ఇరాన్‌పై
అమెరికా యుద్ధం ఎఫెక్ట్
గల్ఫ్ నుంచి తిరిగొస్తున్న కార్మికులు
ఎగుమతుల క్షీణతతో ఉపాధి సంకటం
ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టని మోడీ సర్కారు
కేంద్రం
తీరుపై సర్వత్రా
తీవ్ర విమర్శలు
ఆర్థిక నిపుణులు, మేధావుల
హెచ్చరికలు
న్యూఢిల్లీ :పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థలోని రెండు ప్రధాన ఉపాధి మార్గాలను గట్టిగా దెబ్బ తీస్తోంది. ఒకవైపు గల్ఫ్ దేశాల్లో పని చేసే భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి స్వదేశానికి తిరిగి వస్తున్నారు. మరోవైపు తోలు, వస్త్రాలు, గాజు ఉత్పత్తుల వంటి కార్మిక ఆధారిత ఎగుమతి రంగాలు భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. భారత్‌లో మోడీ పాలనలో ఇప్పటికే నిరుద్యోగం తీవ్రమైంది. ఉద్యోగాలు లేక, తక్కువ జీతాలతో సమస్యలతో పోరాడుతున్న దేశ యువతకు ప్రస్తుత పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
గల్ఫ్ దేశాల్లో తగ్గిన ఉద్యోగ అవకాశాలు
గతకొన్ని దశాబ్దాలుగా గల్ఫ్ దేశాలు లక్షలాది మంది భారతీయులకు ఉపాధి కేంద్రాలుగా ఉన్నాయి. ముఖ్యంగా యూపీ, కేరళ, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి లక్షల మంది అక్కడ పని చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కానీ ఇరాన్ యుద్ధం, చమురు రవాణా సంక్షోభం, ఆర్థిక అనిశ్చితి కారణంగా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. సౌదీ అరేబి యాలో జ్యువెలరీ దుకాణంలో నెలకు రూ.30 వేల వరకు సంపాదించిన మహమ్మద్ ఖురేషీ అనే యువకుడు ఇప్పుడు కాన్పూర్‌లో బంధువుల టీ స్టాల్ వద్ద పని చేస్తూ కేవలం మూడో వంతు ఆదాయంతో జీవనం సాగిస్తున్నాడు. “సౌదీలో జీవితం సులభంగా ఉండేది. ఇక్కడ బతుకు చాలా కష్టం. యుద్ధం త్వరగా ముగిసి మళ్లీ గల్ఫ్‌కు వెళ్లాలని కోరుకుంటున్నాను” అని మహ్మద్ ఖురేషీ చెప్పాడు.భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు ఏడు శాతం వృద్ధిని నమోదు చేస్తుందని కేంద్ర ప్రభు త్వం గొప్పగా చెప్పుకుంటున్నది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నా యని విశ్లేషకులు వివరిస్తున్నారు. దేశంలో ప్రతి సంవత్సరం ఉద్యోగ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్న 60 నుంచి 70లక్షల మంది యువతకు సరిపడా ఉపాధి అవకాశాలు లేవని ఆర్థిక నిపుణులు హెచ్చ రిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
తీవ్ర ఒత్తిడిలో తోలు పరిశ్రమ..
లక్షలాది మందిపై ప్రభావం
యూపీలోని కాన్పూర్‌లో గల తోలు పరిశ్రమ లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు 500 మందికి పైగా కార్మికులతో నడిచిన కింగ్స్ ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీ ఇప్పుడు సగం సామ ర్థ్యంతోనే పనిచేస్తోంది. ఇంధనం, గ్యాస్, రవాణా ఖర్చులు పెరగడం, విదేశీ డిమాండ్ తగ్గడం వల్ల నియామకాలు నిలిచిపోయాయని యజమాని తాజ్ ఆలమ్ తెలిపారు. కాన్పూర్ ఒక్కటే భారత వార్షిక ఆరు బిలియన్ డాలర్ల తోలు ఎగుమతుల్లో దాదాపు నాలుగో వంతు వాటా కలిగి ఉంటుంది. ఈ రంగంపై నేరుగా లేదా పరోక్షంగా ఐదు లక్షల మందికిపైగా ఆధారపడి ఉన్నారని తోలు ఎగుమతి దారుల మండలి ఉపాధ్యక్షుడు ముక్తారుల్ అమీన్ చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలో సుమారు 90 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం 2025లో 4.4 శాతంగా ఉన్న గల్ఫ్ ఆర్థిక వృద్ధి 2026లో 1.3 శాతానికి పడిపోవచ్చు. దీనితో అక్కడ ఉద్యోగ అవకాశాలు మరింత తగ్గే ప్రమాదం ఉంది.
ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టని కేంద్రం
గల్ఫ్ దేశాలపై అతిగా ఆధారపడిన వలస ఉపాధికి ప్రత్యామ్నాయాలు సృష్టించలేకపోవడం, దేశీయ పరిశ్రమలకు స్థిరమైన రక్షణ కల్పించకపోవడం, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సరైన మద్దతు లేకపోవడంతోనే ఇప్పుడు లక్షలాది కుటుంబాలు అస్థిరతను ఎదుర్కొం టున్నాయని వారు అంటున్నారు. అలాగే యువతకు నాణ్యమైన శాశ్వత ఉద్యోగాల బదులు తాత్కాలిక గిగ్ పనులు, కాంట్రాక్ట్ ఉద్యోగాలే పెరుగుతుండగా, ప్రభుత్వం మాత్రం జీడీపీ గణాంకాలపై మాత్రమే దృష్టి పెట్టిందనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గే ప్రమాదం ముందే కనిపిస్తున్నప్పటికీ, దానికి సరిపోయే విద్యా-ఉపాధి విధానాలు తీసుకురావడంలో కేంద్రం ఆలస్యం చేసిందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్
ఇక మరోవైపు ఏఐ ప్రభావం కూడా వైట్‌కాలర్ ఉద్యోగాలపై పడుతోంది. తయారీ, ఐటీ, లాజిస్టిక్స్ రంగాల్లో స్థిర ఉద్యోగాల బదులు కాంట్రాక్ట్, గిగ్, అసంఘటిత ఉపాధి పెరుగు తోందని నిపుణులు చెప్తున్నారు. భారత్‌లో నిరుద్యోగ రేటు ఏప్రిల్‌లో 5.2 శాతానికి పెరిగింది. పట్టణ యువతలో నిరుద్యోగం దాదాపు 14 శాతానికి చేరింది. చదువుకున్న యువత తక్కువ జీతాలు, తమ నైపుణ్యాలకు సరిపోని పనుల్లో ఇరుక్కు పోతున్నారని ఆర్థికవేత్తలు అంటున్నారు.
మధ్య్రపాచ్యంలో ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రభావం భారత్‌పై పడుతోంది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు కుదేలవ్వడంతో అక్కడి భారతీయులు స్వదేశీ బాట పడుతున్నారు. ఇక భారత్‌లో చమురు రవాణా ఖర్చులు పెరగడం, ఎగుమతుల మందగమనం, కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం… ఇవన్నీ భారత యువత భవిష్యత్తుపై మబ్బులు కమ్ముతున్నాయి. ఇక భారత్‌ను వేగంగా అభివృద్ధి చెందుతోన్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ప్రచారం చేసుకుంటున్న మోడీ ప్రభుత్వం… రాబోయే పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమైంది. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టడంలో ఉదాసీనంగా వ్యవహరించింది. దేశంలో ఉద్యోగాల కొరత, తక్కువ జీతాలు, అస్థిర ఉపాధి పెరుగుదలను అడ్డుకోలేక పోతున్నదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
మోడీ సర్కారు
ఘోర వైఫల్యం
కేంద్రంలోని మోడీ సర్కారు భారత్ ‘ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ’ అనే ప్రచారాన్ని బలంగా వినిపిస్తోంది. కానీ దేశంలో ఉద్యోగాల సృష్టిలో మాత్రం ప్రభుత్వ ఘోర వైఫల్యం బయటపడుతోందనే విమర్శలు ఉన్నాయి. మోడీ ప్రభుత్వం ‘మేకిన్ ఇండియా’, ‘స్కిల్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’ వంటి భారీ నినాదాలు ఇచ్చినా, దేశంలో కార్మిక ఆధారిత తయారీ రంగాలను బలోపేతం చేయడంలో మాత్రం కేంద్రం దారుణంగా విఫలమైందని ఆర్థిక విశ్లేషకులు, మేధావులు అంటున్నారు. ప్రపంచ సంక్షోభాలకు భారత ఉపాధి వ్యవస్థ ఎంత బలహీనంగా మారిందో ఈ పరిస్థితి చూపిస్తోందని వివరిస్తున్నారు.



