– కామారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డులో ఓటర్ల జాబితాపై సందేహాలు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల వేళ ఓటర్ల జాబితాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని 8వ వార్డులో ఒకే ఇంటిలో కేవలం ఆరుగురు మాత్రమే నివసిస్తున్నప్పటికీ, ఆ చిరునామాకు 16 ఓట్లు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం స్థానిక ప్రజల్లో ఆందోళనకు దారితీస్తోంది.
ఇలాంటి పరిస్థితులు మరెన్ని వార్డుల్లో ఉన్నాయో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాను పరిశీలిస్తేనే ఈ లోపాలు బయటపడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలంటే అధికార యంత్రాంగం ముందుగానే జాబితాలను సమీక్షించి, తప్పులు ఉంటే వెంటనే సవరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ అంశంపై మున్సిపల్ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఓటర్ల జాబితాలో ఉన్న ఈ తేడాలను అధికారులు సవరించారా? లేక అలాగే కొనసాగుతాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య ధోరణితో పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిష్పక్షపాత నిర్వహణకు ఓటర్ల జాబితా ఖచ్చితత్వం ఎంతో ముఖ్యమని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వాట్సాప్ లో వైరల్ అవుతున్న 15 వ వార్డు ఓటర్లిస్ట్
కామారెడ్డి పట్టణంలోని 15వ వార్డులో ఎల్లంపేట గ్రామంలో మొన్న జరిగిన సర్పంచి ఎన్నికల్లో ఒకటో వార్డు మబర్గా గెలిచినా అతను 15వ వార్డులో ఓటర్ లిస్ట్ ఓటర్గా నమోదు కావడం దానిని ఓ ప్రధాన పార్టీ పట్టుకొని వాట్స్అప్ గ్రూప్లో వైరల్ చేస్తుంది. సుమారుగా వార్డులో 400 ఓట్ల వరకు దొంగ ఓట్లు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఆ వ్యక్తి కామారెడ్డి లో ఉండడని, వచ్చి వెళ్లడానికి విశ్రాంతి గది కూడా అద్దెకు లేదని అలాంటి వ్యక్తిని ఓటరుగా నమోదు చేయడం మునిసిపల్ అధికారుల నిర్రక్షానికి నిదర్శనంగా పలువురు పేర్కొంటున్నారు



