బీఆర్ఎస్ నేతల స్పష్టం చేయాలి..
ఆరోపణలు నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా… : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గురుకుల విద్యాసంస్థల్లో కొనుగోళ్లు, టెండర్ల విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొట్టిపారేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వారు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…ఒకే అంశంపై బీఆర్ఎస్ నాయకులు మూడు రకాల అంకెలు చెబుతున్నారని విమర్శించారు. హరీశ్ రావు రూ.2 వేల కోట్ల కుంభకోణమని చెబుతుండగా, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రూ.3 వేల కోట్ల వరకు కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు వారి అనుబంధ మీడియా సంస్థలు రూ.200 కోట్ల వ్యవహారమంటూ ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. “అసలు నిజమైన అంకె ఏది..? రూ.200 కోట్లా..? రూ.2 వేల కోట్లా..? రూ.3 వేల కోట్లా..? మీకే క్లారిటీ లేకపోతే ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? ” అని ప్రశ్నించారు. హరీశ్ రావు చెప్పింది నిజమని ఆధారాలతో నిరూపిస్తే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి ప్రజల సమక్షంలోనే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు. టెండర్ల గురించి తనకు, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు తెలియదని ప్రచారం చేయడం పూర్తిగా అబద్ధమని మంత్రి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ముగ్గురు మంత్రులతో , అధికారులతో, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సమీక్ష నిర్వహించిన అనంతరమే కొనుగోలు ప్రక్రియను చేపట్టామని తెలిపారు. ప్రతి నిర్ణయం పారదర్శకంగా జరుగుతోందని, హైకోర్టు కూడా టెండర్ విధానాన్ని సమర్థించిందని వివరించారు. కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, న్యాయస్థానం ఈ విధానాన్ని సమర్థించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గుర్తు చేశారు. టెండర్లన్నీ ఈ-ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా, సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించామని వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న విద్యార్థులకు అవసరమైన 27 రకాల వస్తువుల కొనుగోలుకు ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలిచినట్టు తెలిపారు. వాటిలో యూనిఫాం క్లాత్, ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, ట్రంక్ బాక్సులు, స్కూల్ బ్యాగులు, బూట్లు, సాక్సులు, – బెడ్డింగ్ మెటీరియల్, నోట్‌బుక్స్, స్టేషనరీ కిట్లు, పీటీ డ్రెస్, ట్రాక్ సూట్లు, టైలు, బెల్టులు, ఐడీ కార్డ్ హోల్డర్లు ఉన్నాయని చెప్పారు. బెడ్ షీట్లు, కార్పెట్లు, బ్లాంకెట్లు, టవల్స్ కొనుగోలు కోసం వచ్చిన టెండర్లలో పోటీ ప్రక్రియ అనంతరం ధరలను తగ్గించినట్టు తెలిపారు. బెడ్ షీట్ ధర రూ.425 నుంచి రూ.405కు, కార్పెట్ ధర రూ.412 తగ్గించినట్టు వివరించారు. బెడ్ షీట్లు – 3 లక్షలు, – కార్పెట్లు – 2.29 లక్షలు, – బ్లాంకెట్లు – 6.49 లక్షలు, టవల్స్ – 1,500 కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. ఈ మొత్తం కొనుగోలు విలువ రూ.70.86 కోట్లు అని వెల్లడించారు.
ట్రంక్ బాక్సులకు ఐదు కంపెనీలు దరఖాస్తు చేశాయని తెలిపారు. పోటీ ప్రక్రియలో ధరలను చర్చల ద్వారా – ప్రారంభ ధర రూ.1,299 ఉండగా రూ.1,275 గా నిర్ణయించామని చెప్పారు. దీని మొత్తం విలువ రూ.41.40 కోట్లు అని వెల్లడించారు. యూనిఫాం క్లాత్ టెండర్లలో మూడు సంస్థలు పాల్గొన్నాయని మంత్రి తెలిపారు. మొత్తం వర్క్ ఆర్డర్ విలువ రూ.298.10 కోట్లు, ప్రభుత్వ రంగ సంస్థ టీజీఎస్సీఓకు 60 లక్షల మీటర్ల వస్త్ర సరఫరా బాధ్యత అప్పగించామని తెలిపారు. దీని విలువ: రూ.57.17 కోట్లు అని వెల్లడించారు. ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్ల కోసం రెండు సంస్థలు అర్హత సాధించగా, తక్కువ ధర కోట్ చేసిన సంస్థకు టెండర్ కేటాయించినట్టు చెప్పారు. ఒక్కో సెట్ ధర రూ.360, మొత్తం కొనుగోలు విలువ రూ..18.36 కోట్లు అన్నారు. అధిక ధరలు వచ్చిన నోట్‌బుక్, ట్రాలీ బ్యాగ్ టెండర్లను రద్దు చేశామని, స్టేషనరీ కిట్‌ను జిల్లా స్థాయిలో కొనుగోలు చేయాలని నిర్ణయించామని, పీటీ డ్రెస్, ట్రాక్ సూట్ల టెండర్లను ఇంకా ఖరారు చేయలేదని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులకు అవసరమైన వస్తువులు విద్యా సంవత్సరం ప్రారంభమైన అనేక నెలల తర్వాత అందేవని మంత్రి అడ్లూరి విమర్శించారు.
రూ.200 కోట్లా..? రూ.2 వేల కోట్లా..? రూ.3 వేల కోట్లా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



