Saturday, June 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌కు 300 బిలియన్ డాలర్లు ఎవరు చెల్లిస్తారు?

ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్లు ఎవరు చెల్లిస్తారు?

- Advertisement -

ట్రంప్–వాన్స్ వ్యాఖ్యలతో మరింత గందరగోళం డెమోక్రాట్లతో పాటు రిపబ్లికన్లలోనూ ఆందోళన
అమెరికాలో రాజకీయ దుమారం
వాషింగ్టన్‌ :
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మధ్య కుదిరిన యుద్ధ విరమణ అవగాహన ఒప్పందంలో ఇరాన్ పునర్నిర్మాణం కోసం కనీసం 300 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికను రూపొందిస్తామని పేర్కొన్నారు. అయితే ఈ భారీ మొత్తాన్ని ఎవరు భరిస్తారన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో అమెరి కాలో రాజకీయ వివాదం ముదురుతోంది. ట్రంప్, ఉపాధ్య క్షుడు జేడీ వాన్స్ అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బు ఇందులో ఉండదని చెప్తున్నప్పటికీ.. ప్రతిపక్ష డెమోక్రాట్లు, కొందరు రిపబ్లికన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా–ఇరాన్ మధ్య బుధవారం కుదిరిన అవగాహన ఒప్పందంలోని ఆరో అంశంలో… “అమెరికా ప్రాంతీయ భాగస్వాములతో కలిసి ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి కోసం కనీసం 300 బిలియన్ డాలర్ల విలువైన దృఢమైన, పరస్పర అంగీకార ప్రణాళికను రూపొందించేందుకు కృషి చేస్తుంది” అని పేర్కొన్నారు. ఈ ప్రణాళిక అమలుకు సంబంధించిన తుది నిర్ణయాలు 60 రోజుల చర్చల కాలంలో తీసుకోనున్నారు. 300 బిలియన్ డాలర్ల అంశంపై రాజకీయ దుమారం చెలరేగడంతో ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో స్పందించారు. “అమెరికా ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్లు చెల్లించడం లేదు. ఇది పూర్తిగా తప్పుడు వార్త. అమెరికాకు ముఖ్యమైనది విజయం, చమురు ధరల తగ్గుదల, ఆర్థిక విజయమే. స్టాక్ మార్కెట్‌ను చూడండి. ఇది డెమోక్రాట్ల ప్రచారం మాత్రమే” అని ఆయన పేర్కొన్నారు.

ట్రంప్ ప్రకటనకు ముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ది న్యూయార్క్ టైమ్స్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా పన్ను చెల్లింపుదారులపై ఎలాంటి భారమూ ఉండదని స్పష్టం చేశారు. అమెరికా డబ్బులో ఒక్క పైసా కూడా ఇరాన్‌కు వెళ్లదని ఆయన అన్నారు. తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో వాన్స్ మరింత వివరణ ఇస్తూ.. ఈ ప్రణాళికకు అవసరమైన నిధులను ప్రాంతీయ అరబ్ దేశాలు లేదా ఇరాన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న ఇతర దేశాల నుంచి సమీకరించే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఒప్పందంలోని అన్ని షరతులనూ ఇరాన్ పూర్తిగా పాటించి, తన ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చిన తర్వాత మాత్రమే ఆ నిధులు అందుతాయని వివరించారు. అయితే ఇప్పటివరకు ఏ దేశమూ ఈ ప్రణాళికకు ఆర్థిక సహాయం అందిస్తామని అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.

అమెరికాలో ట్రంప్‌పై తీవ్ర విమర్శలు
ఈ 300 బిలియన్ డాలర్ల అంశం అమెరికా అంతర్గత రాజకీయాల్లో పెద్ద వివాదంగా మారింది. నవంబర్‌లో జరగ నున్న మధ్యంతర ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష డెమోక్రాట్లు ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్నారు. డెమోక్రాటిక్ సెనేటర్ అమీ క్లొబుచర్ మాట్లాడుతూ… “300 బిలియన్ డాలర్లతో అమెరికాలో నిరాశ్రయ సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చు. 40 ఏండ్ల పాటు క్యాన్సర్ పరిశోధనలకు నిధులు సమకూర్చవచ్చు. ప్రతి చిన్నారికీ ఏడు సంవత్సరాల పాటు ఉచిత విద్య అందించవచ్చు. కానీ ట్రంప్ ఆ డబ్బును ఇరాన్‌కు పంపుతున్నారు” అని విమర్శించారు.
సెనేట్‌లో డెమోక్రాటిక్ పార్టీ నాయకుడు చక్ షూమర్ కూడా తీవ్రంగా స్పందించారు. “ట్రంప్ ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్లు పంపేందుకు డెమోక్రాట్లు ఎలాంటి సహకారమూ అందించరు” అని ఆయన పేర్కొన్నారు. మరో సోషల్ మీడియా పోస్టులో… “అమెరికా 300 బిలియన్ డాలర్లు ఇవ్వడం లేదని ట్రంప్ చెప్తున్నారు. కానీ ఆ ఎంఓయూపై ఆయన సొంత సంతకం ఉంది. ముందు ఆయన తన ఒప్పందాన్ని తానే చదవాలి” అని ఎద్దేవా చేశారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన మరో చట్టసభ సభ్యుడు జేసన్ క్రో కూడా విమర్శలు గుప్పించారు. “అమెరికన్ల ఆరోగ్య సంర క్షణను మెరుగుపరచడానికి డబ్బు లేదని చెప్పే రిపబ్లికన్లు, ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్లు ఇవ్వడానికి మాత్రం నిధులు ఎలా సమకూరుస్తున్నారు?” అని ప్రశ్నించారు.

రిపబ్లికన్ పార్టీలోనూ అసంతృప్తి
ఈ అంశంపై డెమోక్రాట్లే కాదు.. ట్రంప్ సొంత రిపబ్లికన్ పార్టీలోని కొందరు నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌‌నకు సన్నిహితుడిగా భావించే సెనేటర్ రోజర్ వికర్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బు నేరుగా వినియోగించకపోయినా.. 300 బిలియన్ డాలర్ల మొత్తం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఇరాన్‌కు అందిన ప్రయోజనాల కంటే చాలా పెద్దదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా వికర్ 2015లో కుదిరిన ‘జాయింట్ కాంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్’ (జేసీపీఓఏ) ఒప్పందాన్ని ప్రస్తావించారు. ఆ ఒప్పందం ప్రకారం ఇరాన్ తన అణు కార్య క్రమాన్ని పరిమితం చేయడంతో పాటు అంతర్జాతీయ తనిఖీలకు అనుమతించ డానికి అంగీకరించింది. ప్రతిగా ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను సడలించారు. అలాగే విదేశీ బ్యాంకుల్లో నిల్వ ఉన్న ఇరాన్‌కు చెందిన సుమారు 55 బిలియన్ డాలర్ల స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేశారు. అయితే ట్రంప్ 2018లో ఆ ఒప్పందం నుంచి అమెరికాను ఏకపక్షంగా ఉపసంహరించుకున్నారు. అప్పటి నుంచి ఇరాన్‌తో కుదిరే ఏ భవిష్యత్ ఒప్పందమైనా ఒబామా ఒప్పందం కంటే ఎంతో మెరుగైనదిగా ఉంటుందని ఆయన పదేపదే చెప్తూ వచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -