ఎంపీ, ఎమ్మెల్యేలకు డీవైఎఫ్ఐ వినతి
నవతెలంగాణ-ఆలేరు రూరల్
ఆలేరు మండలంలోని పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరి ప్రజలకు నిత్యం ప్రాణసంకటంగా మారిందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు చెన్న రాజేష్,ఆలేరు పట్టణ అధ్యక్షులు వడ్డేమాన్ విప్లవ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దవాగు బ్రిడ్జి నిర్మించి అనేక సంవత్సరాలు గడిచిపోవడంతో ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరి అత్యంత ప్రమాదకరంగా మారిందన్నారు.
బ్రిడ్జి చాలా ఇరుకుగా ఉండటంతో నిత్యం తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. దీనివల్ల స్థానిక వ్యాపార వర్గాలు, చుట్టుపక్కల గ్రామాల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బ్రిడ్జికి అవతల వైపున వ్యవసాయ మార్కెట్ యార్డు, ప్రభుత్వ ఆసుపత్రి, ఎంపీడీవో కార్యాలయం ఉండటంతో ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు, రైతులు, గర్భిణీలు, రోగులు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రిడ్జిని దాటాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ బ్రిడ్జిపై అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, పలువురు తీవ్రంగా గాయపడి వికలాంగులుగా మారగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. సమస్య తీవ్రతను గుర్తించి ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేసి బ్రిడ్జి మరమ్మతు పనులు ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు పృద్వి కుమార్, యాసారం ప్రసాద్, హరిష్ చారి, మదాని నవీన్ తదితరులు పాల్గొన్నారు.



