నవతెలంగాణ – అశ్వారావుపేట : జూన్ 3,4, 5 తేదీల్లో అశ్వారావుపేట శ్రీశ్రీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్న సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) మండల కమిటీ పిలుపునిచ్చింది. అలాగే అశ్వారావుపేట మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యురాలిగా ఎన్నికైన సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యురాలు, ఐద్వా డివిజన్ నాయకురాలు తగరం నిర్మలను అభినందిస్తూ, ఆమె ఎన్నికకు సహకరించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్, కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది.
శనివారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్‌లో కో-ఆప్షన్ సభ్యురాలు తగరం నిర్మల అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య మాట్లాడుతూ, రాజకీయ శిక్షణా తరగతులకు ఎంపికైన ప్రతినిధులు మొదటి రోజు నుంచే సకాలంలో హాజరై మూడు రోజులపాటు నిర్వహించే వివిధ అంశాలపై బోధనలను పూర్తిగా అవగాహన చేసుకోవాలని సూచించారు.
పార్టీ మండల కమిటీ సభ్యురాలు, మహిళా సంఘం నాయకురాలు తగరం నిర్మల మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలిగా ఎన్నిక కావడం సీపీఐ(ఎం)కు శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు చిరంజీవి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్, మండల కార్యదర్శి సోడెం ప్రసాద్, మండల కమిటీ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు, మడకం గోవిందు తదితరులు పాల్గొన్నారు.



