Wednesday, June 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకౌలు రైతు ఆత్మహత్య

కౌలు రైతు ఆత్మహత్య

- Advertisement -

తగ్గిన పంట దిగుబడి.. పెరిగిన అప్పులు
దిగులుతో పొలం వద్దే ప్రాణం తీసుకున్న రైతు
​​నవతెలంగాణ – జగిత్యాల

పంట దిగుబడి తగ్గడం.. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీరే దారి లేకపోవడంతో మనస్తాపానికి గురైన కౌలు రైతు పొలం దగ్గరే ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. కుటుంబీకులు, బుగ్గారం ఎస్‌ఐ జి.సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. మానాల పెద్ద దుబ్బయ్య(60) భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. చేతికందిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడమే కాకుండా.. పంట దిగుబడి కూడా తగ్గి అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో అప్పుల బాధలతో సతమతం అవుతున్న ఆయన ఈ ఏడాది వరి పంట దిగుబడి చాలా తక్కువగా వచ్చిందని, పంట పెట్టుబడి బాకీలు, భూ యజమానులకు కౌలు డబ్బులు కూడా కట్టే పరిస్థితి లేదని బెంగ పెట్టుకున్నాడు. నాలుగైదు రోజులుగా తీవ్ర మనస్తాపం చెందిన దుబ్బయ్య.. సోమవారం మధ్యాహ్నం జగిత్యాలకు పోయి వస్తానని ఇంట్లో వాళ్లకు చెప్పి బయలు దేరాడు. రాత్రి వరకు కూడా ఆయన ఇంటికి తిరిగి రాలేదు. సోమవారం రాత్రి అతని ఆచూకీ కోసం కుటుంబీకులు ఎంత వెతికినా ఫలితం లభించలేదు. మంగళవారం ఉదయం బుగ్గారం శివారు, చందయ్యపల్లి రోడ్డులో అతను కౌలుకు చేసిన పంట పొలాల సమీపంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని విగత జీవిగా కనిపించాడు. ఎస్ఐ జి.సతీష్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరలు సేకరించారు. రైతు కొడుకు మానాల లక్ష్మినారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -