రెండో టైటిల్‌పై ఇరు జట్ల గురి
బెంగళూరుతో గుజరాత్ ఢీ
రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ఐపీఎల్19 అంతిమ సమరానికి రంగం సిద్ధం. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఆతిథ్య జట్టు గుజరాత్ టైటాన్స్ రెండో టైటిలే లక్ష్యంగా నేడు బరిలోకి దిగుతున్నాయి. గత సీజన్లో ఇక్కడ చాంపియన్‌గా నిలిచిన ఆత్మవిశ్వాసంతో ఆర్సీబీ, సొంతగడ్డ అనుకూలతతో టైటాన్స్ విజయంపై దీమాగా ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ టైటిల్ పోరు నేడు.
నవతెలంగాణ-అహ్మదాబాద్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)19 సీజన్లో అత్యుత్తమ జట్లు టైటిల్ పోరుకు సై అంటున్నాయి. ఒకరిద్దరి ప్రదర్శనపై ఎక్కువగా ఆధారపడకుండా సమిష్టిగా రాణిస్తూ.. ఫైనల్‌కు చేరుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ నేడు అంతిమ సమరంలో తాడోపేడో తేల్చుకోనున్నాయి. తొలి టైటిల్ కోసం 18 ఏండ్లు ఎదురుచూసిన బెంగళూరు.. వరుసగా రెండో టైటిల్‌పై కన్నేయగా.. ఐదేండ్లలో మూడోసారి ఫైనల్‌కు చేరుకున్న గుజరాత్ టైటాన్స్ సైతం రెండో టైటిల్‌పై ఆశలు పెట్టుకుంది. గత ఎనిమిది సీజన్లుగా క్వాలిఫయర్1లో నెగ్గిన జట్టునే ఐపీఎల్ ట్రోఫీ వరిస్తోంది. మరి నేడు ఫైనల్లో ఆ సంప్రదాయం కొనసాగుతుందా? టైటాన్స్ ఆ రికార్డును బ్రేక్ చేస్తుందా? ఆసక్తికరం.
జోరుమీదున్న ఆర్సీబీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భీకర ఫామ్‌లో ఉంది. దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్, వెంకటేశ్ అయ్యర్ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో కదం తొక్కుతుండగా.. విరాట్ కోహ్లి నిలకడగా రాణిస్తున్నాడు. భారీ స్కోర్లు నమోదు చేయటం, భారీ లక్ష్యం ఛేదించటం ఆర్సీబీకి వెన్నతో పెట్టిన విద్య!. బలమైన బ్యాటింగ్ లైనప్‌కు బలమైన బౌలింగ్ దళం ఆర్సీబీ అతిపెద్ద బలం. భువనేశ్వర్ కుమార్, హాజిల్‌వుడ్ పవర్‌ప్లేలో, డెత్ ఓవర్లలో గొప్పగా రాణిస్తున్నారు. కృనాల్ పాండ్య, సుయాశ్ శర్మలు మాయ చేసేస్తున్నారు. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణిస్తే ఆర్సీబీ వరుసగా రెండో సీజన్లో ఐపీఎల్ చాంపియన్‌గా నిలువటం లాంఛనమే.
ఆశల పల్లకిలో టైటాన్స్
గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్1లో ఓడినా.. అహ్మదాబాద్ వేదికగా లీగ్ మ్యాచ్‌లో బెంగళూరును 155 పరుగులకే పరిమితం చేసి గెలుపొందింది. సొంతగడ్డపై టైటాన్స్‌కు తిరుగులేని రికార్డుంది. టైటాన్స్ పేసర్లు కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ త్రయం గొప్పగా రాణిస్తున్నారు. రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్ మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. సొంతగడ్డపై బౌలర్లు మెరిస్తే టైటాన్స్‌కు తిరుగుండదు. బ్యాట్‌తో శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోశ్ బట్లర్, వాషింగ్టన్ సుందర్ టైటాన్స్‌కు కీలకం కానున్నారు. భారీ లక్ష్యాలను ఛేదించటంలో టైటాన్స్‌కు మంచి రికార్డు లేదు. క్వాలిఫయర్1 ప్రదర్శన పునరావృతం చేయాలని ఆర్సీబీ చూస్తుండగా.. లీగ్ మ్యాచ్ ప్రదర్శన పునరావృతంపై టైటాన్స్ ఆశలు పెట్టుకుంది.
పిచ్, వాతావరణం
గత సీజన్ ఐపీఎల్ ఫైనల్ సైతం అహ్మదాబాద్‌లోనే జరిగింది. నిరుడు టైటిల్ పోరుకు ఉపయోగించిన పిచ్‌నే నేటి మ్యాచ్‌కు సిద్ధం చేశారు. ఇదే పిచ్‌పై లీగ్ దశలో టైటాన్స్ చేతిలో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ అనుకూలం. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువ. ఫైనల్ మ్యాచ్‌కు వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది. వర్షం సూచనలు లేవని సమాచారం.
తుది జట్లు (అంచనా)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లి, వెంకటేశ్ అయ్యర్/ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), కృనాల్ పాండ్య, టిమ్ డెవిడ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రోమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, జోశ్ హాజిల్‌వుడ్, రసిఖ్ సలాం, జాకబ్ డఫ్ఫీ.
గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), బి. సాయి సుదర్శన్, జోశ్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జేసన్ హోల్డర్, రాహుల్ తెవాటియ, రషీద్ ఖాన్, ఆర్. సాయి కిశోర్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.



