Sunday, June 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైదరాబాద్‌‌లో ‘ఆపరేషన్ కవచ్‌’

హైదరాబాద్‌‌లో ‘ఆపరేషన్ కవచ్‌’

- Advertisement -

నగరంలో 5 వేల మంది సిబ్బందితో అర్ధరాత్రి సోదాలు
562 హోటళ్లు, లాడ్జీల్లో 
ముమ్మర తనిఖీలు
క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షించిన నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్

నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగర అంతర్గత భద్రతను పటిష్టం చేయడంతోపాటు, అసాంఘిక శక్తుల కదలికలను ముందస్తుగా నిరోధించే లక్ష్యంతో నగర పోలీసుల ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ కవచ్’కు శ్రీకారం చుట్టారు. స్వయంగా సీపీ సజ్జనార్‌ ‌పర్యవేక్ష‍ణలో ‘ఆపరేషన్ కవచ్’ శాంతి భద్రతల పరిరక్ష‌ణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి ఒకే సారి 5,000 మంది పోలీస్ సిబ్బందితో తనిఖీలను ప్రారంభించారు. హోటళ్లు, లాడ్జీల్లో తనిఖీలు చేశారు. హోటల్ రిజిస్టర్లు, బస చేయడానికి వచ్చిన విజిటర్ల గుర్తింపు కార్డులను పరిశీలించారు.

క్షేత్రస్థాయి పరిశీలన
హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలోని 7 జోన్లలో అర్ధరాత్రి 11 గంటల నుంచి ఒంటిగంట వరకు కొనసాగిన ఈ సోదాల్లో మొత్తం 562 హోటళ్లు, లాడ్జీల్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ ఆపరేషన్‌లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా పాల్గొన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని, అమీర్‌పేటలోని పలు లాడ్జీలను సీపీ సందర్శించారు. గదుల కేటాయింపు ప్రక్రియ, విజిటర్ల వివరాల నమోదు విధానాన్ని పరిశీలిం చారు. లాడ్జీలలో బస చేసిన పలువురు విజిటర్లతో నేరుగా మాట్లాడి, వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, నగర సందర్శనకు గల కారణాలు.. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అత్యధికంగా ఖైరతాబాద్‌లో 119, శంషాబాద్‌లో 92, జూబ్లీహిల్స్, గోల్కొండలలో 86 చొప్పున, సికింద్రాబాద్‌లో 82, రాజేంద్రనగర్‌లో 53, చార్మినార్ జోన్‌లో 44 చోట్ల ఈ ఆపరేషన్ కొనసాగింది.

మైనర్లకు గదులివ్వొద్దు : సీపీ
హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని నగర సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని చెప్పారు. లాడ్జీకి వచ్చే ప్రతి ఒక్కరి నుంచీ గుర్తింపు కార్డుల ఒరిజనల్ ప్రతిని పరిశీలించి, దాని స్పష్టమైన నకలును సేకరించాలని ఆదేశించారు. రిజిస్టర్లలో విజిటర్ల పూర్తి సమాచారం, ఫోన్ నెంబర్లు, చెక్ ఇన్‌, చెక్ అవుట్ సమయాలను నమోదు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అసంపూర్ణ లేదా తప్పుడు సమాచారంతో గదులను కేటాయిం చరాదన్నారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ గదులను ఇవ్వొద్దని, గుర్తింపు కార్డుల్లో ఉన్న వయసును ధ్రువీకరించుకోవాలని సూచించారు. పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా త్వరలోనే నూతన డిజిటల్ విజిటర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టే దిశగా సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు.

భద్రతా నిఘాను బలోపేతం చేయడానికి హోటల్ పరిసరాలలో, ముఖ్యంగా ఎంట్రీ, ఎగ్జిట్, రిసెప్షన్ ఏరియాలు స్పష్టంగా కనిపించేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే సూచనలు కనిపించినా వెంటనే డయల్ 100కిగానీ, స్థానిక పోలీసులకుగానీ సమాచారం అందించాలని కోరారు. నిబంధనలను బేఖాతరు చేసే నిర్వాహకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో అదనపు సీపీ క్రైమ్స్ శ్రీనివాసులు, అదనపు సీపీ లా అండ్ ఆర్డర్ తఫ్షీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్, జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ నార్త్ జోన్ శ్వేత, డీసీపీలు వెంకటేశ్వర్లు, చైతన్య కుమార్ తోపాటు 7జోన్ల డీసీపీలు కిరణ్ ఖరే, శిల్పవల్లి, శ్రీనివాస్, చంద్ర మోహన్, రమణా రెడ్డి, రాజేష్, డీసీపీ సైబర్ క్రైమ్స్ అరవింద్ బాబు, డీసీపీ విమెన్ సేఫ్టీ వింగ్ లావణ్య నాయక్ జాదవ్, అదనపు డీసీపీలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -