నేటి నుంచి ఫిఫా 2026 ప్రపంచకప్
బరిలో తొలిసారి 48 దేశాల జట్లు
ప్రపంచ అతి పెద్ద క్రీడా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఫిఫా 2026 ప్రపంచకప్ నేటి నుంచి ఆరంభం కానుంది. 2026 వరల్డ్‌కప్‌లో రికార్డు స్థాయిలో తొలిసారి 48 జట్లు పోటీపడుతున్నాయి. 104 మ్యాచ్‌ల మారథాన్ టోర్నమెంట్ నేడు మెక్సికో, దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో షురూ కానుంది. 96 ఏండ్ల ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి వరల్డ్‌కప్‌ను మూడు దేశాల్లో నిర్వహిస్తున్నారు.
నవతెలంగాణ క్రీడావిభాగం
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిఫా 2026 ప్రపంచకప్ వచ్చేసింది. 2022 ఖతార్‌లో ఉద్విగ్నభరిత అర్జెంటీనా, ఫ్రాన్స్ టైటిల్ పోరులో అభిమానుల మదిలో ఇంకా మెదులుతూనే ఉంది. అప్పడే నాలుగేండ్లు కరిగిపోగా.. ఫిఫా ప్రపంచకప్ టైటిల్ మరోసారి ఊరిస్తోంది. ప్రపంచం నలుమూలలా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ఈ మెగా ఈవెంట్ ఈసారి ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. నేడు మెక్సికో, దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో ఫిఫా ప్రపంచకప్ సంగ్రామం షురూ కానుంది. గ్రూప్ దశ మ్యాచ్‌లు ప్రతి రోజు రెండు జరుగనుండగా.. భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి 12.30 గంటలకు తొలి మ్యాచ్, తెల్లవారుజామున 6.30/7.30 గంటలకు రెండో మ్యాచ్ జరుగుతుంది. భారత్‌లో ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లు జీ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతాయి.
బరిలో 48 జట్లు
ఫిఫా ప్రపంచకప్‌లో తొలిసారి 48 జట్లు పోటీపడుతున్నాయి. 2022 వరకు వరల్డ్‌కప్‌లో 32 జట్లు మాత్రమే పోటీపడ్డాయి. టైటిల్ రేసులో పోటీపడుతున్న జట్ల సంఖ్య పెరిగినా.. ఫేవరేట్లు మాత్రమే మారలేదు. డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా టైటిల్ నిలుపుకోవాలనే తపనతో యుఎస్‌ఏలో అడుగుపెట్టింది. సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఈసారి ఎటువంటి భారం లేకుండా స్వేచ్ఛగా ఆడనున్నాడు. దీంతో అర్జెంటీనా టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా నిలిచింది. ఫిఫా ప్రపంచకప్‌లో గతంలో దక్షిణ అమెరికా జట్లు అర్జెంటీనా, బ్రెజిల్ శాసించాయి. ఇప్పడు యూరోపియన్ జట్లు ఆ పని చేస్తున్నాయి. గత ప్రపంచకప్ రన్నరప్ ఫ్రాన్స్ రేసులో ముందంజలో కొనసాగుతుండగా.. స్పెయిన్ టైటిల్ కోసం దూకుడుగా వస్తోంది. ఫుట్‌బాల్ పండితులు సైతం ఈ సారి కప్పు స్పెయిన్‌దే అంటూ జోస్యం చెబుతున్నారు. నెదర్లాండ్స్, ఇంగ్లాండ్, పోర్చుగల్, బ్రెజిల్ సైతం ఫేవరేట్ల జాబితాలో నిలిచాయి. ఆతిథ్య జట్లు మెక్సికో, అమెరికా, కెనడాలు గ్రూప్ దశ అధిగమించటమే గగనం!.
తొలిసారి 3 దేశాల్లో..:
ఫిఫా ప్రపంచకప్ తొలిసారి 3 దేశాల్లో జరుగుతోంది. 2026 ప్రపంచకప్ ఆతిథ్యానికి అమెరికా, మెక్సికో, కెనడాలు తొలుత సొంతంగానే బిడ్ వేయాలని అనుకున్నాయి. కానీ ఫిఫా జట్ల సంఖ్యను 32 నుంచి 48కి పెంచటంతో వ్యూహం మారింది. టోర్నమెంట్ మ్యాచ్‌ల సంఖ్య 64 నుంచి 104కు పెరిగింది. దీంతో నిర్వహణ భారం తడిసిమోపెడు అయ్యే ప్రమాదాన్ని పసిగట్టిన అమెరికా, మెక్సికో, కెనాడాలు సంయుక్తంగా బిడ్ వేశాయి. ప్రపంచకప్ 16 నగరాలు, 16 స్టేడియాల్లో జరుగనుండగా.. ఆతిథ్య దేశాలపై ఆర్థికంగా భారం తగ్గింది. ఇప్పటికే ఈ స్టేడియాల కనీస సీటింగ్ సామర్థ్యం 68 వేలు కాగా, ఫిఫా ప్రమాణాలకు అనుగుణంగానే స్టేడియం, సదుపాయాలు ఉన్నాయి. ఆధునీకరణ కోసం ఆతిథ్య జట్లు ఎక్కువగా ఖర్చు చేశాయి. అమెరికాలో 78 మ్యాచ్‌లు జరుగనుండగా.. మెక్సికో, కెనడాలు 13 మ్యాచ్‌ల చొప్పున ఆతిథ్యం ఇవ్వనున్నాయి. గ్రూప్ దశలో హై ఓల్టేజ్ మ్యాచ్‌లు సహా క్వార్టర్‌ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు అమెరికాలోనే జరుగుతాయి.
వీళ్లపై ఓ కన్నేయాలి
ఫిఫా ప్రపంచకప్‌లో టైటిల్ సొంతం చేసుకునే జట్టుపై ఎంత ఆసక్తి ఉంటుందో.. గోల్డెన్ బూట్ అవార్డు రేసు సైతం అభిమానుల్లో అంతే ఆదరణ దక్కించుకుంటుంది. లియోనల్ మెస్సీ, కిలియన్ ఎంబపె, హ్యారీ కేన్, పెద్రి, లామినె యమాల్ వంటి మేటి ఆటగాళ్లు ఈ ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ కొడతారనే అంచనాలు ఉన్నాయి. ఇక అండర్‌డాగ్ జట్లలో జపాన్, నార్వే, ఈక్వెడార్, కొలంబియాలు గ్రూప్ దశను దాటి అద్భుతాలు చేస్తాయనే అంచనాలు కనిపిస్తున్నాయి.



