190.76 కిలో మీటర్ల పొడవున విస్తరణకు
కేంద్ర క్యాబినేట్ ఆమోదం
ఎన్‌హెచ్-63లోని ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల ప్రాజెక్ట్
జగిత్యాల-కరీంనగర్
నాలుగు లైన్ల విస్తరణ
చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.10 వేల కోట్లు సాయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో రెండు నేషనల్ హైవేల అభివృద్ధి, విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జాతీయ రహదారి-63లోని ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల ప్రాజెక్ట్‌ను హైబ్రీడ్ యాన్యుటీ మోడల్(హెచ్ఎంఏ), జాతీయ రహదారి-563లోని జగిత్యాల-కరీంనగర్ ప్రాజెక్టును నాలుగు లైన్ల విస్తరణకు ఆమోదం తెలిపింది. రూ.7,597.16 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్ట్‌లను మూడు ప్యాకేజీలలో నిర్మించనున్నారు. ఈ మేరకు బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదించింది. జనసాంద్రత, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు బైపాస్‌లు, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా అధునాతన డిజైన్, ఓపెన్ టోలింగ్ విధానంతో ఈ ప్రాజెక్ట్‌లు చేపట్టనున్నట్టు తెలిపింది. అలాగే, ఈ ప్రాజెక్టులతో ఆర్మూర్-మంచిర్యాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 1.30 గంటల, జగిత్యాల-కరీంనగర్ మధ్య 45 నిమిషాలు తగ్గనుందని తెలిపింది. నిరంతరాయ ప్రయాణం వల్ల ఇంధన వినియోగం, వాహన నిర్వహణ ఖర్చులు (వీఓసీ) తగ్గడంతోపాటు కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించింది. దీంతో పాటు ఈ భారీ నిర్మాణ పనులతో స్థానికంగా 34.43 లక్షల పనిదినాల ప్రత్యక్ష ఉపాధి, 42.7 లక్షల పనిదినాల పరోక్ష ఉపాధి లభించనుంది. తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చడంలో ఈ నాలుగు లేన్ల రహదారుల విస్తరణ మైలురాయిగా నిలవనుందని అభిప్రాయపడింది.
ఆర్మూర్-జగిత్యాలలో 63.600 కిలోమీటర్ల విస్తరణ
జాతీయ రహదారి-63 అభివృద్ధిలో భాగంగా మొత్తం రెండు విభాగాలుగా పనులు సాగనున్నాయి. ఇందులో ఆర్మూర్-జగిత్యాలలకు సంబంధించి మొత్తం 63.600 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ విభాగాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) పద్ధతిలో చేపట్టనున్నారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల మీదుగా సాగే ఈ రహదారిలో అంక్సాపూర్, కోరుట్ల, జగిత్యాల వంటి పట్టణాల్లో నివాసా ప్రాంతాల కారణంగా తీవ్ర రద్దీ ఎదురవుతున్నట్లు పేర్కొంది. ఈ విస్తరణతో ప్రయాణికులకు పెద్ద ఉపశమనం కలగనుందని పేర్కొంది. ఈ లైన్ మొత్తం పొడవు 63.600 కిలోమీటర్ల కాగా, ఇందులో 17.95 కిలోమీటర్ల బ్రౌన్‌ఫీల్డ్, 45.65 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారిగా నిర్మించనున్నట్టు వెల్లడించింది. ఈ ప్యాకేజీ మొత్తం మూలధన వ్యయం రూ.2,471.76 కోట్లుగా పేర్కొంది. ఇందులో సివిల్ పనులకు రూ.1,266.58 కోట్లు, భూసేకరణ, ఇతర ముందస్తు పనులకు రూ.504.26 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. కాగా…రాయితీ కాలం 17.5 ఏండ్లుగా (2.5 ఏండ్ల నిర్మాణ సమయం, 15 ఏండ్ల నిర్వహణ) నిర్ణయించింది. ప్రస్తుతం ఈ మార్గంలో రోజుకు సగటున 14,949 వాహనాలు (పీసీయూ) ప్రయాణిస్తున్నాయి.
జగిత్యాల-మంచిర్యాలలో 68.295 కిలోమీటర్లు
జాతీయ రహదారి-63లోనే రెండో విభాగం కింద జగిత్యాల-మంచిర్యాలకు సంబంధించి మొత్తం 68.295 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపింది. ఇందులో బ్రౌన్‌ఫీల్డ్ కేవలం 2.05 కిలోమీటర్లు, గ్రీన్‌ఫీల్డ్ రికార్డు స్థాయిలో 66.10 కిలోమీటర్లుగా ఉంది. దీని మొత్తం మూలధన వ్యయం రూ.2,730.72 కోట్లు కాగా, సివిల్ పనులకు రూ.1,477.17 కోట్లు, భూసేకరణకు రూ.436.93 కోట్లు కేటాయించారు. దీనిని సైతం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) పద్ధతిలోనే 17.5 ఏళ్ల రాయితీ కాలంతో నిర్మిస్తారు. ప్రస్తుతం ఇక్కడ రోజుకు సగటున 12,084 వాహనాల (పీసీయూ) రాకపోకలు సాగుతున్నాయి. ఈ లైన్ తో జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లోని ప్రాంతాలను కలపనున్నారు. ఈ రెండు జిల్లాల మధ్య ఉన్న ధర్మపురి, లక్షెట్టిపేట, మంచిర్యాల వంటి ప్రాంతాల్లోని నివాసాలు, వ్యాపార సముదాయాల వల్ల ట్రాఫిక్ అంతరాయంతో పాటు ప్రయాణ సమయం పెరుగుతున్నట్లు పేర్కొంది. అయితే… కొత్తగా చేపట్టనున్న విస్తరణతో బొగ్గు గనులు, పారిశ్రామిక ప్రాంతాలకు రవాణా సులువవుతుందని కేంద్రం తెలిపింది.
జగిత్యాల-కరీంనగర్‌లో 58.866 కిలోమీటర్లు
జాతీయ రహదారి-563లోనే జగిత్యాల-కరీంనగర్ లకు సంబంధించి మొత్తం 58.866 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టనుంది. ఈ రెండు ప్రధాన నగరాల మధ్య ఉన్న జగిత్యాల, పోతారం, గంగాధర, కరీంనగర్ పరిసరాల్లో జనాభా సాంద్రత ఎక్కువగా ఉండడంతో నిరంతరం భారీ ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని నాలుగు లైన్లనుగా విస్తరిస్తారు. 58.866 కిలోమీటర్ల పొడవునా జరగనున్న ఈ ప్రాజెక్ట్ పనుల్లో … బ్రౌన్‌ఫీల్డ్ పద్ధతిలో 24.14 కిలోమీటర్లు, గ్రీన్‌ఫీల్డ్ పద్ధతిలో 34.96 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. దీని మొత్తం మూలధన వ్యయం రూ.2,394.68 కోట్లు కాగా, సివిల్ పనులకు రూ.1,455.01 కోట్లు, భూసేకరణకు రూ.394.53 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ విభాగాన్ని బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ టోల్ (బీఓటీ టోల్) పద్ధతిలో 20 ఏండ్ల రాయితీ కాలంతో (2.5 ఏండ్ల నిర్మాణ కాలంతో కలిపి) చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ మూడు ప్యాకేజీల్లో కల్లా ఇక్కడే అత్యధికంగా రోజుకు 20,446 వాహనాలు (పీసీయూ) నడుస్తున్నాయని పేర్కొంది.



