Tuesday, June 9, 2026
E-PAPER
Homeఖమ్మంపేదల సంక్షేమం, అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి

పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి

- Advertisement -

– అశ్వారావుపేటలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
నవతెలంగాణ – అశ్వారావుపేట

పేదల సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాం రెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్లతో కలిసి నియోజకవర్గం కేంద్రం, అశ్వారావుపేట మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మండలంలోని కొత్తమామిళ్ళ వారిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.

అలాగే అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా నిర్మించనున్న కొమరం భీమ్ అర్బన్ ఎకో పార్క్, పట్టు పరిశ్రమ శాఖ పూర్వ స్థలం లో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మామిళ్లవారిగూడెం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కేవలం తొమ్మిది నెలల్లో 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల వ్యయంతో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు చేసినట్లు చెప్పారు. అశ్వారావుపేట నియోజకవర్గానికి ప్రత్యేకంగా 4,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. కుల, మత, పార్టీ భేదాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తున్నామని, రెండో విడతలో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలను ఆపకుండా కొనసాగిస్తున్నామని మంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం చేపట్టామని, 99 పాఠశాలల పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కొమరం భీమ్ అర్బన్ ఎకో పార్క్ అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు.

మారుమూల గిరిజన ప్రాంతాలైన పూసుకుంటలో కొండరెడ్లు, గుత్తికోయల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించడం ద్వారా పేదల సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేసిందన్నారు. అశ్వారావుపేటకు 100 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, ఏటీసీ కళాశాలలను మంజూరు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందజేశామని పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేలా నిర్మిస్తున్నామని తెలిపారు. ఆధునిక తరగతి గదులు, హాస్టళ్లు, క్రీడా ప్రాంగణాలు, గ్రంథాలయాలు వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని తెలిపారు. 129 ఎకరాల్లో కొమరం భీమ్ అర్బన్ ఎకో పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, దొంతికుంట చెరువు ఆధునికీకరణకు రూ.5.70 కోట్లతో పనులు చేపడుతున్నామని చెప్పారు. పూసుకుంట వంటి గిరిజన ప్రాంతాల్లో 100 శాతం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు.

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నామని తెలిపారు. విశాలమైన తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, క్రీడా ప్రాంగణాలు, హాస్టల్ వసతులు, గ్రంథాలయం, డైనింగ్ హాల్ వంటి అన్ని సదుపాయాలతో నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, ఆత్మ (బీఎఫ్ఏసీ) ఛైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు,మున్సిపల్ చైర్‌పర్సన్ జూపల్లి శశికళ,వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు, అటవీ శాఖ ఎఫ్డీఓ కిష్ట గౌడ్,టీజీ ఎఫ్డీసీ డీఎం చంద్రమోహన్, అశ్వారావుపేట,దమ్మపేట ఏఫ్ఆర్ఓ లు మురళీ, శ్రీనివాస్, టీజీ ఈడబ్ల్యూఐడీసీ ఈఈ బుగ్గయ్య,డీఈ సాంబయ్య,ఏడీ ప్రసాద్,ఏఈ రాం కుమార్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మహేందర్,డీఈ రామస్వామి,ఏడీఈ వెంకటరత్నం, తహశీల్దార్ దాసరి కిశోర్, ఎంపీడీవో రామ కోటా రెడ్డి, ఎంఈఓ ప్రసాదరావు, హౌసింగ్ పీడీ సవేరాం,డీఈ కలీల్,ఏఈ మదన్ కుమార్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, లబ్ధిదారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -