హైదరాబాద్ : ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), కెనరా బ్యాంక్‌లు రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను(ఎంసీఎల్‌ఆర్) ఎంపిక చేసిన కాలపరిమితులపై 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచాయి. ఈ సవరించిన కొత్త వడ్డీ రేట్లు జూన్ 12 నుంచి అమలులోకి రానున్నాయి. ఇటీవల జూన్ 5న జరిగిన మానిటరీ పాలసీ సమావేశంలో ఆర్బీఐ రెపో రేటును 5.25 శాతం వద్దే స్థిరంగా ఉంచిన వారం రోజులకే బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకులు తమ కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వసూలు చేయాల్సిన కనీస వడ్డీ రేటు కాగా, తాజా పెంపుతో ఈ బ్యాంకుల్లో ఎంసీఎల్ఆర్‌తో లింక్ అయి ఉన్న గృహ, వాహన, రిటైల్ వంటి విభిన్న రకాల రుణాలు మరింత ప్రియం కానున్నాయి. కెనరా బ్యాంక్ తన ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.90 శాతం నుంచి 7.95 శాతానికి, ఏడాది కాలపరిమితి రేటు 8.55 శాతం నుంచి 8.60 శాతానికి చేర్చింది. బీఓబీ ఒక ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్‌ను సైతం 8.70 శాతంనుంచి 8.75 శాతానికికి పెంచింది. ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏడాది కాలపరిమితి రుణాలపై 10 బేసిస్ పాయింట్లు పెంచి 8.55య శాతానికి చేర్చింది.



