Tuesday, February 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిషాదం..బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య

విషాదం..బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఎన్నికల ఖర్చులు, ఒత్తిడి తట్టుకోలేక మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసిన ఓ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం తెల్లవారుజామున నారాయణపేట జిల్లా మక్తల్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎస్టీలకు రిజర్వు కావడంతో ప్రధాన పార్టీలు ముగ్గురు సొంత అన్నదమ్ములనే రంగంలోకి దించాయి. ఇందులో భారతీయ జనతా పార్టీ నుండి మహదేవ్ (43), కాంగ్రెస్ నుంచి అతడి అన్న పోటీలో ఉండగా.. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వారి తమ్ముడు నామినేషన్ ఉపసంహరణ రోజున పోటీ నుంచి తప్పుకున్నాడు. పోటీలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.

అయితే, నిన్నటి నుంచి డబ్బు, మద్యం పంపిణీ జరుగుతుండడంతో.. 6వ వార్డులోనూ పంపిణీ చేయాలని పార్టీ శ్రేణులు కోరినట్లుగా సమాచారం. తాను లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు చేయగలను.. మిగతాది తన వల్ల కాదని సోమవారం పార్టీ శ్రేణులకు ఆయన తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన మహదేవప్ప మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. మహదేవప్ప ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి కావడంతో ఆ వార్డులో ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -