Wednesday, June 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం‘స్టేట్‌ ‌సీక్రెట్‌’ ‌గావ్‌‌కావ్‌.. ‘లీక్‌ ‌సీక్రెట్‌’ ‌నీట్‌

‘స్టేట్‌ ‌సీక్రెట్‌’ ‌గావ్‌‌కావ్‌.. ‘లీక్‌ ‌సీక్రెట్‌’ ‌నీట్‌

- Advertisement -

​చైనాలో ప్రశ్నాపత్రాలకు సాయుధ భద్రత
ఏఐ నిఘా, డ్రోన్లు, ఫేషియల్‌ ‌రికగ్నైషన్‌, జైలుశిక్ష‍లతో కట్టుదిట్టమైన వ్యవస్థ
1.33 కోట్ల మంది రాసే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవేశపరీక్ష‍
భారత్‌‌లో మాత్రం పునరావృతమవుతున్న లీకేజీలు
పరీక్ష‍ా వ్యవస్థను 
ప్రక్ష‍ాళన చేయాలి : 
విద్యావేత్తలు, మేధావులు


భారత్‌‌లో అత్యంత ప్రతిష్టాత్మక నీట్‌-‌యూజీ ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్ష‍ా కేంద్రాల అవకతవకలు వరుసగా వివాదాలకు దారితీస్తున్న వేళ.. చైనా మాత్రం తన జాతీయ ప్రవేశ పరీక్ష‍ ‘గావ్‌‌కావ్‌’ను ఒక అభేద్య కోటలా మార్చింది. 22 లక్ష‍ల మంది రాసే నీట్‌‌తో పోలిస్తే.. 1.33 కోట్ల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యే గావ్‌‌కావ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవేశపరీక్ష‍. ప్రశ్నపత్రాలను ‘స్టేట్‌ ‌సీక్రెట్స్‌’గా పరిగణించడం నుంచి డ్రోన్లు, కృత్రిమ మేధ (ఏఐ) నిఘా వరకు చైనా అమలు చేస్తున్న భద్రతా చర్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని విద్యావేత్తలు, మేధావులు చెప్తున్నారు. భారత్‌.. చైనా నుంచి పాఠాలు నేర్చి, పరీక్ష‍ా వ్యవస్థను ప్రక్ష‍ాళన చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

బీజింగ్‌ : భారత్‌‌లో వైద్య ప్రవేశ పరీక్ష‍ నీట్‌-‌యూజీ మరోసారి లీకేజీ ఆరోపణలతో వివాదాల్లో చిక్కుకుంది. మే 3న జరిగిన పరీక్ష‍కు 22 లక్ష‍ల మంది విద్యార్థులు హాజరుకాగా.. కేవలం ఎనిమిది రోజులకే ప్రశ్నపత్రం లీక్‌ అయిందన్న ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో పరీక్ష‍ను రద్దు చేయాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విద్యావేత్తలు, మేధావులు చైనా అమలు చేస్తున్న కఠిన విధానాలను ఉదాహరణగా చూపుతున్నారు. దేశంలో ప్రశ్నపత్రాల లీకేజీలపై చైనా తరహా కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడుతున్నారు.

​గావ్‌‌కావ్.. చైనా జీవితాన్ని మలిచే పరీక్ష‍
చైనాలో గావ్‌‌కావ్‌ ‌పరీక్ష‍ను 1977లో ప్రవేశపెట్టారు. ప్రతి ఏడాదీ జూన్‌‌లో నిర్వహించే గావ్‌‌కావ్‌ (‌నేషనల్‌ ‌కాలేజ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌) ‌దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రవేశాలకు ప్రధాన ద్వారం వంటిది. గతేడాది ఈ పరీక్ష‍కు 1.33 కోట్ల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. చైనీస్‌ ‌భాష, గణితం, విదేశీ భాష వంటి ప్రధాన అంశాలపై పరీక్ష‍ నిర్వహిస్తారు. విద్యార్థి భవిష్యత్‌ ‌విద్య, ఉద్యోగ అవకాశాలు, సామాజిక స్థితిగతులను ఈ పరీక్ష‍ా ఫలితాలు ప్రభావితం చేస్తాయి.
​ప్రశ్న పత్రాలకు ‘స్టేట్‌ ‌సీక్రెట్‌’ హోదా
గావ్‌‌కావ్‌ ‌ప్రశ్నపత్రాలను చైనా ప్రభుత్వం ‘స్టేట్‌ ‌సీక్రెట్స్‌‌’గా పరిగణిస్తుంది. అంటే.. గావ్‌‌కావ్‌ ‌ప్రశ్నపత్రాలకు దేశ భద్రతా పత్రాల స్థాయి రక్ష‍ణ కల్పిస్తారు. ఇందులో భాగంగా ప్రశ్నపత్రాల తయారీ నుంచి ముద్రణ వరకు మొత్తం ప్రక్రియ అత్యంత రహస్యంగా సాగుతుంది. ఇందుకు ప్రత్యేక భద్రత కలిగిన కేంద్రాలు ఉంటాయి. కొన్నిసార్లు జైళ్లలోనే ప్రశ్నపత్రాల ముద్రణ జరగటం గమనార్హం. అక్కడ 24 గంటలు సీసీటీవీ నిఘా, భద్రతా సిబ్బంది పర్యవేక్ష‍ణ ఉంటుంది. ముద్రించిన ప్రశ్నపత్రాలను జీపీఎస్‌ ‌ట్రాకింగ్‌, వీడియో మానిటరింగ్‌‌తో కూడిన సాయుధ పోలీసు భద్రత మధ్య తరలిస్తారు. భద్రపర్చే కేంద్రాల్లోకి ప్రవేశించడం చాలా కష్టమైన పని.

​మోసాలకు జైలు శిక్ష
పరీక్షల్లో కాపీ కొట్టడం, మోసపూరిత నెట్‌వర్క్‌లు నడపడం, ఒకరి బదులు ఇంకొకరు పరీక్ష రాయడం వంటి చర్యలను చైనా.. క్రిమినల్ నేరాలుగా పరిగణిస్తుంది. నేర తీవ్రతను బట్టి 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానాలు, పరీక్ష ఫలితాల రద్దు, భవిష్యత్ పరీక్షలపై నిషేధం వంటివి విధించబడతాయి. గావ్‌కావ్‌లో ప్రశ్నపత్రాల లీకేజీలు లేకపోవడం చైనా అమలు చేస్తున్న కఠిన భద్రతా వ్యవస్థకు నిదర్శనంగా విద్యావేత్తలు, మేధావులు చెప్తున్నారు.
భారత్‌ ‌నేర్వాల్సిన పాఠమేమిటి?
నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న నేపథ్యంలో భారత్‌ ‌చైనా నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని విద్యావేత్తలు, మేధావులు చెప్తున్నారు. ప్రశ్నాపత్రాల భద్రత, సాంకేతిక నిఘా, కఠిన శిక్షలు, బాధ్యతాయుత పరీక్షా నిర్వహణ వంటి అంశాల్లో పొరుగు దేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వారు అభిప్రాయపడుతున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షల విషయంలో విశ్వసనీయత, పారదర్శకత, భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని వారు అంటున్నారు.

​ఎగ్జామ్‌ సెంటర్ల వద్ద పటిష్ట భద్రత
పరీక్షా రోజున చైనా ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. మెటల్ డిటెక్టర్లు, స్మార్ట్ సెక్యూరిటీ గేట్లు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు గుర్తించే పరికరాలు, ఫేషియల్ రికగ్నిషన్, వేలిముద్రలు, ఐరిస్ స్కానింగ్‌‌ల ద్వారా విద్యార్థుల గుర్తింపును నిర్ధారిస్తారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో వైర్‌లెస్ కమ్యూనికేషన్‌ను అడ్డుకునేందుకు సిగ్నల్ జామర్లు ఏర్పాటు చేస్తారు. గావ్‌కావ్ భద్రతలో కృత్రిమ మేధ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోంది. ఏఐ ఆధారిత కెమెరాలు విద్యార్థుల ప్రవర్తనను నిరంతరం గమనిస్తాయి. పదేపదే చుట్టూ చూడటం, గుసగుసలు మాట్లాడటం, అనుమానాస్పద కదలికలు వంటి అంశాలను గుర్తించి హెచ్చరికలు పంపిస్తాయి. డ్రోన్లు, ప్రత్యేక పోలీసు దళాలు (స్వాట్‌) పరీక్షా కేంద్రాల పరిసరాల్లో పర్యవేక్షణ నిర్వహిస్తాయి.
​పరీక్ష కోసం ఆగిపోయే నగర జీవితం
గావ్‌కావ్ పరీక్ష‍ నిర్వహించే రోజుల్లో చైనాలో సాధారణ జీవితం కూడా మారిపోతుంది. అక్కడ విమాన మార్గాలను మళ్లిస్తారు. కార్ల హారన్‌లపై ఆంక్షలు విధిస్తారు. నిర్మాణ పనులు నిలిపివేస్తారు. ప్రచార కార్యక్రమాలను నిషేధిస్తారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో శబ్దం చేసే కార్యకలాపాలకు అనుమతి ఉండదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -