తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల ఆధారపడటం పెరుగుతోంది. ఆరోగ్యశ్రీ, బస్తీ దవాఖానాలు, కొత్త మెడికల్ కాలేజీలు వంటి కార్యక్రమాలతో వైద్య సేవలు విస్తరించడం మంచి పరిణామమే.

కానీ అదే సమయంలో మానవ వనరులు, బోధనా ప్రమాణాలు, పని పరిస్థితులు కూడా సమానంగా మెరుగుపడాలి. లేకపోతే సేవల విస్తరణ మొత్తం రెసిడెంట్ డాక్టర్ల భుజాలపైనే పడుతుంది. ఇప్పుడు అవసరమైనది వ్యక్తిగత సహనాన్ని పొగడటం కాదు, వ్యవస్థను సరిచేయడం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగిన సంఖ్యలో సీనియర్ రెసిడెంట్లు, నాన్-పీజీ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ ఉద్యోగులను నియమిం చాలి. ప్రతి పనీ పీజీ విద్యార్థులపై పడే పరిస్థితి తగ్గాలి. పని గంటలపై స్పష్టమైన నియంత్రణ అవసరం. నిరంతర 24 గంటలకుపైగా డ్యూటీలను క్రమంగా తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలి.ప్రతి మెడికల్ కాలేజీలో స్వతంత్ర మానసిక ఆరోగ్య సహాయ వ్యవస్థ అవసరం. గోప్య కౌన్సెలింగ్ సేవలు, వేధింపులపై స్వతంత్ర విచారణ వ్యవస్థలు ఉండాలి. పీజీ విద్యార్థులు భయపడ కుండా సమస్యలు చెప్పగల వాతావరణం కల్పించాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ ఆరోగ్య రంగంలో ముందంజలో ఉండాలని ఆశిస్తున్న రాష్ట్రాలు. కొత్త మెడికల్ కాలేజీలు నిర్మించడం, సూపర్ స్పెషాలిటీ సేవలు విస్తరిం చడం అవసరం. కానీ ఆ వ్యవస్థను నడిపిస్తున్న యువ డాక్టర్ల మానసిక ఆరోగ్యం, గౌరవం, జీవన నాణ్యత కూడా అంతే ముఖ్య మైనవి. రోగులను కాపాడే చేతులు నిశ్శబ్దంగా విరిగిపోకుండా కాపాడటం కూడా ఒక ఆరోగ్య విధానమే.

డాక్టర్‌ రమాదేవి, 9490300863

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -