రేపే 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీల్లో ఎన్నికలు
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు
16న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక
మొదలైన తాయిలాల పర్వం
రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లకే పరిమితమైన నేతలు
భారీ సభలకు మొగ్గు చూపని పార్టీలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ మున్సిపల్ రెండో సాధారణ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. ఆరు రోజుల పాటు మోగిన మైకులు మూగబోయాయి. ఈనెల 11న రాష్ట్రంలోని 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, 13న ఓట్లను లెక్కిస్తారు. పోలింగ్‌లో ఏవైనా అవాంతరాలు జరిగితే 12న రీ పోలింగ్ నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 14న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక కోసం సంబంధిత కలెక్టర్ నియమించిన అధికారి ప్రత్యేక సమావేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్నిక నిర్వహిస్తారు. ఏదైనా కారణం చేత ఎన్నిక వీలు కాకుంటే మరుసటి రోజు ఫిబ్రవరి 17 నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జనవరి 28 నుంచి 30 వరకు నామినేషన్లను స్వీకరించారు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3న తుది అభ్యర్థుల జాబితా విడుదల చేశారు.
8,203 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు
ఎన్నికలు జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో 8,203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 25.62 మంది పురుష ఓటర్లు, 26.80 మంది మహిళా ఓటర్లు, 640 మంది ఇతరులు ఉన్నారు. బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగుతున్న ఎన్నికల నిర్వహణకు 16,031 బ్యాలెట్ బాక్స్‌లు, 137 స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేశారు.
అలాగే 136 లెక్కింపు కేంద్రాలను సిద్దం చేశారు. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు 742 జోనల్ అధికారులు, 279 ఎఫ్‌ఎస్‌టీ, 381 ఎస్‌ఎస్‌టీ టీంలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది 1,379 రిటర్నింగ్ అధికారులు, 1,547 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 9,560 పోలింగ్ ఆఫీసర్స్, 31,428 అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు మొత్తం 45,316 మంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు.
తాయిలాలు షురూ…
చేసిన అభివృద్థి, చేయాల్సిన పనులను ఎంత ఆర్భాటంగా ప్రచారం చేసినా చివరి రెండు రోజులు డబ్బు, మద్యం పంపిణి చేయందే ఓట్లు రాలని విచిత్రమైన పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ట్రెండ్ మార్చి సైలెంట్ ప్రచారానికి తెరతీశారు. దాంతో చివరి రెండు రోజులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మధ్యం, డబ్బు, ఇతర తాయిలాల పంపిణీపై దృష్టి పెట్టారు. గెలుపోటములపై ప్రభావం చూపే అధికారం, కులం, తదితర అంశాలను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వదులుకోవడం లేదు.
సద్దుమణిగిన హడావిడి
మున్సిపల్ ప్రచారంలో అన్ని పార్టీలు జోష్ మీద కనిపించాయి. ఫిబ్రవరి 3న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి గుర్తులు కేటాయించారు. 9వ తేది సాయంత్రం వరకు దాదాపు ఆరు రోజుల పాటు ప్రచారం సాగింది. పంచాయతీల్లోలాగా పెద్ద పెద్ద సభలు కాకుండా చిన్న చిన్న సమావేశాలు, కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలకు నేతలు ప్రాధాన్యత ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఆర్భాటంగా కాకుండా తమకున్న పరిధిలో అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు.
ఆరు గ్యారెంటీలపైనే కాంగ్రెస్ ఆశ
రాష్ట్రంలో మెజార్టీ మున్సిపాల్టీలను గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో మిగతా పార్టీలకంటె ఒకింత ముందు వరుసలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేశామంటూ ఆ పార్టీ ఎన్నికల్లో ప్రధానంగా ప్రచారం చేసింది. అధికారం చేపట్టిన రెండేండ్లలోనే 70 వేల ఉద్యోగాలను ఇచ్చామని చెబుతూ పట్టణ ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రోడ్‌షోలు, సభలు, సమాశాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ప్రచారం నిర్వహించారు.
హామీలను నిలదీసిన బీఆర్‌ఎస్
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలును ప్రచారంలో ఎండగట్టింది. రెండు లక్షల ఉద్యోగాలు, కళ్యాణలక్ష్మి పథకానికి తులం బంగారం, మహిళలకు రూ.2500 ఫించన్ తదితర అమల్లోకి రాని పథకాలపై ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను ఆకర్శించే ప్రయత్నాలు చేసింది. అప్పుడెలా ఉంది తెలంగాణ? ఇప్పుడెలా ఉంది తెలంగాణ? అంటూ ఫోటోలు, అంకెలను వివరిస్తూ జనంలోకి వెళ్లింది. కేసీఆర్ ప్రచారంలో పాల్గొనక పోవడంతో కేటీఆర్, హరీశ్‌రావు ఇతర నేతలు అన్నీ తామై ప్రచారం చేశారు.
మోడీనే నమ్ముకున్న బీజేపీ
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీల్లో అ పార్టీ అభ్యుర్థులు మోడీనే నమ్ముకుని ప్రచారం చేశారు. దేశంలో 12 ఏండ్ల అధికారం, హిందూ అనుకూల నినాదాలు, తమను గట్టెక్కిస్తాయని వారు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ నినాదాన్ని ఎత్తుకుంది. గతానికి భిన్నంగా ఈ సారి ప్రజల్లో మరింతగా భావోధ్వేగాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. కాషాయ పార్టీ అభ్యర్థులు ఒకటి రెండు మున్సిపాల్టీల్లో మాత్రమే ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తమదైన శైలిలో వామపక్షాల ప్రచారం
మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలు తమదైన శైలిలో ప్రచారం నిర్వహించాయి. హంగు, ఆర్భాటం లేకుండా స్థానిక సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేశాయి. సీపీఐ(ఎం) ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని పలు మున్సిపాల్టీల్లో బలమైన పోటీ ఇచ్చింది. ఆ పార్టీ మొత్తం 128 వార్డుల్లో బరిలో నిలవగా, సీపీఐ 168 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలు బూర్జువా పార్టీలకు భిన్నంగా ప్రచారం నిర్వహించడం ద్వారా ప్రత్యర్థులకు సవాల్ విసిరింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఈసీ
మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదుని హెచ్చరించింది. సోమవారం హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల పరిశీలకులు, మెదక్, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆసీఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి, ములుగు, నిర్మల్ జిల్లా కలెక్లర్లు, పోలీస్‌కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెబ్‌కాస్టింగ్, పోలింగ్ సిబ్బంది ఏర్పాటు, బందోబస్తుపై పలు సూచనలు చేసింది. ప్రచారం గడువు ముగిసిన నేపథ్యంలో పార్టీలు, అభ్యర్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ఎన్నికలకు సంబంధించి బహిరంగ సభ, ఊరేగింపు, సినిమాటోగ్రఫీ, టెలివిజన్ లేదా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించడం నిషేదిస్తున్నట్టు ఆమె తెలిపింది. ప్రజలను ఆకర్షించే ఉద్దేశ్యంతో సంగీత కచేరీ, నాటక ప్రదర్శన లేదా ఏదైనా ఇతర వినోద కార్యక్రమాన్ని నిర్వహించకూడదని పేర్కొంది. ఎన్నికల ప్రచారం కోసం మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాను ఉపయోగించడం నిషేదమని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తెలంగాణ మున్సిపాల్టీ చట్టం, 2019లోని సెక్షన్ 209 ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడుతుందని హెచ్చరించారు.


