ఉద్యమానికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు
తదుపరి కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తాం :
కాక్రోచ్ జనతా పార్టీ
ముంబయి : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్‌లోని తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. జంతర్ మంతర్ వద్ద తమ ఆందోళన విజయవంతమైందని, వేలాదిమంది హాజరయ్యారని తెలిపారు. తమ ఆందోళనను దేశవ్యాప్తంగా విస్తరింపచేసేందుకు తదుపరి కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని అన్నారు. ప్రధాన్ రాజీనామా తర్వాత విద్యా వ్యవస్థను సమూలంగా సంస్కరించడానికి ఒక అజెండాను సిద్ధం చేస్తామని తెలిపారు. ఇతర దేశాల్లో ఆందోళనలతో సిజెపి ఉద్యమాన్ని పోల్చలేమని, సిజెపి జెన్ జెడ్ కోసమేనని, దీనికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని దీప్కే పేర్కొన్నారు. గత 12 ఏండ్లలో దేశ రాజకీయాలు హిందూ – ముస్లిం ఎజెండా ఆధిపత్యంతో నడుస్తున్నాయని, ఆ ఎజెండాతో నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. నీట్ పేపర్ లీక్‌కు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలని, ఎవరూ బాధ్యత తీసుకోకపోతే వ్యవస్థ సమర్థవంతంగా ఎలా పనిచేస్తుందని దీప్కే ప్రశ్నించారు. ఒకటి రెండు తప్పులు చేసినందుకే ఒక ఉద్యోగిని కంపెనీ నుండి తొలగిస్తారని, ప్రభుత్వం నిర్వహించే పరీక్షల ప్రశ్నా పత్రాలు తరచూ లీక్ అవుతున్నా ఎవరూ ఎందుకు బాధ్యత తీసుకోరని నిలదీశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే
- Advertisement -
- Advertisement -


