Sunday, June 14, 2026
E-PAPER
Homeఖమ్మంబడిబాటతో పెరిగిన చేరికలు

బడిబాటతో పెరిగిన చేరికలు

- Advertisement -

– పర్యవేక్షణ ఫలితంగా మెరుగవుతున్న విద్యా ప్రమాణాలు
– ప్రభుత్వ పాఠశాలల వైపు పెరుగుతున్న ఆకర్షణ
– నేడు ప్రారంభం కానున్న విద్యాసంవత్సరం 
నవతెలంగాణ – అశ్వారావుపేట

ప్రభుత్వాల పాలనా విధానాల్లో వారి విద్యా దృక్పథం స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. విద్య ద్వారా ఒక తరాన్ని సమగ్రంగా మార్చవచ్చనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నినాదానికి అనుగుణంగా రాష్ట్ర విద్యాశాఖ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, జాతీయ విద్యా విధానం అమలు, విద్యార్థుల చేరికల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఆశాజనక ఫలితాలు కనిపిస్తున్నాయి.

అశ్వారావుపేట మండలంలో 2025–26 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నమోదు పెంపు కోసం అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ, బడిబాట కార్యక్రమం, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల్లో అవగాహన పెంపు వంటి అంశాలు చేరికల వృద్ధికి దోహదపడ్డాయి.

ఎంఈఓ ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం మండలంలో మొత్తం 96 విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 64, గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలలు 22, ఆశ్రమ పాఠశాలలు 6, ఎయిడెడ్ పాఠశాల 1, గురుకుల పాఠశాలలు 3, ప్రైవేట్ పాఠశాలలు 10 ఉన్నాయి.

మండలాల వారీగా విద్యార్థుల నమోదు

మండలం          2024–25     2025–26  వ్యత్యాసం
అశ్వారావుపేట     3321            3518         +197
అన్నపురెడిపల్లి    1092            1139            +43
ములకలపల్లి        2238            2246           +08
చండ్రుగొండ          2062            2040            -22
దమ్మపేట              3566            3524            -42

గణాంకాలను పరిశీలిస్తే అశ్వారావుపేట మండలంలోనే అత్యధికంగా 197 మంది విద్యార్థుల చేరికలు పెరిగాయి.అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి మండలాల్లో కూడా స్వల్ప వృద్ధి నమోదైంది. మరోవైపు చండ్రుగొండ, దమ్మపేట మండలాల్లో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, మొత్తం మీద ప్రభుత్వ విద్యాసంస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

విద్యార్థుల చేరికల పెరుగుదలతో పాటు విద్యా ప్రమాణాల మెరుగుదలపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థిని పాఠశాలకు చేర్చాలనే లక్ష్యంతో విద్యాశాఖ ముందుకు సాగుతోంది. దీంతో రానున్న రోజుల్లో నమోదు శాతం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -