Wednesday, August 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాలలో భూ మ్యూటేషన్ వివాదం

పరకాలలో భూ మ్యూటేషన్ వివాదం

- Advertisement -

తహసీల్దార్ కు, ఆర్డీవో నోటీసులు 
తహశీల్దార్ తీరుపై విమర్శలు 
నవతెలంగాణ – పరకాల 

పరకాల పట్టణంలో చోటుచేసుకున్న వివాదాస్పద భూ మ్యూటేషన్ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, కోర్టు పరిధిలో ఉన్న భూమికి పట్టా మార్పిడి చేసిన వ్యవహారంపై ఆర్డీవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆర్డీవో స్వయంగా స్పందిస్తూ, తాను సదరు తహసీల్దార్‌కు నోటీసులు జారీ చేసిన విషయాన్ని ‘నవతెలంగాణ’కు ధ్రువీకరించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తహసీల్దార్‌ వివరణ కోరామని, ఆమె ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఆర్డీవో స్పష్టం చేశారు.

ప్రభుత్వ భూమిని కాపాడి, నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత కలిగిన అధికారిణి, తనపై వస్తున్న ఆరోపణలను కనీసం పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనపై వస్తున్న మీడియా కథనాల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ, “ఎవరు ఏం రాసుకున్నా నాకేం పర్వాలేదు, వారి రాతలతో ఒరిగేదేముంది? ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉద్యోగం చేసుకుంటాం” అంటూ ఆమె తన సన్నిహితుల వద్ద చేసిన ప్రచారం సాగుతోంది. ప్రజా సేవలో ఉండి, ఇంతలా నిర్లక్ష్యంగా మాట్లాడటంపై స్థానికులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్డీవో నోటీసుల నేపథ్యంలో, తనను తాను కాపాడుకునే క్రమంలో తహసీల్దార్ అనుసరిస్తున్న తీరు మరింత అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారులు విచారణ జరిపించాల్సిన సమయంలో, హుటాహుటిన ఒక ఆర్‌ఐని క్షేత్రస్థాయి విచారణకు పంపడంపై బాధితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తహసీల్దార్ ఆడుతున్న నాటకమని, ఈ క్షేత్రస్థాయి విచారణకు ఆర్డీవో అడిగిన వివరణకు సంబంధం ఏంటని నిలదీస్తున్నారు. అక్రమ మ్యూటేషన్ జరిగినట్లు బాధితుల వద్ద ఒప్పుకున్న తహసీల్దార్, ఆ రిజిస్ట్రేషన్‌ను హోల్డ్‌లో పెడతామని మాట ఇస్తున్నప్పటికీ, అది అధికారికంగా జరిగిందా..? లేదా..? అనే దానిపై స్పష్టత ఇవ్వకపోవడం వెనుక పెద్ద కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్ ఇచ్చే వివరణ ఆధారంగా ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -