నవతెలంగాణ – ఆలేరు రూరల్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఆలేరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ గ్రామసభలను నిర్వహించారు.జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు జూన్ 4, 6, 8, 10 తేదీలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇందులో భాగంగా శుక్రవారం మందనపల్లి, టంగుటూరు, శారజీపేట, తూర్పుగూడెం గ్రామాల్లో మండల స్థాయి అధికారుల బృందం పర్యటించి గ్రామస్తులతో సమావేశమైంది.గ్రామసభల్లో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రభుత్వ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలోని ముఖ్య అంశాలను ప్రజలకు వివరించారు. గ్రామాల పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, మురికి కాలువల పూడికతీత,శిథిలావస్థలో ఉన్న భవనాల గుర్తింపు వంటి అంశాలపై చర్చించారు.
తహశీల్దార్ జనగణన–2027, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాలపై అవగాహన కల్పించగా, వ్యవసాయ శాఖ అధికారులు పంటల వికేంద్రీకరణ, పంట మార్పిడి,ఆధునిక సాగు పద్ధతుల గురించి రైతులకు సూచనలు అందించారు.తాగునీటి సరఫరా,పైప్‌లైన్ లీకేజీల నివారణ, క్లోరినేషన్ ప్రాముఖ్యతపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వివరించారు. ఉపాధి హామీ పథకం కింద ‘జల సంరక్షణ – మన సంరక్షణ’ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం, నీటి వనరుల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్య శాఖ అధికారులు వివరించారు.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణ, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై చైతన్యం కల్పించారు. విద్యాశాఖ అధికారులు ‘బడిబాట’ కార్యక్రమం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, అల్పాహార పథకం అమలుపై వివరించారు. అదేవిధంగా గృహాలపై సోలార్ విద్యుత్ ఏర్పాటు, ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడత గృహప్రవేశాలు, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సంబంధిత అధికారులు ప్రజలకు వివరించారు.
ఈ ప్రత్యేక గ్రామసభల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా గ్రామస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.



