నలుగురికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-సత్తుపల్లి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న రైల్వే బ్రిడ్జిని ఢీకొని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని ధర్మాజీగూడెం నుంచి హైదరాబాదు వెళ్తున్న కేవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉండగా, మిగిలిన వారు సురక్షితంగా బయట పడటంతో పెను ప్రమాదం తప్పింది.
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరుకు చెందిన కేవీఆర్ ట్రావెల్ బస్సు ఏపీలోని ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం నుంచి సత్తుపల్లి మీదుగా హైదరాబాదు వెళ్తుండగా పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో జాతీయ రహదారిపై ఉన్న రైల్వే బ్రిడ్జిని బస్సు బలంగా ఢీకొట్టడంతో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై ముందు చక్రాలు ఊడిపోయాయి.
ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వీఎం బంజర పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో బస్సులో ఉన్న ప్రయాణికులను బయటికి తీసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉండగా, మిగతా వారు సురక్షితంగా బయటపడటం, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో అతి వేగంతో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ బస్సు నడపడం వల్లే బస్సు అదుపు తప్పి ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు తెలిపారు. బస్సు ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో బ్రిడ్జి కింద భాగంలో సింగరేణి గూడ్స్ రైళ్లు వెళ్లే మార్గం ఉంది. దురదృష్టవశాత్తు ఈ బస్సు బ్రిడ్జి పైనుంచి రైల్వే ట్రాక్ పై పడుంటే హై టెన్షన్ విద్యుత్ తీగలు తగిలి పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.



