దేశంలో పరీక్షల నిర్వహణ తీరుపై విద్యార్థి లోకం భగ్గుమం టున్న వేళ, జాతీయస్థాయి విద్యా వ్యవస్థకు సంబంధిం చిన అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న వరుస నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌ఎటి) 2024లో నిర్వహించిన నీట్ పరీక్షలో తలెత్తిన అవకతవకల ఆరోపణలు, ప్రశ్నపత్రాల లీకేజీ వివాదాలు అనంతరం ప్రభుత్వం పలు కమిటీలను ప్రకటించినప్పటికీ, 2025విద్యాసంవత్సరం పొడుగునా దేశవ్యాప్తంగా విద్యార్థి లోకంలో ఆందోళనలు, అపనమ్మకం కొనసాగుతూనే వచ్చాయి. పరీక్షల నిర్వహణ, పారదర్శకత అంశాలపై కొన్ని వర్గాలు ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో, ప్రస్తుత 2026 విద్యా సంవత్సరానికి చేరుకునే సరికి ఈ అసంతృప్తి కాస్తా దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలో, ఈ అంశంపై విద్యార్థి సంఘాలు జవాబుదారీతనాన్ని కోరుతున్నాయి. ఢిల్లీ వేదికగా ప్రారంభమైన నిరసన జ్వాలలు పూణె, లక్నోలను దాటుకుని ఇప్పుడు భాగ్యనగరానికి చేరుకోవడం విద్యావ్యవస్థకు సంబంధించిన అంశాలపై విద్యార్థుల్లో కొనసాగుతున్న ఆందోళనలకు ఇది ప్రతిబింబంగా కనిపిస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉన్న నివేదికలు, దర్యాప్తు వివరాలను ప్రస్తావిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే ఉద్యమంగా ఇది మారిందని కొంతమంది పరిశీలకులు అభిప్రాయపడు తున్నారు.
లక్నో ఆందోళనలు – సీజేపీ డిమాండ్లు
దేశ రాజధానిలో మొగ్గతొడిగిన ఆందోళన క్రమంగా దేశంలోని ప్రముఖ నగరాలకు విస్తరిస్తూ, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో భారీ నిరసనగా రూపాంతరం చెందింది. లక్నోలో నిర్వహించిన శాంతియుత ఆందోళనలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పాల్గొని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని గళమెత్తారు. పాట్నాలో నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన ఆరోపణలు, దర్యాప్తు వివరాలు బీహార్ పోలీసు ఆర్థిక నేరాల విభాగం నివేదికల్లో ప్రస్తావించబడ్డాయని ఆయన తెలిపారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఉదంతాన్ని సీబీఐ విచారణకు అప్పగించిందని ఆయన గుర్తుచేశారు. జాతీయ పరీక్షల సంస్థ నిర్వహించిన కొన్ని పరీక్షల నిర్వహణపై పలు ప్రశ్నలు వ్యక్తమయ్యాయని సీజేపీ పేర్కొంది. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, పేపర్ లీకేజీ ముఠాల అరెస్టులు వంటి పూర్తిస్థాయి ధృవీకరించదగిన నివేదికలు, ఆధారాల ప్రాతిపదికన మాత్రమే తాము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని సీజేపీ స్పష్టం చేసింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని నిరసనకారులు కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు మరింత తీవ్రతరం అవుతాయని లక్నో వేదికగా హెచ్చరించడం గమనార్హం.
హైదరాబాద్ వేదికగా నిరసన కార్యాచరణ
లక్నో నిరసనల స్ఫూర్తితో, హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద గల ధర్నాచౌక్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టబోతోంది. ఈ మేరకు ఆ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద పత్రికాముఖంగా ప్రకటన విడుదల చేసి, నీట్, సీయూఈటీ వంటి పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివాదాలపై తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ఆందోళనలను ప్రస్తావించారు. గతంలో సుప్రీంకోర్టు వివాదాస్పద గ్రేస్ మార్కులను రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాలను, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లీకేజీ నిరోధక చట్టంలోని నివేదికలను ప్రస్తావిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌ను మరింత బలంగా వినిపించేందుకు నిరసనను ఒక వేదికగా మార్చారు. ఒకవైపు విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళనలు వ్యక్తపరు స్తుండగా, కేవలం రాజీనామాలతో సమస్యలు పరిష్కారం కాబోవని అధికార పక్ష వర్గాలు వాదిస్తున్నాయి. పరీక్షల వివాదాల నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే, కేవలం హామీలు సరిపోవని, వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించే చర్యలు అవసరమనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. లక్షల రూపాయలు ఫీజులు కట్టి, కోచింగ్ సెంటర్లలో మగ్గిపోయిన సామాన్య మధ్యతరగతి కుటుంబాల పిల్లల శ్రమ బూడిదలో పోసిన పన్నీరు కాకూడదంటే, రాజకీయ విమర్శలకు అతీతంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిన తరుణం ఆసన్నమైంది. విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలబెట్టడం, విద్యార్థుల భవిష్యత్తును రక్షించడం, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి.
ఫిరోజ్ ఖాన్, 9640466464



