ప్రశాంతమైన సముద్ర తీరం ఆధునిక కాలంలో ఒత్తిడి జీవనానికి గురి అవుతున్న వారికి ఎంతో ఊరట కలిగిస్తుంది. సముద్ర తీరాలు కొన్ని చోట్ల ప్రశాంతంగా వుండగా, మరి కొన్నిచోట్ల అనేక క్రీడలు, బోటు విహారాలు వంటివి కలిగి బిజీగా ఉంటూ అక్కడ వుండే ప్రతి ఒక్కరికి ఆనందాలను ఇస్తాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సముద్ర తీరాలు ప్రస్తుతం అనేక తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా తీరప్రాంత కోత, పెరుగుతున్న సముద్ర మట్టాలు, కాలుష్యం, సముద్ర జీవుల పర్యావరణ వ్యవస్థల క్షయం, అనధికార నగరీకరణ వంటివి ప్రధాన సమస్యలు.
భూమి ఉపరితలంలో దాదాపు 71% సముద్రంతో కప్పబడి ఉంది. బహుశా దాని పరిమాణాన్ని బట్టి చూస్తే ఆశ్చర్యం లేదు. మొక్కలు, చేపల నుండి సరీసపాలు, క్షీరదాల వరకు భూగ్రహం కంటే 90% ఎక్కువ జీవ జాతులకు ఇది నిలయం. సముద్రం కీలకమైన పర్యావరణ పాత్రను పోషిస్తుంది. మనం పీల్చే ఆక్సిజన్‌లో 50% ఉత్పత్తి చేస్తుంది. గ్రహం మీద అతిపెద్ద కార్బన్ సింక్‌లలో ఒకటిగా పనిచేస్తుంది, జఉ2ని అధిక మొత్తంలో వేరు చేస్తుంది వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. సముద్రం ఇంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ అనేక జంతు వక్ష జాతులకు నిలయంగా ఉన్నప్పటికీ, వివిధ రకాల మానవ కార్యకలాపాల కారణంగా ఇది నిరంతరం ముప్పును ఎదుర్కొంటోంది. ఆధునిక కాలంలో సముద్ర తీర ప్రాంతాలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. పగడపు దిబ్బలు అంతరించిపోతున్నాయి. అడవులు ధ్వంసమవుతున్నాయి. కాలుష్యం కారణంగా సముద్ర జీవుల వద్ధికి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. సముద్రాల్లోకి స్వచ్ఛమైన జలం కాకుండా మురికి నీరు చేరుతోంది. స్వచ్ఛమైన జలం, సముద్ర జలం మధ్య సమతూకంలో ప్రతికూల మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ సముద్రాలకు నష్టం చేకూర్చడంతోపాటు స్థానికంగా జీవనోపాధి అవకాశాలు తగ్గిపోవడానికి కారణమవుతున్నాయి. ఫలితంగా ఆహారం, ఉపాధి కోసం సముద్రాలపై ఆధారపడే దేశాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఈ ముప్పు మరింత పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం లేదని నిపుణులు తేల్చిచెబుతున్నారు.
ఫిషింగ్ పరికరాలు, పెద్ద ఓడలు, కొత్త ట్రాకింగ్ టెక్నాలజీలలో పురోగతితో, ప్రపంచ వ్యాప్తంగా అనేక చేపల నిల్వలు గణనీయంగా తగ్గాయి. ఖండాంతర షెల్ఫ్ ప్రాంతాలలో చేపల నిల్వలు అతిగా దోపిడీకి గురైనట్లు విస్తతంగా పరిగణించ బడుతున్నాయి. చేపల నిల్వలను తగ్గించడంతో పాటు, స్థిరమైన చేపలు పట్టే పద్ధతులు సముద్ర పర్యావరణం పై ఇతర ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఉదాహరణకు, డ్రెడ్జింగ్, ట్రాలింగ్ వంటి కొన్ని ఫిషింగ్ పద్ధతులు సముద్ర ఆవాసాలు సముద్రపు అడుగుభాగంలో నివసించే జీవులకు విస్తతమైన నష్టాన్ని కలిగిస్తాయి.

చమురు తెట్టు
సాగరాల్లోని జీవవైవిధ్యానికి నష్టం కలిగించే కారకాల్లో చమురు తెట్టు ముఖ్యమైనది. చమురు రవాణాకు తోడు సముద్ర గర్భాల్లో చమురు కోసం అన్వేషణ జరుగుతుంటుంది. ఇలాంటప్పుడు చమురు నీళ్లలోకి లీకవుతుంది. అది తెట్టులా ఏర్పడటంతో ఆ ప్రాంతంలో ఉండే సముద్ర జీవులకు ఆమ్లజని అందక అవి మరణించే ప్రమాదం ఉంటుంది.
అధిక విస్తీర్ణంలో వ్యాపించే తెట్టు కారణంగా చేపలు వంటి సముద్రజీవుల శరీరాల్లోకి అది ప్రవేశించి, వాటి పునరుత్పాదకతను సైతం దెబ్బతీస్తుంది. చమురు తెట్టు కారణంగా అవి ఊపిరాడక మరణిస్తాయి. కొన్ని జలచరాలు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదముంది. తీర ప్రాంతాలకు కొట్టు కొచ్చే చమురు తెట్టు వల్ల ఉభయ చరాలకు పెనుముప్పు పొంచి ఉందంటూ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రోజూ వేల సంఖ్యలో నౌకలు సముద్రాల్లో తిరుగుతుంటాయి. ఇవన్నీ పెద్ద మొత్తంలో నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్లను వెలువరిస్తాయి. వీటివల్ల పర్యావరణంతో పాటు, సముద్ర జీవావరణంపైనా తీవ్ర దుష్ప్రభావాలు పడుతున్నాయి. ఈ వాయువులు ఓజోన్ పొరను ధ్వంసం చేయడం ద్వారా గ్రీన్హౌస్ ఎఫెక్టు, భూతాపానికి దారితీస్తాయి. సముద్రాల్లో తిరిగేటప్పుడే ఈ వాయువులు వెలువడుతుండటంతో సముద్ర జలాలూ వేడెక్కుతున్నాయి. నౌకలు ప్రయాణించేటప్పుడు వాటి పొగ గొట్టాల నుంచి పెద్ద మొత్తంలో నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ వంటి వాయువులు వెలువడుతున్నాయి.
సముద్రాల్లో చేపల వేట నియంత్రణ చర్యలను బలోపేతం చేయాలని, ముప్పు తప్పించుకోవాలంటే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించాలని, సముద్ర వాణిజ్యంలోనూ నియంత్రణ అవసరమని అంటున్నారు. భవిష్యత్తు వైపు దష్టిసారిస్తే ఇప్పుడు మనమేం చేయాలో తెలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. మనుషుల కార్యకలాపాల వల్ల సముద్రాలకు ఇప్పటికే చాలా నష్టం జరిగిందని, ఇప్పటికైనా మేల్కొనకపోతే 2050 నాటికి ఈ నష్టం రెండింతలు అవుతుందని తేల్చిచెప్పారు. ఇది నిజంగా ఊహించని పరిణామం అని పేర్కొన్నారు. సముద్రాలపై ప్రతికూల ప్రభావాలు వేగంగా పెరుగుతుండడమే అసలు సమస్య.

కోలుకోలేని దశకు జీవావరణ వ్యవస్థ
సముద్రాలపై వాతావరణ ప్రభావాలే తప్ప మనుషుల ప్రభావం అంతగా ఉండదని ఇన్నాళ్లూ భావించారు. భూమిపై జనవాసాల కంటే సముద్రాల విస్తీర్ణం ఎన్నో రెట్లు ఎక్కువ కాబట్టి ఇలాంటి అంచనాకొచ్చారు. కానీ, మనుషుల ప్రభావం గణనీయంగా ఉంటున్నట్లు తేలింది. మన మహా సముద్రాలు చాలా కాలంగా మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు రసాయనాలు వంటి అన్ని రకాల వ్యర్థాలను ఉద్దేశపూర్వకంగా డంపింగ్ చేసే ప్రదేశంగా ఉపయోగించ బడుతున్నాయి. ఇటీవలి కాలంలో, అనేక దేశాలలో విధాన మార్పులు సముద్రం వ్యర్థాలను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి లేదనే అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
వాతావరణాన్ని క్రమబద్ధం చేసేవి ఆ నీలి సాగరాలే. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల కోసం మనం అనుక్షణం పీల్చుకునే ప్రాణవాయువును అధిక శాతం అందించేవి ఆ సముద్రాలే. అసలు జీవ వైవిధ్యానికి నిలయాలు ఆ జలనిధులే. అపార సంపదలకు నిలయాలు ఆ జలరాశులే. కానీ అందుకు ప్రతిఫలంగా ప్రపంచ మానవాళి చేస్తున్న పని ఏమిటి చూపుతున్న కతజ్ఞత ఎలాంటిది. ఏటా కోటీ పదిలక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఆ సాగర జలాలలోకి విసిరివేయడమే. అంటే ప్రతి నిమిషానికి ఒక ట్రక్కుడు తుక్కు ప్లాస్టిక్ ఆ అందాల సముద్రాలలో పారబోస్తున్నారు. 51 ట్రిలియన్‌ల మైక్రో ప్లాస్టిక్ శకలాలు మన సముద్రాలలో ఉన్నాయి. సముద్రాలలోకి చేరే 80 శాతం ప్లాస్టిక్ వ్యర్థానికి మూలం నదులు. దాదాపు వేయి నదుల ద్వారా ఈ వ్యర్థాలు చేరుతున్నాయి. నిజానికి ప్రతి జలమార్గాన్ని, వనరుని మనిషి ప్రధానంగా ప్లాస్టిక్ వ్యర్థంతో, ఇతర వ్యర్థాలతో నాశనం చేసుకుంటున్నాడు. ఐక్యరాజ్య సమితి చెప్పినట్టు నేడు ప్లాస్టిక్ కాలుష్యం ఒక మహమ్మారి స్థాయికి చేరుకుంది.
సాగరాలను కలుషితం, విషపూరితం చేస్తున్న సమస్య (మెరైన్ ప్లాస్టిక్ పొల్యుషన్) ప్రపంచ జనాభాకు సంబంధించిన సమస్య. ప్రకతి ఎదుర్కొంటున్న పెను విపత్తు. చేయని పాపానికి భవిష్యత్ తరాలకు ముందే తగులుతున్న శాపం. ప్లాస్టిక్ వ్యర్థాలలో ఎక్కువ భాగం దహనం చేయబడుతుంది, తద్వారా కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది – లేదా అది పర్యావరణంలోకి చేరుతుంది. ప్రతి సంవత్సరం దాదాపు 9 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరుతున్నాయి. లక్షలాది సముద్ర జంతువులు ప్లాస్టిక్‌లను ఆహారంగా భావించడం వల్ల లేదా దానిలో చిక్కుకోవడం వల్ల చనిపోతున్నాయి. ఈ పెనుభూతం మీద పోరాటం ఎప్పుడో మొదలయింది.
ఉష్ణోగ్రతల పెరుగుదలతో సముద్రాలు వేడెక్కుతుండడం ఒక అంశమైతే, నియంత్రణ లేని చేపల వేట, సముద్ర వాణిజ్యం వంటివి సమస్య తీవ్రతను మరింత పెంచుతున్నట్లు వెల్లడయ్యింది. మానవుల చర్యల వల్ల సముద్రాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఉష్ణమండల ప్రాంతాలతోపాటు ధ్రువ ప్రాంతాల్లో జీవావరణ వ్యవస్థ ఇప్పటికే కోలుకోలేని దశకు చేరుకుంది.సాగర తీరాల్లో చేపట్టే పూడికతీత (డ్రెడ్జింగ్) ప్రభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. పూడికతీత కారణంగా సముద్ర గర్భాల్లో ఉండే గడ్డి జాతులు, పగడపు దిబ్బలు తీవ్రంగా దెబ్బతింటాయి. డ్రెడ్జింగ్ పనులు చేపట్టే ప్రాంతాల్లో గుడ్డు, లార్వా దశల్లో ఉండే జలచరాలు మొత్తంగా అంతరించిపోతాయి. సముద్ర జీవావరణానికి ఇన్ని నష్టాలున్నా- నౌకాయానం సాఫీగా సాగేందుకు వీలుగా పూడికతీతను విస్తతంగా చేపడుతూనే ఉన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మంచు కొండగా రికార్డుకెక్కిన ఏ23ఏ ఐస్బర్గ్ విచ్ఛిన్నమైపోయింది. తన రికార్డును కోల్పోయింది. ఈ ఐస్బర్గ్ ముక్కలుగా విడిపోయింది. మరికొన్ని వారాల్లోనే పూర్తిగా చెదిరిపోయే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్పారు. ఏ23ఏ ఐస్బర్గ్ అమెరికాలోని రోడ్ ఐలాండ్ స్టేట్ విస్తీర్ణంతో సమానంగా ఉండేది. దీని బరువు లక్ష కోట్ల టన్నుల పైమాటే. అంటార్కిటికాలో 1986లో ఏర్పడింది. దక్షిణ అట్లాంటిక్ సముద్రంలోని సౌత్ జార్జియా దీవి వైపు ప్రయాణిస్తూ ముక్కలైంది. ప్రస్తుతం ఇది హూస్టన్జట్ విస్తీర్ణానికి తగ్గిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద మంచు కొండగా డీ15ఏ ఐస్బర్గ్ రికార్డుకెక్కింది. ఏ23ఏ నుంచి విడిపోయిన మంచు ముక్కలకు ఏ23 డీ, ఏ23 ఈ, ఏ23ఎఫ్ అనే పేర్లు పెట్టారు. కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా సముద్రం వేడెక్కడం వల్ల ఏ23ఏ ఐస్బర్గ్ విచ్ఛిన్నమైనట్లు సైంటిస్టులు స్పష్టంచేశారు. ఇలా మంచు కొండలు ముక్కలై కరిగిపోతే సముద్ర మట్టాలు పెరిగే ప్రమాదం ఉంటుంది.
సముద్రంలో చమురు సహజ వాయువు నిక్షేపాలు భూకంప ఎయిర్‌గన్‌లతో గుర్తించబడ్డాయి, ఇవి చాలా బిగ్గరగా ఉంటాయి, సముద్ర జంతువులు చనిపోతాయి లేదా చెవిటివిగా మారతాయి. చమురు వాయువును వెలికితీసినప్పుడు లేదా రవాణా సమయంలో, ప్రమాదాల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రమాదకర రసాయనాలు సముద్రంలోకి చిమ్ముతాయి.

ఐరాస అంచనా మేరకు గడచిన థాబ్ద కాలంలోనే ఉష్ణోగ్రత సగటున ఒక డిగ్రీ సెల్సియస్ మేర పెరిగింది. భూతాపం మరో 0.5 డిగ్రీలు అధికమైతే ప్రకతి వైపరీత్యాలు ఇంకా దారుణంగా విరుచుకు పడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రకతి విపత్తులకు మానవుల స్వయం కతాపరాధాలే ప్రధాన కారణమని ప్రపంచ దేశాలు గుర్తించినా సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమవు తున్నాయి.
సంపన్న దేశాలు, వాటిని నియంత్రించే బహుళజాతి సంస్థలు తమ లాభాలు మేటలు వేసేందుకు భూగోళ మంతటా, గనుల త్రవ్వకాలు., అడవుల నరికివేత, శిలాజ ఇంధనాల మితిమీరిన ఉత్పత్తి, వినియోగమూ వంటి విధానాలను యధేచ్ఛగా చేపడుతున్నాయి. దీని ఫలితంగా తీవ్రమైన పర్యావరణ సమస్యలూ ఉత్పన్నమౌతున్నాయి. గనుల త్రవ్వకాలు, శిలాజ ఇంధనాల వెలికితీత, మార్కెట్ల కోసం సామ్రాజ్యవాద దేశాల మధ్య పోటీ, లాభాల కోసం మితిమీరిన వెంపర్లాడటలలో తమకు ఏ ప్రమేయమూ లేకుండానే సామాన్యులు సమిధలైపోతున్నారు. పర్యావరణమూ విధ్వంసమౌతున్నది. ఋతువులు తప్పిన వరదలు మహాసముద్రం ఉపరితల జలాలు అత్యధికంగా వేడెక్కడం ప్రధాన కారణమని పర్యావరణ పరిశోధకులు చెబుతున్నారు.
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి, 8008 577 834



