Friday, February 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్‌ బంధం

బీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్‌ బంధం

- Advertisement -

రాష్ట్రాన్ని దోచుకోవడంలో రెండూ ఒక్కటే..బీజేపీని ఒక్క సీటూ గెలవనీయం
12 ఏండ్ల కిందట మోడీ హామీ ఏమైంది..?
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిరాశే..
కేసీఆర్‌ను అరెస్టు చేసే దమ్ముందా?
కేసీఆర్‌ ఏటీఎమ్‌ ‘కాళేశ్వరం’పై ఎందుకు విచారించడం లేదు?
ప్రజాప్రభుత్వంలో రెండేండ్లలో రూ.లక్ష కోట్ల సంక్షేమం
జంట నగరాలుగా వరంగల్‌-కరీంనగర్‌ను అభివృద్ధి చేస్తాం : చొప్పదండి సభలో సీఎం రేవంత్‌రెడ్డి
రూ.50 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి / చొప్పదండి
”మున్సిపల్‌ ఎన్నికల్లో మా పార్టీ కార్యకర్తలు బీజేపీని ఒక్క సీటు కూడా గెలవనీయరు. 12 ఏండ్ల కిందట మోడీ మహబూబ్‌నగర్‌ వచ్చినప్పుడు పాలమూరు కు జాతీయ హౌదా కల్పిస్తానని చెప్పారు.. ఇప్పుడు బీజేపీ నూతన అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు మహబూబ్‌నగర్‌ సభకు హాజరయ్యారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టుకూ నిధులు కేటాయించ లేదు. పైగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఎవరేం చేశారో తేలుద్దాం రండి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతోంది.. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అవయవదానం చేసి మరీ బీజేపీని గెలిపించింది.. ఈ రెండు పార్టీల మధ్య ఉన్నది ఫెవికాల్‌ బంధం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు.

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గుమ్లాపూర్‌ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధ్యక్షతన గురువారం నిర్వహించిన ‘ప్రజాపాలన-ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారిందని స్వయంగా ప్రధాని మోడీయే విమర్శించారని, మరి విచారణ జరపడానికి ఎందుకు వెనకాడుతున్నారని అన్నారు. ఆయనను అరెస్టు చేసే దమ్ము బీజేపీ ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. ‘అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా ఆరు నెలలుగా సీబీఐ విచారణ ఎందుకు చేపట్టడం లేదని..? ఫార్ములా-ఈ రేసు కేసులో ఐఏఎస్‌ అధికారులపై విచారణకు అనుమతి కోరితే కేంద్రం నుంచి స్పందన లేదని విమర్శించారు. దీన్ని బట్టే బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయం తేటతెల్లమవుతోందన్నారు. కేంద్ర
మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డికి ధైర్యముంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాలని సవాల్‌ విసిరారు.

జంట నగరాలుగా వరంగల్‌-కరీంనగర్‌
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అభివృద్ధిపై సీఎం స్పష్టమైన హామీలిచ్చారు. కరీంనగర్‌ నగరాభివృద్ధి కోసం ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తామన్నారు. వరంగల్‌, కరీంనగర్‌ నగరాలను జంట నగరాలుగా అభివృద్ధి చేస్తామని, ఈ రెండు నగరాల మధ్య డంప్‌ యార్డు ఏర్పాటు చేసి దాని ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామని చెప్పారు. 2027లో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని ప్రకటించారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి
కరీంనగర్‌ గడ్డపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఆటలు సాగనివ్వబోమని సీఎం హెచ్చరించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాకుండా కాంగ్రెస్‌ కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు. ‘బండి సంజయ్ ఎంపీగా గెలిచి కరీంనగర్‌ మున్సిపాలిటీకి రూపాయి అయినా తెచ్చారా?, కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. పేదోళ్ల దేవుడైన సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవడానికి కూడా వారికి నామోషీ.. ఇలాంటి నాయకులకు గుణపాఠం చెప్పాలి’ అని సీఎం కోరారు.

మరో ఎనిమిదేండ్లు అధికారంలో ఉండేది తమ ప్రభుత్వమేనని, రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలుపుతామని అన్నారు. సభకు ముందు రామడుగులో రూ.45.15కోట్లతో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌, గంగాధర మండలం మధురానగర్‌లో రూ.5కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి ఆయన సభా ప్రాంగణం వద్దనే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, సంజయ్, విజయరమణారావు, మక్కాన్‌ సింగ్‌ ఠాగూర్‌ పాల్గొన్నారు.

70 వేల ఉద్యోగాల భర్తీ.. ఎల్బీ స్టేడియంలో లెక్క తేలుద్దాం!
‘రెండేండ్లలో ఏం చేశారని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.. మేం ఏం చేశామో చెబితే మీ గుండెలు పగులుతాయి’ అంటూ విపక్షాలనుద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. రెండేండ్లలో నిరుద్యోగుల కోసం 70వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, దమ్ముంటే ఎల్బీ స్టేడియానికి రావాలని, ఒక్కొక్కరి తలలు లెక్కపెడదామని సవాల్‌ చేశారు. వంద నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నామని, హాస్టల్‌ విద్యార్థులకు డైట్‌, కాస్మొటిక్‌ చార్జీలు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు.

వ్యవసాయాన్ని పండుగ చేయడమే కాంగ్రెస్‌ లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు. ‘వరి వేస్తే ఉరి అని గత ప్రభుత్వం అంటే.. మేము రైతులు పండించిన ప్రతి గింజనూ బోనస్‌ ఇచ్చి కొంటున్నాం. 25లక్షలా 35వేల మంది రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశాం. 9రోజుల్లోనే రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. రెండేండ్లలో రైతుల కోసమే లక్ష కోట్లు ఖర్చు చేశాం. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తున్నాం’ అని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -