కనగల్‌లో హ్యాం రోడ్లకు శంకుస్థాపన, బహిరంగ సభ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14,500 కోట్ల రూపాయలతో నిర్మించనున్న హ్యాం రోడ్ల శంకుస్థాపన నిమిత్తం నెల 17న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేయాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. కనగల్‌కు ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాట్లపై జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఆర్అండ్ బి అధికారులు, ఇతర జిల్లా అధికారులతో కలిసి మంత్రి సమావేశం నిర్వహిం చారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న హ్యాం రోడ్ల పైలాన్, బహిరంగ సభ ప్రదేశం, సభ ఏర్పాట్లపై చర్చించారు. హ్యాం రోడ్లతోపాటు, మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రిచే ఇక్కడ నుండే శంకుస్థాపనలు నిర్వహించే విషయమై సమావేశంలో మంత్రి అధికారులతో మాట్లాడారు. ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని ఆధునికరించేందుకు చర్యలు తీసుకుంటున్నందున అవకాశం ఉంటే దేవాలయ ఆధునీకరణ పనులకు కూడా ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. శిలాఫలకం, ఇతర ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఎస్పీ శరత్త్‌చంద్రపవార్, అధికారులతో కలిసి కనగల్ వెళ్లి సీఎం బహిరంగ సభ, హ్యాం రోడ్ల శంకుస్థాపన స్థలాన్ని పరిశీలించినట్టు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బి సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీధర్ రెడ్డి, డిఈ గణేష్, జెడ్పిసిఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మెన్ జూకూరి రమేష్, మున్సిపల్ మాజీ చైర్మెన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.



