రాష్ట్రంలోనే అరుదైన ఘట్టం
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట పురపాలక సంఘం ఛైర్పర్సన్ గా భార్య,వైస్ చైర్మన్ భర్త ఎన్నిక కావడం రాష్ట్రంలోనే అరుదైన ఘట్టంగా నమోదయింది. మొత్తం 22 వార్డుల్లో 17 మంది కాంగ్రెస్,ఇరువురు టీఆర్ఎస్,ఇరువురు స్వతంత్రులు,ఒకరు బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం తో మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 6 వ వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైన జూపల్లి శశికళ, 13 వ వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైన శశికళ భర్త, కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్ బాబు లు కాంగ్రెస్ అభ్యర్ధులు గా గెలుపొందారు.
జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ దినేష్ వి.పాటిల్ చే నియమించబడిన అశ్వారావుపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నికల అధికారి,భూ పరిపాలన ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ జే.కార్తీక్ పర్యవేక్షణలో కౌన్సిలర్ లు ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం జరిగిన ప్రత్యేక సమావేశంలో మున్సిపల్ ఛైర్పర్సన్ గా జూపల్లి శశికళ ను 10 వ వార్డు కౌన్సిలర్ మిండ హరిబాబు ప్రతిపాదించగా 12 వ వార్డు కౌన్సిలర్ అట్టం రమ్య లు బలపరిచారు.శశికళ కు పోటీ గా ఎవరూ లేకపోవడంతో శశికళ ను అశ్వారావుపేట ఛైర్పర్సన్ గా ధృవీకరిస్తూ ఎన్నికల అధికారి ప్రకటించారు.
అనంతరం వైస్ చైర్మన్ గా జూపల్లి రమేష్ బాబు ను 1 వ వార్డు కౌన్సిలర్ డేరంగుల ప్రసాద్ ప్రతిపాదించగా,2 వ వార్డు కౌన్సిలర్ దగ్గుమల్లి మౌనిక బలపరిచారు.ఈయనకు సైతం పోటీగా ఎవరూ రాకపోవడంతో జూపల్లి శశికళ,జూపల్లి రమేష్ బాబులు తో అశ్వారావుపేట ఛైర్పర్సన్,ఉప చైర్మన్ లు ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ మున్సిపల్ దంపతులకు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ లు,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా,అధికారులు,పలు పార్టీల నాయకులు,వివిధ సంఘాల బాధ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.2025 లో నూతనంగా ఏర్పడిన అశ్వారావుపేట మున్సిపాలిటీకి తొలిసారి జరిగిన ఎన్నికల్లో వెలమ సామాజిక వర్గం నుండి,భార్యాభర్తలు మొట్టమొదటి చైర్మన్,వైస్ చైర్మన్ పదవులను అలంకరించడం చర్చనీయాంశం అయింది. ఈ సందర్భంగా అభిమానులు,అనుచరులు కాంగ్రెస్ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.



