తాడిచెర్లలో జోరుగా బడిబాట
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ బడుల్లోనే అర్హులైన ఉపాధ్యాయులచే విద్యార్థులకు మెరుగైన విద్య అందడంతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతి అన్నారు. జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా తాడిచెర్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులచే బడిబాట కార్యక్రమం గత నాలుగైదు రోజులుగా జోరుగా సాగుతుంది. బుధవారం కార్యక్రమంలో భాగంగా తాడిచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని మన్నెగూడెం, పాత తాడిచెర్లలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు, నాణ్యమైన విద్య, ఉపాధ్యాయుల అంకితభావం, ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్య కార్పోరేట్ స్థాయికి మించి అత్యున్నత ఫలితాలు సాధించిందని,ఇటీవల పదవ తరగతి ఫలితాలతో తాడిచెర్ల ఉన్నత పాఠశాల రుజువు చేసిందన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలో చేరాలని నాణ్యమైన విద్యతో వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వి. కుమారస్వామి, ఈ.జయ భాస్కర్, సీ హెచ్. పూర్ణచందర్, రమేష్, జగన్, శివరాణి, సిఆర్పి సమత, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



