Saturday, June 13, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిబేఖాతర్ వ్యవస్థ.. ఉష్ణపక్షులూ, బొద్దింకలూ

బేఖాతర్ వ్యవస్థ.. ఉష్ణపక్షులూ, బొద్దింకలూ

- Advertisement -

ఏదో అలజడి వుండింది. ఆశాభావం వుండింది. అదీ కాకపోతే ఎలాగైనా ముందుకు పోవాలనే తెగింపు. శాసనసభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలోని ప్రస్తుత సంధి దశ ఏదో అవాస్తవికంగా గోచరిస్తున్నది. ఒక రాజకీయ శక్తిగా బీజేపీ అజేయమైందనీ, అంతకన్నా ముఖ్యంగా దాని స్థానం మరెవరూ తీసుకోలేరని ఒక కథనాన్ని వ్యాపింపచేయడంలో బీజేపీ, ఆరెస్సెస్‌లు నిమగ్నమై వున్నాయి. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని ఎక్కడకు చేరుస్తున్నది? కారల్ మార్క్స్ 1852 నాటి వ్యాసం “లూయీ బోనపార్టీ 18వ బ్రూమియర్‌”లో వెలిబుచ్చిన ఒక అభిప్రాయం ప్రసిద్ధమైంది. చరిత్ర అనేది నిజమైన ప్రపంచ పరిస్థితుల వల్ల రూపుదాల్చుతుంది గానీ మనుషుల ఊహలనుబట్టి కాదని ఆయనంటారు. “మనుషులు తమ చరిత్రను నిర్మిస్తారు. అయితే వారికి నచ్చినట్టుగా ఆ పని చేయలేరు. తాము ఎంచు కున్న పరిస్థితుల ప్రకారం కూడా వారు ఆ పని చేయజాలరు. తమకు ప్రత్య క్షంగా ఎదురైన, తమకు గతం అప్పగించిన దాని నుంచి సంక్రమించిన పరిస్థితులలోనే చేయవలసి వుంటుంది”.

పరీక్షల మోసం- ‌బొద్దింకల ఆవిర్భావం
చెప్పిన సందర్భం వేరైనప్పటికీ ప్రస్తుత సంధి దశను వర్ణించడానికి మార్క్స్ అభిప్రాయం చాలా చక్కగా సరిపోతుంది. విమర్శ సంగతి అటుంచి కనీసం ఎలాంటి ప్రశ్న వేసినా జాతి వ్యతిరేకమని భావించే వాతావరణంలో గత పదిహేను రోజులుగా అంతర్జాలంలో జరుగుతున్న పరిణామం ఏ మాత్రం ఊహకందేది కాదు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జరిగిన ఒక ప్రయత్నాన్ని తోసిపుచ్చిన ఒక చెదరుమదురు తిరస్కారం. ఆ పని చేసిన వాళ్లను బొద్దింకలుగా, పరాన్న జీవులుగా వర్ణించడం ఎక్కడో చాచి కొట్టింది. పూర్తి ప్రాణాలతో వున్న మనుషులు అందులోనూ యువత తమను తాము బొద్దింకలుగా అభివర్ణించుకోవడం, దానికి ముందు వినిపించిన బాధ్యతా రహిత వ్యాఖ్య లాగే చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. కాని లోతుగా పరిశీలిస్తే అందులో చాలా అర్థం దాగి వుందని తెలుస్తుంది. బొద్దింకల పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే అవి అత్యంత ప్రతికూల పరిస్థితులలో కూడా తట్టుకుని దీర్ఘకాలం జీవించగలవని అర్థమవుతుంది. ప్రమాదకరమైన నిశ్శబ్దాన్ని, నిర్లక్ష్యాన్ని అవి ఛేదించడానికి ప్రయత్నిస్తుంటాయి.

యువత నుంచి ఇలాంటి విపరీతమైన స్పందన రావడానికి ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న పరిస్థితులే కారణమని గ్రహించడానికి పెద్ద రాకెట్ శాస్త్రమేదీ అక్కర్లేదు. జాతీయ పరీక్షా కేంద్రం (ఎన్.టి.ఎ) నిర్వహించిన పరీక్షలన్నీ దారి తప్పిపోయాయి. ఇంకా చెప్పాలంటే అవన్నీ మోసాల పాలయ్యాయి. ఫలితంగా అవన్నీ రద్దయి పోయాయి. చెల్లకుండా పోయాయి. అనిశ్చితిలో పడ్డాయి. ఇందులో నీట్-యు.జి, సి.బి.ఎస్.ఇ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ పద్ధతిలో జరిగినవీ వున్నాయి. ఇప్పుడు ఐఐటి లకు జె.ఇ.ఇ కూడా వచ్చి చేరింది. 2026లో ఇది పరాకాష్టకు చేరింది. ఈ మొత్తం వ్యవహా రంలో మరీ చాలా దారుణమైన అంశమేమంటే మానవ వనరుల మంత్రిత్వ శాఖకు, ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రభుత్వానికి జవాబుదారీ తనం బొత్తిగా లేకుండా పోవడం. ప్రజాస్వామ్యం పేరు చెప్పుకునే ప్రభుత్వం ఏదైనా సరే కనీసంగా బాధ్యతా యుతంగా స్పందించి వుండేది. కానీ హతవిధీ! ఎలాంటి ప్రతి విమర్శకూ అవకాశమే లేని ఆలోచనకే తావివ్వని ప్రస్తుత వాతావరణంలో మనకు ఇసుకలో తలదూర్చే ఉష్ట్రపక్షులు మాత్రమే వున్నాయి. ఫాసిస్టు తరహా జంతుజాలం పెరగడానికిది బాగా అనువైన వాతావరణం.

డిజిటల్ రంగస్థలం
ఇలా ఎందుకు జరుగుతుంది? కనీసంగా జరగాల్సింది హెచ్.ఆర్.డి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం. ఎన్నికైన ఒక ప్రభుత్వంపై యువత విశ్వాసం పునరుద్ధరించ బడాలంటే అది తప్పనిసరి. అయితే ఇది కేవలం 2026 పరీక్షలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. చాలా సంవత్సరాలుగా ఎన్.టి.ఎ జరుపుతూ వస్తున్న 70కి పైగా పరీక్షల పరిస్థితి అనుమానాస్పదంగా మారిపోయింది. అందువల్ల తీవ్రమైన చర్య ఏదో తప్పక జరగాలి. యువజనుల సమిష్టి బృందాలకు ప్రతీకగా మారిన బొద్దింకలు యుద్ధానికి దిగాయి. వెనక్క తిరిగి చూస్తే ఇది జరగవలసి వుండిందే. నిరీక్షణలో వున్నదే. ఈ వైఫల్యం మరీ ముఖ్యంగా జవాబుదారీ తనం అన్నది మగ్యం కావడం ఏదో ఒక విధమైన తిరుగుబాటుకు దారితీసి వుండేదే. ఈ రోజున యువజనులు దద్దమ్మలు కాదు. డిజిటల్ ప్రపంచంలో ప్రతిభ చూపగలవారే. కనుక వారి నిరసనకు అంతర్జాలమే రంగస్థలం కావడం తథ్యం. కాక్రోచ్ జనతా పార్టీ (సి.జె.పి)కి చెందిన బొద్దింకలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండుతోనే సరిపెట్టారు. ఇంకా వ్యవస్థాగతమైన, సంస్థాపరమైన ప్రశ్నలు ముందుకు తీసుకురాలేదు.

ఇండియా వంటి అతి విశాలమైన విభిన్నతలు గల దేశంలో ప్రవేశ పరీక్షలను ఒకే చోట కేంద్రీకరించి చివరకు వాటి భవిష్యత్తును అక్కడే నిర్ణయించాలనే ప్రయత్నం విఫలం కావడం అనివార్యం. అంతేగాక ఆరెస్సెస్ ప్రేరిత బాధ్యుల కోసం కీలక స్థానాలు కట్టబెట్టేందుకు పాకులాడటం బీజేపీకి అలవాటైన జబ్బు. ఇందుకోసం అవసరమైతే ప్రతిభావంతులను బలిచేయడానికి కూడా అది వెనకాడదు గనక సమస్య మరింత జటిలమవుతుంది. అలా కాకపోయి నట్టయితే ఈ పరీక్షా పత్రాలను భారత వైమానిక దళం విమానాలలో తరలించడం, ప్రధానమంత్రి వ్యక్తిగతంగా పర్యవేక్షించడం వంటి పరిష్కారాలతో ఈ సమస్యను ఎదుర్కోవాలని ఎవరనుకోగలరు? ఒకవేళ మానవాతీత మూర్తులైన వారు అలాంటి మహాద్భుత శక్తి ప్రదర్శించగలరని భావించినప్పటికీ వారి నుంచి అలాంటివి కోరడం మరీ అతిగా వుంటుంది. ప్రైవేటు విద్యా మాఫియాలు ప్రభుత్వం తరపున సంక్లిష్టమైన పరీక్షలు సక్రమంగా నిర్వహించగలవని గట్టిగా నమ్మడమే ఒక విడ్డూరం. లాభార్జనా కాంక్షతో విద్యార్థుల భవిష్యత్తును విస్మరించడమనేది అలా వుంచినా ఆదిలోనే బెడిసికొట్టిన ప్రక్రియ అది.

అందరూ అదే బాటలో…
ప్రభుత్వ సంస్థలూ, అక్కడి విద్య అన్న వాటికి విలువ కట్టే ఈ క్రమం జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న విధాన మూల సూత్రాలకే విరుద్ధం అన్నది కూడా ఇక్కడ ఒక ప్రధానమైన అంశం. మొత్తం మీద చెప్పాలంటే ఉద్యోగం వైట్ కాలర్ పని అయినా, తక్కువ జీతాల గిగ్ వర్కర్లయినా, ఏదోలా ఈడ్చుకొచ్చే అసంఘటిత-అనియత కార్మికులైనా వీధుల్లోకి రావలసిన పరిస్థితి కల్పిస్తున్నది. ఇప్పుడు బొద్దింకలకు జరుగుతున్నదీ… ఇదివరలో నోయిడా, మనేసర్, ఉత్తరాఖండ్‌లో కార్మికుల విషయంలో జరిగిందీ అదే. నిజానికి అవేవీ సంప్రదాయకంగా కార్మికోద్యమ కేంద్రాలుగా వున్నవి కావు. అయినా ఈ పరస్పర సంబంధం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం యువతరం ఆగ్రహంతో రగిలిపోతున్నది. న్యాయ వ్యవస్థ కొన్ని వర్గాలలోని దళారులను గురించి, ఎన్నికల కమిషన్ల నిర్వహణ గురించి కూడా సి.జె.పి ప్రస్తావించింది. పేరుకు పోయిన నిరాశలు, నిస్పహలను ఒక విశ్వసనీయమైన గౌరవప్రదమైన మార్గంలో వెల్లడించి పరిస్థితిని మార్చే అవకాశాలేమీ కనిపించనప్పుడు ఇది అని వార్యంగా జరిగేదే. ఆ కోణంలో చూసినప్పుడు సిజెఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్య ఒక ట్రిగ్గర్ లాగా పని చేయడం కేవలం యాదృచ్ఛికంగా జరిగిందను కోవడానికి లేదు. సుప్రీం కోర్టు ఓటర్ల రాజ్యాంగ హక్కుల కన్నా ఎన్నికల సంఘం అధికారాల గురించే ఎక్కువగా ఆరాటపడుతున్నది. ప్రస్తుత సంధి దశపై చాలా నిరుత్సాహకరమైన వ్యాఖ్యానం లాంటి పరిణామమిది. అందువల్ల మన సమకాలీన సన్నివేశంలో బొద్దింకలు, ఉష్ట్రపక్షులూ మరింత ఎక్కువగా సందర్శనలు జరపడం కొనసాగుతుంది. ఈ సందర్భాను సారంగా చూసినప్పుడే ప్రజాస్వామ్యం పురోగమనం కాంక్షించే రాజకీయ శక్తులు తమ స్థానమేమిటో నిర్ణయించుకోవలసి వుంటుంది. తద్వారా తమ కాలపు చరిత్రలో భాగస్వాములు కావలసి వుంటుంది.
​(జూన్ 10 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -