Sunday, May 31, 2026
E-PAPER
Homeకవితకాలం ఓ నిశ్శబ్దపు ముఖచిత్రం

కాలం ఓ నిశ్శబ్దపు ముఖచిత్రం

- Advertisement -

ఊరి పొలిమేరల దారుల్లో
సాయంత్రపు చీకట్లు ముసురుకుంటూ
నెమ్మదిగా అడుగులేస్తుంటే
వెన్నెలతో తడిసిన నేల
గతకాలపు స్మృతుల్ని
నిశ్శబ్దంగా తడుముతోంది
ఆకాశమంతా ఏదో చెప్పాలనుకుని
మాటల్ని మౌనంలో దాచుకుంది
రాత్రి ఇక్కడ నిలిచిపోయిన చిత్రంలా
మనసుల మీద పరుచుకుంటోంది
ప్రతి ఇంట్లోనూ ప్రత్యేకమైన కలల సందడి
అరుగు మీద కూర్చొని విన్న జోలపాటలు
వాకిట్లో పాడిన జానపదాలు
ఇప్పుడు
స్మృతుల మూలల్లో
మాత్రమే వినిపిస్తున్నాయి
యంత్ర వేగాన్ని యాంత్రికంగా
అందుకున్న కాలం
మనుషుల మధ్య పరుచుకున్న
దూరాల్ని పెంచుతోంది
ఒకప్పుడు పచ్చిక బయళ్ళ పరిమళం
పల్లె ఊపిరైతే
ఇప్పుడు కాంక్రీట్‌ గోడల మధ్య
బంధీ అయిన ప్రకృతి
తననే తాను వెతుక్కుంటోంది
నెపాన్ని కాలంపైనో,
పరిస్థితులపైనో నెట్టేస్తే
మార్పు రాదు
మనిషి చేతుల్లోనే ఈ నేల భవిష్యత్తు ఉంది
మరిచిపోతున్నవి సంప్రదాయాలు కాదు
మనిషిని మనిషిగా నిలబెట్టిన
సహజమైన ఉన్నత అనుబంధాలు.

– ఎన్‌. లహరి, 9885535506

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -