సర్వసాధారణంగా మారిన 30 ఏండ్ల హోమ్‌లోన్ ఏటా పెరుగుతున్న వడ్డీల భారం
ప్రతినెలా ఈఎమ్‌ఐల
కోసం బానిస బతుకులు
పత్తాలేని ‘పొదుపు’
ఉద్యోగ విరమణ సొమ్మూ
ఇంటి అప్పులకే ఆర్థిక స్వేచ్ఛను కోల్పోతున్న మధ్యతరగతి భారతీయులు
ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆర్థిక నిపుణులు
సొంతింటి కల నెరవేర్చుకోవాలన్నది దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆశ. కొందరికి అదే జీవితకాల లక్ష్యంగానూ మారుతోంది. ఒకప్పుడు ఇల్లు కొనడమంటే.. ఏండ్ల తరబడి పొదపు చేయడం, చేతనైన స్థాయిలో అప్పు తీసుకోవడం, రిటైర్మెంట్ ముందే రుణం తీర్చేయడంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముందుగా ‘ఎంత ఖరీదైన ఇల్లు కొనగలం?’ అని కాదు.. ‘బ్యాంకు ఎంత రుణం ఇస్తుంది?’ అని అడిగి గృహ అన్వేషణ మొదలుపెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఇంకా సంపాదించని, రాబోయే 20-30 ఏండ్ల ఆదాయాన్ని కూడా ముందుగానే ఖర్చు చేస్తూ భారతీయ మధ్యతరగతి ప్రజలు తమ భవిష్యత్తును తాకట్టు పెట్టుకుంటున్నారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ : భారత్‌లో మధ్యతరగతి ప్రజలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునే క్రమంలో తమ భవిష్యత్ సంపాదనను ముందుగానే ఖర్చు చేస్తున్నారు. అయితే ఆ కలను నేరవేర్చుకునే విధానం ప్రమాదకరంగా మారుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ముంబయి, ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఇండ్ల ధరలు ఆదాయాల కంటే వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భారీ గృహ రుణాలపై ఆధారపడుతున్నారు. గతంలో కొనుగోలుదారులు ముందుగా తమ ఆర్థిక స్థోమతను అంచనా వేసుకుని దానికి తగిన ఇంటిని ఎంచుకునేవారు. ఇప్పుడు బ్యాంకులు ఎంత గరిష్ట రుణం మంజూరు చేస్తాయో తెలుసుకుని, ఆ ప్రకారం సొంతింటి అన్వేషణ మొదలు పెడుతున్నారు. దీన్ని ఆర్థికరంగ నిపుణులు ‘సమర్థిత ఆధార కొనుగోళ్ల నుంచి అర్హత ఆధారిత కొనుగోళ్ల మార్పు’గా అభివర్ణిస్తున్నారు.
30 ఏండ్ల రుణాలు ఎందుకు పెరుగుతున్నాయి?
దేశంలో పెరుగుతున్న ఇండ్ల ధరలే రుణాల పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలు వార్షిక ఆదాయంతో పోలిస్తే ఏడు నుంచి పది రెట్లు అధికంగా ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ నిష్పత్తి ఐదు కంటే తక్కువగా ఉంటేనే ఇండ్లు అందుబాటు ధరల్లో ఉన్నట్టు భావిస్తారు. దీంతో 10-15 ఏండ్లలో పూర్తయ్యే రుణాల స్థానంలో 20-30 ఏండ్ల గృహ రుణాలు సాధారణ విషయంగా మారుతున్నాయి. ఇండ్లు నిజంగా అందుబాటులోకి రావడం లేదనీ, కేవలం చెల్లింపు కాలాన్ని పొడిగించడం ద్వారా అందుబాటులో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయని ఆర్థికరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కుటుంబ ఆదాయంలో సగం ఈఎంఐలకే
గృహ రుణ నెలవారీ వాయిదాలు (ఈఎంఐ) కుటుంబ నెలవారీ ఆదాయంలో 30-35 శాతం మించకూడదు. అయితే ప్రస్తుతం అనేక కుటుంబాలు తమ ఆదాయంలో 40-50 శాతం లేదా అంతకంటే ఎక్కువ భాగాన్ని ఈఎంఐలకే వెచ్చిస్తున్నాయి. దీంతో పదవీ విరమణ నిధులు, బీమా, అత్యవసర పొదుపులు, పిల్లల విద్య కోసం చేసే పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. ఇల్లు కోసం తీసుకున్న రుణం మొత్తం ఆర్థిక ప్రణాళికను దారి తప్పేలా చేస్తుంది.
రిటైర్మెంట్ వరకూ వెంటాడే అప్పులు
రుణ కాలపరిమితి 25-30 ఏండ్లకు పెరగడంతో అనేక మంది పదవీ విరమణ తర్వాత కూడా గృహ రుణాలను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఉద్యోగ విరమణ అనంతరం తగ్గిన ఆదాయంతో ఈఎంఐలు చెల్లించడం, ఆరోగ్య ఖర్చులు, జీవన వ్యయాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆస్తి విలువలు ఆశించినంతగా పెరగకపోతే.. పదవీ విరమణ పొందిన వ్యక్తులు ఆస్తి ఉన్నా, నగదు లేని పరిస్థితిలో చిక్కుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రమాదంలో దంపతుల జీవితాలు
అనేక కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరి ఆదాయాలనూ కలిపి భారీ రుణాలు తీసుకుంటున్నారు. అయితే 20-30 ఏండ్ల పాటు ఇద్దరికీ నిరంతర ఉద్యోగ భద్రత ఉంటుందన్న హామీ లేదు. ఉద్యోగం కోల్పోవడం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక మందగమనం వంటి పరిణామాలు మొత్తం ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. మెట్రో నగరంలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన యువ దంపతులు తమ ఆదాయంలో 55 శాతం ఈఎంఐలకు కేటాయించగా, కొద్ది కాలానికే ఒకరు ఉద్యోగం కోల్పోవడంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఉదాహరణలు అనేకం ఉన్నాయి.
శివార్లకు మధ్యతరగతి పరుగు
ఇంటి కొనుగోలులో కుటుంబ సంపద, వారసత్వ ఆస్తులు కీలకంగా మారుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయం పొందగలిగిన వారు సులభంగా మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నారు. అలాంటి మద్దతు లేని మధ్యతరగతి కుటుంబాలు చిన్న ఇల్లు కొనడం, నగర శివార్లకు వెళ్లడం, మరింత అప్పు చేయడం వంటి మార్గాలను ఎంచుకోవాల్సి వస్తోంది.
ఆర్థిక స్వేచ్ఛను తాకట్టే!
భారత్‌లో పట్టణీకరణ, చిన్న కుటుంబాల పెరుగుదలతో గృహ డిమాండ్ బలంగా ఉంది. అయితే ఆ డిమాండ్‌ను నిలబెడుతున్నది ప్రస్తుత ఆదాయం మాత్రం కాదు. భవిష్యత్తులో వస్తుందనే ఆశతో తీసుకుంటున్న రుణాలే ఎక్కువ. సొంతింటి కలను సాకారం చేసుకోవడం తప్పు కాదు. కానీ ఆ కల కోసం రాబోయే మూడు దశాబ్దాల ఆర్థిక స్వేచ్ఛను తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసమనేదే ఇప్పుడు దేశ మధ్యతరగతి ప్రజల ముందు ఉన్న ప్రశ్న.



