ట్రంప్ ఒప్పందం ప్రకటనను తోసిపుచ్చిన ఇరాన్
ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి
ఎలాంటి తుది నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టీకరణ
వాషింగ్టన్, టెహ్రాన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌తో జరుగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశముందని ప్రకటించినప్పటికీ ఆ విషయాన్ని ఇరాన్ తోసిపుచ్చింది. చర్చలు కొనసాగుతున్నాయనీ, అయితే ఇంకా ఎలాంటి తుది నిర్ణయమూ తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు. దీంతో మధ్య్రపాచ్యంలో ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతోంది.
ట్రంప్ ఏమన్నారు?
ఇరాన్‌పై మరోసారి భారీ సైనిక దాడులు చేయాలని అమెరికా సిద్ధమైందని హెచ్చరించిన ట్రంప్.. అనంతరం చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు తయారు చేయకూడదన్నదే మా ప్రధాన లక్ష్యం. ఆ దిశగా గొప్ప ఒప్పందం కుదిరే దశలో ఉంది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒప్పంద పత్రాలు దాదాపు సిద్ధంగా ఉన్నాయనీ, కొన్ని రోజుల్లోనే వాటిపై సంతకాలు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. యూరప్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశముందని కూడా వెల్లడించారు. ఇరాన్ సుప్రీం లీడర్ కూడా ఈ ఒప్పందాన్ని ఆమోదించారని ట్రంప్ ధృవీకరించారు. ఒప్పందంపై సంతకాలు పూర్తి కాగానే ఇరాన్‌పై ఉన్న దిగ్బంధాన్ని అమెరికా తక్షణమే ఎత్తివేస్తుందని, దీనివల్ల చమురు ధరలు భారీగా పడిపోతాయని అంచనా వేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ ఒప్పందం ప్రకారం అణు ఆయుధాలను అభివృద్ధి చేయబోమని, వాటిని కలిగి ఉండబోమని ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ చెప్పడం గమనార్హం. ఇరాన్‌తో కుదిరే ఈ అధికార ఒప్పందం పూర్తయ్యే వరకు అమెరికా, మిత్రదేశాలు అమలు చేస్తున్న నౌకాదళ దిగ్బంధం (నావల్ బ్లాకేడ్) యథావిధిగా కొనసాగుతుందని ట్రంప్ తన సోషల్‌ట్రూత్‌లో స్పష్టం చేశారు. తుది ఒప్పంద పత్రాలపై సంతకాలకు సంబంధించిన తేదీ, ప్రదేశ వివరాలను త్వరలో ప్రకటిస్తామని ఆయన వివరించారు.
ఇరాన్ స్పందన
అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ జాగ్రత్తగా ఖండించింది. ఒప్పంద ముసాయిదాలో ఎక్కువ భాగం సిద్ధమైనప్పటికీ, అమెరికా చివరి నిమిషంలో కొత్త డిమాండ్లు పెడుతోందని బఘాయీ ఆరోపించారు. తమ ‘‘రెడ్ లైన్స్’’ నుంచి వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రధానంగా తన అణు కార్యక్రమంపై అధిక పరిమితులను అంగీ కరించేందుకు సిద్ధంగా లేదనే సంకేతాలు ఇస్తోంది. అలాగే క్షిపణి కార్యక్రమం, ప్రాంతీయ మిత్ర బలగాలకు మద్దతు వంటి అంశాల్లో కూడా రాజీకి ఆస్కారం తక్కువగా కనిపిస్తోంది.
కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఒప్పంద చర్చలు జరుగుతున్నప్పటికీ, మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. అమెరికా, ఇరాన్ ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుం -టున్నాయి. దక్షిణ ఇరాన్‌లోని రాడార్, నిఘా కేంద్రాలపై అమెరికా దాడులు చేయగా, ప్రతిగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. కాగా ట్రంప్ ప్రకటనల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు ఒక్కసారిగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు 89 డాలర్లకు పడిపోయి, ఒక్క రోజులోనే 4.4 శాతం క్షీణించింది. హార్ముజ్ జలసంధి మళ్లీ పూర్తిగా తెరుచుకుం టుందనే ఆశలు ఇందుకు కారణమ య్యాయి. ప్రపంచ చమురు, సహజ వాయువు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ దాదాపు మూసివేయ డంతో గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ వాణిజ్యం తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్న విషయం విదితమే.
అమెరికా–ఇరాన్ వైఖరులు
అమెరికా ప్రధానంగా ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధిని పూర్తిగా విరమించుకోవాలని కోరుతోంది. అలాగే యురేనియం నిల్వలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని, హార్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో నౌకలపై టోల్ వసూలు చేసే హక్కు, జలసంధిపై పూర్తి సైనిక నియంత్రణ, మధ్యప్రాచ్యం నుంచి అమెరికా బలగాల సంపూర్ణ ఉపసంహరణ వంటి డిమాండ్లను వాషింగ్టన్ తిరస్క రిస్తోంది. మరోవైపు ఇరాన్ మరింత విస్తృత స్థాయిలో ఆర్థిక ఆంక్షల సడలింపు, విదేశాల్లో నిల్వ ఉన్న ఆస్తుల విడుదల, భవిష్యత్తులో సైనిక దాడులు జరగబోవన్న హామీ, అంతర్జాతీయ భద్రతా హామీలను కోరుతోంది. కాగా మధ్యవర్తులు ఒప్పందంలోని చివరి అంశాలను ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఇరు దేశాలు గతంలో ఎన్నడూ లేనంతగా ఒప్పందానికి దగ్గరైనప్పటికీ, దీనికి ఇంకా అధికారిక ఆమోదం అవసరమని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ ఒప్పందం అమలులోకి వస్తే మధ్యప్రాచ్యంలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ఫుల్‌స్టాప్‌పడి గణనీయమైన ఉపశమనం లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
60 రోజుల కాల్పుల విరమణ
ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం అమెరికా, ఇరాన్ దేశాలు ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగిస్తాయి. శాశ్వత ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న సమయంలో పరస్పర అంగీకారంతో ఈ గడువును మరింత పొడిగించే అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థ ద్వారా సైనిక ఉద్రిక్తతలకు అడ్డుకట్ట వేసి, దౌత్యపరమైన చర్చలకు అనుకూల వాతావరణం కల్పించాలన్నది ప్రధాన ఉద్దేశం.
హార్ముజ్ జలసంధి పున:ప్రారంభం
ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే తిరిగి తెరవాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ జలమార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులూ ఉండవనీ, ఎలాంటి టోల్ ఫీజులూ, రవాణా రుసుములూ విధించబోమని ఇరాన్ హామీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఘర్షణల సమయంలో సముద్రంలో అమర్చిన మైన్లను తొలగించి, సురక్షిత నౌకాయానాన్ని పునరుద్ధరించనుంది. ఒప్పందం అమల్లోకి వచ్చిన 30 రోజుల్లోనే యుద్ధానికి ముందు ఉన్న స్థాయికి నౌకా రవాణా చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
భారత్ ఆందోళన
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి అమెరికా సీనియర్ దౌత్యవేత్తను పిలిపించి వివరణ కోరింది. మరో 21 మంది సిబ్బందిని రక్షించారు. ఇక మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు శాంతికి పిలుపునిచ్చాయి. పరిస్థితి మరింత దిగజారకుండా చూడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చారు. భారత్, చైనా, రష్యా, సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలు కూడా ఉద్రిక్తతలను తగ్గించాలని కోరాయి.
ఆ ఒప్పందం ఏమిటి?
ఒప్పందం విషయంలో ఇటు అమెరికా నుంచి, అటు ఇరాన్ నుంచి భిన్నమైన ప్రకటనలు వెలువడ్డాయి. అయితే చర్చల్లో పాల్గొంటున్న అధికారుల సమాచారం ప్రకారం ఇరు దేశాలు 60 రోజుల కాల్పుల విరమణకు, భవిష్యత్ సమగ్ర ఒప్పందానికి పునాది వేసేలా అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై విస్తృతంగా ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
అమెరికా నుంచి ఆర్థిక సడలింపులు
ఇక ఒప్పందంలో భాగంగా అమెరికా.. ఇరాన్ పోర్టులపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయనుంది. అలాగే కాల్పుల విరమణ కాలంలో ఇరాన్ మళ్లీ చమురు ఎగుమతులు ప్రారంభించaేందుకు ఆంక్షల సడలింపులను ప్రకటించనుంది. ఇకపై ఇరాన్ ఒప్పంద నిబంధనలను పాటించే విధానాన్ని బట్టి మరిన్ని ఆర్థిక ఆంక్షలను సడలించే అవకాశం ఉంటుంది. విదేశాల్లో నిల్వ ఉన్న ఇరాన్ ఆస్తులను విడుదల చేసే అంశంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి.
అణు కార్యక్రమంపై కీలక నిబంధనలు
ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం ఇరాన్ అణు కార్యక్రమమే. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదని అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. యురేనియం శుద్ధీకరణ కార్యక్రమాన్ని నిలిపివేసే అంశంపై చర్చలకు అంగీకరించాల్సి ఉంటుంది. అధిక స్థాయిలో శుద్ధి చేసిన యురేనియం నిల్వల భవిష్యత్తుపై తదుపరి చర్చల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో వాటిని తక్కువ స్థాయికి మార్చడం లేదా మూడో దేశానికి తరలించడం వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.



