Wednesday, June 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో 30 మంది భారతీయుల అరెస్టు

అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్టు

- Advertisement -


తనిఖీల్లో భాగంగా మొత్తం 52 మంది అదుపులోకి
ఫెడరల్‌ చట్టాల ప్రకారం అందరినీ స్వదేశాలకు పంపేందుకు చర్యలు
​న్యూయార్క్ :
అమెరికాలో అక్రమంగా నివసిస్తూ వాణిజ్య ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్న 30 మంది భారతీయులను అధికారులు అరెస్టు చేశారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో వీరు పట్టుబడ్డారు. ఫెడరల్‌ చట్టాల ప్రకారం వీరిని త్వరలోనే స్వదేశాలకు పంపించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అరిజోనా రాష్ట్రంలోని యుమా సెక్టార్‌ బోర్డర్‌ పట్రోల్‌ బృందాలు మే 11 నుంచి 15 వరకు ‘ఆపరేషన్‌ చెక్‌మేట్‌’ పేరుతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాయి. ఈ చర్యల్లో అమెరికాలో అక్రమంగా ఉంటున్న 52 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన 52 మందిలో 36 మంది సెమీ-ట్రక్‌ డ్రైవర్లుగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 30 మంది భారతీయులు కాగా, మిగిలిన ఆరుగురు మెక్సికో, ఎల్‌ సాల్వడార్‌, రష్యా దేశాలకు చెందినవారు. వీరిలో కొందరు కాలిఫోర్నియా, న్యూయార్క్‌, వాషింగ్టన్‌, వర్జీనియా రాష్ట్రాల్లో జారీ చేసిన కమర్షియల్‌ డ్రైవింగ్‌ లైసెన్సులు కలిగి ఉన్నట్లు తేలింది. మరికొందరి వద్ద ఎలాంటి డ్రైవింగ్‌ లైసెన్సు కూడా లేదని అధికారులు వెల్లడించారు.

చెల్లుబాటు కాని పత్రాలతో ఉద్యోగాలు
పట్టుబడిన వారిలో ఎక్కువ మంది వద్ద ఉద్యోగ అనుమతి పత్రాలు (ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్స్‌) ఉన్నప్పటికీ, అవి ప్రస్తుతం చెల్లుబాటు కానివిగా మారినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ పత్రాలు గతంలో జారీ అయినప్పటికీ వాటి గడువు ముగిసిందని లేదా నిబంధనల ప్రకారం చెల్లవని అధికారులు పేర్కొన్నారు. దీంతో వారంతా అమెరికా వలస చట్టాలను ఉల్లంఘించినట్లుగా నిర్ధారించి, ఫెడరల్‌ నిబంధనల మేరకు తదుపరి చర్యలు ప్రారంభించారు.

ట్రంప్‌ ప్రభుత్వ కఠిన వైఖరి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రభుత్వ హయాంలో విదేశీ డ్రైవర్ల నియామకాలపై మరింత కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయి. అర్హతలు లేని విదేశీయులు కమర్షియల్‌ ట్రక్కులు, బస్సులు నడిపేందుకు అవసరమైన లైసెన్సులు పొందకుండా చర్యలు తీసుకోవాలని అమెరికా రవాణా శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అక్రమ వలసలను అరికట్టడం, ప్రజా భద్రతను పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వం పలు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది.

ఇటీవల పెరిగిన ఆందోళనలు
గత కొన్ని నెలలుగా అమెరికాలో భారతీయ మూలాలున్న కొంతమంది ట్రక్ డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యారనే ఆరోపణలతో అరెస్టవడం చర్చనీయాంశమైంది. కొన్ని ఘటనల్లో ప్రాణనష్టం కూడా సంభవించడంతో వాణిజ్య వాహనాల డ్రైవర్ల అర్హతలు, వలస హోదాపై అమెరికా అధికారులు మరింత దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఆపరేషన్‌ చెక్‌మేట్‌లో పెద్ద సంఖ్యలో భారతీయులు పట్టుబడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం అరెస్టయిన వారందరిపై వలస చట్టాల ప్రకారం ప్రక్రియ కొనసాగుతుండగా, త్వరలోనే వారిని వారి స్వదేశాలకు పంపించే అవకాశం ఉందని అమెరికా అధికారులు తెలిపారు. ఇక 2025లో 3,800మందికి పైగా భారతీయులను అమెరికా డిపోర్ట్‌ చేసినట్లు ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -