Saturday, June 13, 2026
E-PAPER
Homeఖమ్మంసమస్యల సుడిగుండంలో ప్రభుత్వ పాఠశాలలు

సమస్యల సుడిగుండంలో ప్రభుత్వ పాఠశాలలు

- Advertisement -

శిథిలావస్థలో గోవిందాపురం ఏ ప్రాథమిక పాఠశాల
ఐదేళ్లుగా అసంపూర్తిగా మన ఊరు – మనబడి పాఠశాలల భవనాల
ఊసే లేని విద్యార్థుల యూనిఫామ్, అల్పాహారం
జానకిపురం, మోటమర్రి పిజిహెచ్ఎం పోస్టులు ఖాళీ 
నవతెలంగాణ – బోనకల్ 

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోనే బోనకల్ మండలంలో ప్రభుత్వ పాఠశాలలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మరో రెండు రోజులలో పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు అందవలసిన యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు ఇంకా పూర్తిగా మండలానికి చేరుకోలేదు. మనబడి – మన ఊరు కింద పాఠశాలలో చేపట్టిన భవనాలు ఐదేళ్లుగా ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సమస్యలతోనే ప్రభుత్వ పాఠశాలలు వివిధ రకాల సమస్యలతో ప్రారంభం కానున్నాయి. టిఆర్ఎస్ ప్రభుత్వంలో మండలంలోని నాలుగు పాఠశాలలను మన ఊరు మనబడి కింద ఎంపిక చేసి అదనపు గదుల నిర్మాణాలను చేపట్టారు.

అందులో పెద్ద బీరవల్లి ప్రాథమిక పాఠశాల, గోవిందాపురం ఎల్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, కలకోట హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అయితే ఈ నాలుగు పాఠశాలలో ఆనాడు మన ఊరు మనబడి కింద నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో నిర్మాణ పనులు ఆనాడే ప్రారంభించి సుమారు 70 నుంచి 80 శాతం వరకు నిర్మాణ పనులను పూర్తి చేశారు. సదరు కాంట్రాక్టర్ కు పూర్తిస్థాయిలో బిల్లులు విడుదల చేయకపోవడంతో నిర్మాణ పనులను పూర్తి చేయలేదు. బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో సదరు కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను కూడా పూర్తి చేయకుండానే వదిలివేశారు. సుమారు ఐదేళ్లుగా భవన నిర్మాణాలను పూర్తి చేసినప్పటికీ విద్యుత్, రంగులు వంటి చిన్న చిన్న పనులు మిగిలిపోయాయి. వీటిని పూర్తిచేసి సదరు కాంట్రాక్టర్ పాఠశాలకు అప్పగించవలసి ఉంది. బిల్లును పూర్తిస్థాయిలో రాకపోవడంతో ఆ నూతన భవనాలను కాంట్రాక్టర్ పాఠశాలకు అప్పగించలేదు. దీంతో అవి నిరుపయోగంగానే దర్శనం ఇస్తున్నాయి.

గత ఏడాది   ఉపాధి హామీ పథకం కింద బోనకల్ స్టేషన్ ప్రాథమిక పాఠశాల, చిరునోముల ప్రాథమిక పాఠశాల, బోనకల్ ఎస్టి ప్రాథమిక పాఠశాలకు టాయిలెట్స్ కు నిధులు మంజూరు అయ్యాయి. కానీ నేటి వరకు వాటి నిర్మాణాలను ప్రారంభించలేదు. దీంతో టాయిలెట్స్ లేక ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో ప్రీ ప్రైమరీ స్కూళ్ల కోసం పది పాఠశాలలను ఎంపిక చేసి జిల్లా ఉన్నతాధికారులకు మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య పంపించారు. కానీ అందులో కేవలం 6 పాఠశాలను మాత్రమే ఎంపిక చేశారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా ఎంపిక చేసిన చిన్న బీరవల్లి, తూటీకుంట్ల ప్రాథమిక పాఠశాలలో గదుల సమస్య తీవ్రంగా ఉంది. సంపూర్ణంగా గదులు ఉన్న పాఠశాలలను అధికారులు ఎంపిక చేయకపోవడం విశేషం.

ఆళ్లపాడు, పెద్ద బీరవల్లి ప్రాథమిక పాఠశాలలో గదులు సంపూర్ణంగా ఉన్నాయి. కానీ వాటిని ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా ఎంపిక చేయలేదు. గోవిందాపురం ఏ ప్రాథమిక పాఠశాల పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఏ సమయంలో కూలుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొని ఉంది. గత ఏడాది నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ సంవత్సరం అయినా ఆ పాఠశాలకు అదనపు గదులు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తారేమోనని గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఎదురుచూశారు. కానీ నిరాశే ఎదురయింది. విద్యార్థులు ఆ పాఠశాలకు వెళ్లటానికి భయపడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఆ పాఠశాలకు విద్యార్థులను పంపించడానికి భయపడుతూ ప్రైవేటు పాఠశాలలకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. మోటమర్రి, జానకిపురం పిజిహెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఈ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండలానికి 14,758 పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉండగా నేటికీ 13,237 పాఠ్యపుస్తకాలు మాత్రమే వచ్చాయి. ఇంకా 1521 పుస్తకాలు రావాల్సి ఉంది. దీంతో కొంతమంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను తక్కువ చేసి పంపిణీ చేశారు.

మొత్తం మండలానికి 13,844 నోటు పుస్తకాలు అవసరం ఉండగా ఇవి మాత్రం పూర్తి స్థాయిలో విద్యార్థులకు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థులకు అన్ని ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం ప్రారంభిస్తామని ప్రకటించింది. కానీ నేటి వరకు ఇందుకు సంబంధించిన విధివిధానాలు పాఠశాలలకు అందలేదు. ఇందుకు అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం నేటి వరకు ప్రకటించకపోవడంతో అల్పాహారం పై అనుమానాలు రేకెత్తుతున్నాయి. విద్యార్థులకు ప్రధానమైన యూనిఫాం నేటి వరకు మండల కేంద్రానికి చేరలేదు. విద్యార్థులకు ప్రధానమైన యూనిఫామ్ పై కూడా ప్రభుత్వం నేటి వరకు స్పష్టత ఇవ్వలేదు. యూనిఫామ్ కు సంబంధించి నేటి వరకు టెండర్ వర్కు కాలేదు. అదేవిధంగా  14 రకాల వస్తువులతో విద్యార్థులకు కిట్టు పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక కిట్టు కూడా మండల కేంద్రానికి చేరలేదు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు కూడా వెలువడ లేదు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పేరుతో మండల స్థాయి అధికారికి నాలుగు నుంచి ఆరు పాఠశాలలను కేటాయించి ఆ పాఠశాలలో కల్పించవలసిన మౌలిక వసతులు, అభివృద్ధి పై సర్వే చేయించింది.

ఆ సర్వే నివేదికను అధికారులు ప్రభుత్వానికి కూడ ఇటీవలే పంపించారు. ఆ సర్వే నివేదిక ఆధారంగా ప్రభుత్వం పాఠశాలను అభివృద్ధి చేయాలనుకుంటే పాఠశాలలో పునః ప్రారంభమైన తర్వాత పనులు ఎలా చేస్తారని, దీనివలన విద్యా బోధనకు ఆటంకం కలుగుతుందని పలు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి చేసేందుకు వేసవికాలంలోనే చేపట్టి ఉంటే ఎటువంటి ఆటంకాలు ఉండేవి కావని ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ విధంగా ఈ విద్యా సంవత్సరం పలు సమస్యలతో పునః ప్రారంభం కానున్నాయి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -