Sunday, June 14, 2026
E-PAPER
Homeసోపతిబహు ఆనందమైన మా నేపాల్‌ యాత్ర

బహు ఆనందమైన మా నేపాల్‌ యాత్ర

- Advertisement -

హిమాలయ పర్వత ప్రాంతాల్లోని బహు సుందరమైన దేశం నేపాల్‌. ఈ యాత్రనే ఓ అపూర్వమైన అనుభవం. హైదరాబాదు నుండి మే 2న 135 మందిమి ఎస్‌.పి ఫ్రెండ్స్‌ బృందంగా పది రోజులు మంచు కొండల మధ్య ప్రాకృతిక చింతనతో విహరించి వచ్చాం. ఈ మహత్తర యాత్ర తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంచాలకులు శ్రీ జీవి శ్యాంప్రసాద్‌ లాల్‌ బంధు మిత్రుల సందర్శన కోసం ప్రకాష్‌ ట్రావెల్స్‌ ద్వార రూపొందించారు.

మే 2న హైదరాబాదులో రెండు విమానాల్లో బీహార్‌ రాజధాని పట్నా చేరుకున్నాం. పట్నా నుంచి మూడు ఏసీ బస్సుల్లో జార్ఖండ్‌ రాష్ట్రంలోని వైద్యనాథ్‌ కు పయనమయ్యాం. అది 265 కిలోమీటర్ల దారి 12 గంటలపైన ప్రయాణం. నార్త్‌ మనకన్నా ఎంత వెనుకబడి ఉన్నదో రోడ్లను చూస్తే కనిపిస్తుంది. దారి పక్కన ఊర్లలో ఇంటింటికి పాడి కనబడుతుంది. నగరాల్లో కూడా ఇండ్ల ముందు ఆవులు, బర్ల కోసం నీళ్ల తొట్టెలు మేత కోసం చొప్ప ఏర్పాట్లు ఉంటాయి. అలసిన ప్రయాణం తర్వాత దేవగిరి అని పిలువబడే డియోగర్‌ కు రాత్రి చేరుకున్నాం. అక్కడి నుంచి తెల్లవారుజామునే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వైద్యనాథ్‌ జ్యోతిర్లింగ దర్శనం. అనంతరం హోటల్‌ నుంచి నేపాల్లోని జనక్‌ పూర్‌ కు ప్రయాణం. 330 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాని పది గంటల ప్రయాణం. మధ్యలో జముయి, లకిసరాయి, బీహార్‌ లోని ముజఫర్‌ పూర్‌ పట్టణాలు దాటి వెళ్తాం. అర్థరాత్రి వరకు ఇండియా- నేపాల్‌ బార్డర్‌ దాటి నేపాల్‌ లో అడుగు పెట్టాం. అటు తర్వాత నేపాల్‌ లోని జనక్పూర్‌ చేరుకున్నాం.

మైథిలి చిత్రకళ : నేపాల్‌ వెళ్లడానికి భారతీయులకు వీసా అవసరం లేదు. పాస్పోర్ట్‌ లేదా ఓటర్‌ ఐడి కార్డ్‌ ఉంటే సరిపోతుంది. బార్డర్‌ దగ్గర హడావిడి ఏమీ ఉండదు. జనక్పూర్‌ భారత్‌ నేపాల్‌ బార్డర్‌లో ప్రసిద్ధ నగరం. ఇక్కడ జానకి దేవి మందిరం గొప్ప నిర్మాణం. అందంగా ఉంటుంది. దీనిని నవ్‌ లకవ మందిరం అంటారు. ఈ నగరం రద్దీ లేకుండా పల్లెటూరులా కనిపిస్తుంది. నగరం మధ్యలోనే చిన్న చిన్న నీటి కుంటలు చాలా కనిపిస్తాయి. మిథిలా రాజ్య ప్రస్థానం ఇక్కడే. మైథిలి చిత్రకళ ఇక్కడి ప్రసిద్ధి. ప్రతి ఇంటి గోడ మీద రామాయణం కావ్యానికి సంబంధించిన చిత్రాలు కుంచెతో దించి ఉంటాయి. జనక్‌ పూర్‌ లో చూడాల్సినవన్నీ చూసి బుద్ధ ఎయిర్లైన్స్‌ ద్వారా ఖాట్మండు చేరుకున్నాం. హోటల్‌ క్రిస్టల్‌ పశుపతిలో మా బస. 135 మంది బృందం అంటే 60 జంటలు. ఆ పెద్ద స్టార్‌ హోటల్లో 65 గదుల్లో అంతా తెలంగాణమే. ఖాట్మండులోని పశుపతినాథ్‌ దేవాలయం శైవ క్షేత్రాల్లో ప్రాచీనమైనది. పగోడా శైలిలో కట్టడం గొప్పగా ఉంటుంది. ఇక్కడ శివలింగానికి నాలుగు వైపుల ముఖాలు ఉంటాయి. ఇది బాగ్మతి నదీ తీరాన ఉంటుంది.

పరిశుభ్ర నగరం : నేపాల్‌ దేశంలో మన భారతీయుల రూపాయలు చెల్లుబాటు అవుతాయి. మన వంద రూపాయలకు వాళ్ల 160 రూపాయలతో సమానం. అన్ని దుకాణాలలో ఇండియా డబ్బులు నడుస్తాయి. ఫోన్‌ పే గూగుల్‌ పే లు కూడా పనిచేస్తాయి. ఏదైనా వస్తువు కొంటే నేపాలి రేటుకు మన ఫోన్‌ పే ఇండియన్‌ డబ్బులను కన్వర్ట్‌ చేసి పంపిస్తుంది. ఇక్కడ భాష కూడా మనకు సులభమే హిందీలో మాట్లాడుతారు. నేపాలి భాష వేరే ఉంటుంది. అది హిందీ పోలి ఉంటుంది. అందరూ మన ఇండియన్స్‌ ను అభిమానంగానే చూస్తారు. ఖాట్మండు నగరం పరిశుభ్రతగా ఉంటుంది. చెత్తాచెదారం నీళ్ల బాటిల్స్‌ ఎక్కడపడితే అక్కడ వేయరు. నగరంలో సైన్‌ బోర్డ్స్‌ ఇంగ్లీషులో ఉండవు. నేపాలి భాషలో ఉంటాయి, హిందీలాగా మనకు అర్థం అవుతాయి. ఖాట్మండులో నైట్‌ బజార్‌ కూడా ఉంది. డాన్స్‌ బార్‌ లు కూడా కనిపించాయి. మూడు రోజులు ఖాట్మండ్‌ నగరంలోనే గడిపాం. స్వయంభూనాథ్‌ ఒక విశిష్టమైన బౌద్ధ హిందూ క్షేత్రం. అక్కడ మంజుశ్రీ పర్వతం ఉంటుంది. ప్రార్థనా చక్రాలు ఉంటాయి. ఎత్తైన ఈ పర్వతం మీద కోతుల సంచారం ఎక్కువ. దీనిని మంకీ టెంపుల్‌ అని కూడా అంటారు. కానీ అవి యాత్రికులను ఏమీ అనవు. చాలా ఆనందభరితమైన వాతావరణం కనిపిస్తుంది. ఖాట్మండులోయలోనే బుద్ధ నీలకంఠ వద్ద మహావిష్ణువు ఆదిశేషుడిపై యోగ నిద్రలో నీటిపై తేలుతున్నట్టు ఉంటుంది.

ఖాట్మండులో కవి సమ్మేళనం :
మా 135 యాత్రికుల్లో 15 మందికి పైగా సాహిత్య ప్రియులం ఉన్నాం. ముందే ప్రణాళిక ప్రకారం హోటల్‌ క్రిస్టల్‌ పశుపతిలోని కుమార్‌ హాల్లో జీవి శ్యాంప్రసాద్‌ లాల్‌ ముఖ్య అతిథిగా తెలుగు కవి సమ్మేళనం అద్భుతంగా జరిగింది. దీనికి డాక్టర్‌ ఎస్‌.రఘు అధ్యక్షత వహించి నిర్వహించగా అన్నవరం దేవేందర్‌ విశిష్ట అతిథిగా కవి సమ్మేళనం ప్రారంభించారు. ఇందులో బూర్ల వెంకటేశ్వర్లు, మాడిశెట్టి గోపాల్‌, ఎర్రోజు వెంకటేశ్వర్లు, గాజుల రవీందర్‌, నాంపల్లి సుజాత, రావికంటి శ్రీనివాస్‌, దాసోజు జ్ఞానేశ్వర్‌, కూరెళ్ల పద్మాచారి, స్తంభంకాడి గంగాధర్‌, సివి శ్రీనివాస్‌, కష్ణ గోపాల్‌, ముత్తినేని శ్రీనివాసరావు మరి కొంతమంది పాల్గొని యాత్రల మీద కవిత్వం చెప్పారు. నేపాల్‌ గడ్డపై తెలుగు వాళ్ళం సమ్మేళనం జరుపుకోవడం ఒక కొత్త అనుభూతి.

దర్బార్‌ స్క్వేర్‌ : మరొక రోజు ఖాట్మండుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న భక్తాపూర్‌ దర్బార్‌ స్క్వేర్‌ కు వెళ్ళాం. దర్బార్‌ స్క్వేర్‌ 14 వ శతాబ్దం సంబంధించిన మల్లపు రాజులు నిర్మించిన గొప్ప కట్టడం. ఇది ఒక రాజప్రసాదం. చాలా విశాలంగా ఉంటుంది. ఇందులో చరిత్రకు సంబంధించిన వ¶్యజియం, ప్రాచీన దేవాలయాలు కనిపిస్తాయి. భక్తాపూర్‌ మునిసిపల్‌ కేంద్రం. ఈ మునిసిపాలిటీ ఆధ్వర్యంలోనే దర్బార్‌ స్పేర్‌ ఉంటుంది. అంతటా క్రమశిక్షణ. చెత్త ఎక్కడా పొరపాటున కూడా వేయకూడదు. అక్కడ మూత్ర విసర్జన కూడా ఆరు బయట ఎవరూ వెళ్ళరాదు. ఈ నిబంధన నగరంలోనే కాదు ముక్తినాథ్‌ కి వెళ్లే జనవాసాలు కనిపించని పర్వతాల దారిలో కూడా అమలవుతుంది. దర్బార్‌ స్క్వేర్‌ తర్వాత ధోలేశ్వర్‌ మహదేవ్‌ క్షేత్రాల సందర్శించాం. తర్వాత రోజు ఖాట్మండుకు 200 కిలోమీటర్ల దూరంలోని పోక్రా నగరానికి మా ప్రయాణం.


పోక్రా : పోక్రా నేపాల్‌ దేశానికి రెండవ అతిపెద్ద పర్యాటక నగరం. ముక్తినాథ్‌ యాత్రకు వెళ్లేవారు ఇక్కడి నుంచే వెళ్లాలి. చుట్టూ సరస్సులు హిమపర్వత శిఖరాలు కంటి ముందే నిలిచి ఉంటాయి. చల్లని ఆహ్లాద వాతావరణం. పోక్రా దారిలోనే మనోకామన దేవాలయ దర్శనం ఒక గొప్ప అనుభూతి. దీని పైకి కేబుల్‌ కార్‌ ద్వారా వెళ్లాలి. రెండు పెద్ద పర్వతాల పైనుంచి 1300 మీటర్ల పైకి వెళ్లాలి. త్రిశూలి, మార్శ్యాంగ్డి నదుల సంగమంలో ఉన్న కఫక్‌దాదా కొండపైన మనోకామన ఆలయం సౌందర్యంగా ఉంటుంది. ఇక్కడ రెండు మూడు గంటల తర్వాత తిరిగి పోక్రా నగరానికి చేరి హోటల్‌ నివాస్‌ లో బస చేశాం. తెల్లవారుజామున ఆరు గంటలకే అసలైన మా ప్రయాణం.

ముక్తినాథ్‌ : హిమగిరి కొండలపై ఉన్న ముక్తినాథ్‌కు లోయలు ఎక్కుతూ దిగుతూ కమాండర్‌ జీపులలో పోవాలి. మధ్యలో జాంసం అనే పర్వత నగరంలో బస చేయాలి. అక్కడి హోటల్‌ కిటికీలోంచి చూస్తే తెల్లగా పర్వతాలు మెరుస్తుంటాయి. గండకీ నది వెంబడి పర్వతాలు శిఖరాల మధ్య ప్రయాణం చేయడం ఒక గమ్మతి అనుభూతి. శిఖరాలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అయిదు గంటల యాత్ర తర్వాత గడ్డకట్టే చలి గజగజ వణుకుడు. అక్కడ జీరో డిగ్రీ ఉష్ణోగ్రత. చలి నుంచి రక్షించేందుకు దట్టమైన ఉన్ని దుస్తులు వేసుకోవాలి. వర్షం కూడా ఎప్పుడు పడితే అప్పుడే పడుతుంది. సముద్ర మట్టానికి 3710 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఆక్సిజన్‌ తక్కువగా అందుతుంది. ఆల్టిట్యూడ్‌ సిక్నెస్‌ రావచ్చు. శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి కష్టమవుతుంది. నేపాల్‌ లోని ముస్తాంగ్‌ జిల్లాలో చైనా టిబెట్‌ సరిహద్దుల్లో ముక్తినాథ్‌ ఆలయం ఉంటుంది. బౌద్ధులు చుమింగ్‌ గ్యాట్సా అంటారు. కొండల మధ్య దిగిన తర్వాత దాదాపు 370 మెట్లు ఎక్కి పోవాలి. పోలేని వారికోసం గుర్రాలు కూడా ఉంటాయి. ముక్తినాథ్‌ ఆలయం ప్రక్కన 108 జల థారలు ఉంటాయి. పర్యాటకులు ఈ నీటిధారలలో తడిచి ఆనంద అనుభూతి పొందుతారు. హిమగిరి నుంచి వస్తున్న నీళ్లు తేలికగా చల్లగా కొబ్బరి నీళ్లులా ఉంటాయి. కొంచెం దూరంలోనే భారీ బౌద్ధ విగ్రహం ఉంది.

ట్రెకింగ్‌ కేంద్రం : ముక్తినాథ్‌ దర్శనం తర్వాత తిరిగి జాంసం చేరుకొని విశ్రాంతి తీసుకోవాలి. తెల్లవారి ప్రాతః కాలమే తిరిగి పోక్రా ప్రయాణం. ఈ నగరంలో దేశ దేశాల పర్యాటకులు కనిపిస్తారు. దీనిని నేపాల్‌ పర్యాటక రాజధానిగా పిలుస్తారు. ఈ నగరం నుండి అన్నపూర్ణ పర్వత శ్రేణులు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పది శిఖరాలలో మూడింటిని (అన్నపూర్ణ, ధౌలగిరి, మనస్లు) స్పష్టంగా చూడవచ్చు. ఇది సాహస ట్రెకింగ్‌ కేంద్రం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అన్నపూర్ణ సర్క్యూట్‌ ట్రెక్కింగ్‌ యాత్ర పోక్రా నుంచే మొదలవుతుంది. ఫేవా సరస్సు చూడముచ్చటగా ఉంటుంది. గుప్తేశ్వర్‌ మహదేవ్‌ గుహ, ఇంటర్నేషనల్‌ మౌంటైన్‌ వ¶్యజియం. పగోడా శైలిలోని నిర్మాణాలు, అలాగే సారంగ్‌ కోట్‌ కొండపై నుంచి సూర్యోదయాన్ని లేదా సూర్యాస్తమయాన్ని చూడటం మరపురాని అనుభూతి. కానీ మాకు రెండూ సంభవించలేదు. సూర్యాస్తమయానికి వెళ్లేసరికి మబ్బులు అడ్డం వచ్చాయి. రోజంతా నగరంలో విహరించి హోటల్‌లో బస చేశాము.

సునోలికి ప్రయాణం : తెల్లవారి లేవగానే సోనాలి ప్రయాణం. నేపాల్‌ గ్రామాలు నగరాలు పల్లెలు వాతావరణం అంతా చూస్తూ సోనాలి ప్రయాణం సాగింది. అదే దారిలో గౌతమ బుద్ధుడు పుట్టిన నేల లుంబిని సందర్శన. రెండువేల ఆరువందల సంవత్సరాల క్రితం ప్రపంచశాంతికి ప్రతీక అయిన సిద్ధార్థుడు జన్మించిన ప్రాంతం చూడడం ఒక అనుభూతి. ఇక్కడే బుద్ధుడు జన్మించాడని తెలిపే అశోక స్తంభ శాసనం కనిపిస్తుంది. బుద్ధుడు జన్మించిన ఇల్లును పురాతన ఇటుక గోడలను చూడవచ్చు. దాని చుట్టూ మయన్మార్‌, థాయిలాండ్‌, జపాన్‌. చైనా, దక్షిణ కొరియా, శ్రీలంక జర్మనీ దేశాలు నిర్మించిన బౌద్ధ మందిరాలు ఉన్నాయి. సిద్ధార్థ తల్లి మాయా దేవి మందిరం దూరం దూరం ఉన్నా కాలినడకనే తిరిగాం. లుంబిని తర్వాత 30 కిలోమీటర్లలో సునోలికి ప్రయాణం. ఇది ఇండియా – నేపాల్‌ సరిహద్దులోని ఉత్తర ప్రదేశ్‌ పట్టణం. నేపాల్‌ వైపు బెలహీయా అనే టౌన్‌ ఉంటుంది. రెండు దాదాపు కలిసే ఉన్నట్టు ఉంటాయి. మధ్యలో సరిహద్దు. మేము బెలహీయాలో హోటల్లో బస చేసి తెల్లవారుజామున నేపాల్‌ నేలను దాటి మన దేశానికి చేరాం. అక్కడి నుంచి గోరక్‌ పూర్‌ కు మా ప్రయాణం. ఉదయం 6:30 వరకే గోరక్నాథ్‌ మఠం సందర్శించి, చాలాసేపు గడిపి మహాయోగి గోరకనాథ్‌ విమానాశ్రయం చేరుకున్నాం. అక్కడ ఇండిగో విమానం ఎక్కి హైదరాబాదులో వాలినం. 135 యాత్రికులతో 11 రోజుల ప్రయాణం అద్భుతంగా జరగడానికి కారణం శ్యాం ప్రసాద్‌ లాల్‌ ప్రణాళిక బద్ధమైన సూచనలే కారణం. ఆయన రూపొందించిన స్నేహ బృందంలో కవులు, రచయితలు, అధికారులు, ఉపాధ్యాయులు, ఆధ్యాపకులు, వ్యాపారులు, ఉద్యోగ విరమణ చెందినవారు ఎందరో కలిసి చేసిన ప్రయాణం ఇది.

అన్నవరం దేవేందర్‌
9440763479

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -