అమెరికా-ఇరాన్ కీలక చర్చలకు బ్రేక్
లెబనాన్‌లో ఇజ్రాయిల్
దాడుల ఎఫెక్ట్
కాల్పుల విరమణపై
హామీలకు టెహ్రాన్ డిమాండ్
ఇజ్రాయిల్ తీరుపై
జేడీ వాన్స్ ఆగ్రహం
లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల కారణంగా అమెరికా, ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన కీలక చర్చలు వాయిదా పడ్డాయి. లెబనాన్‌లో ఇజ్రాయిల్ సైనిక చర్యలు పూర్తిగా నిలిచిపోతాయనే హామీ లభించిన తర్వాతే చర్చలకు తిరిగి హాజరవుతామని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు
వాషింగ్టన్, టెహ్రాన్ : అమెరికా–ఇరాన్ ఒప్పందం ప్రకారం అన్ని రంగాల్లో సైనిక చర్యలు ముగియాల్సి ఉన్నప్పటికీ.. లెబనాన్‌లో ఇజ్రాయిల్-హిజ్బుల్లా మధ్య ఘర్షణలు కొనసాగుతుండటంతో శాంతి ప్రక్రియపై అనిశ్చితి నెలకొంది. వివరాళ్లోకెళ్తే… స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన అమెరికా–ఇరాన్ చర్చలు షెడ్యూల్ ప్రకారం జరగవని స్విస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 60 రోజుల్లో ఒప్పందాన్ని ఖరారు చేయాల్సిన నేపథ్యంలో తాజా పరిణామంతో చర్చలకు లభించే సమయం మరింత తగ్గిపోయినట్టయ్యింది. లెబనాన్‌లో ఇజ్రాయిల్ గందరగోళ పరిస్థితులు సృష్టించడం పట్ల ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అణుచర్చలు కొనసాగేందుకు.. ఇజ్రాయిల్ హిజ్బుల్లాపై దాడులను మరింత తీవ్రతరం చేయబోదని అమెరికా ఇరాన్‌కు తెలిపినట్టు సమాచారం. అయితే హిజ్బుల్లాపై మరింత దూకుడుగా వ్యవహరించాలనే ఒత్తిడి దేశంలోని కొన్ని వర్గాల నుంచి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై పెరుగుతోంది. అమెరికా–ఇరాన్ ఒప్పందం లెబనాన్‌లో యుద్ధానికి ముగింపు పలికినప్పటికీ.. ఘర్షణ వాతావరణం మాత్రం అలాగే కనిపిస్తోంది. హిజ్బుల్లాపై దాడులతో ఇజ్రాయిల్ లెబనాన్‌లో రణరంగాన్ని సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌పై జరిపిన వైమానిక దాడుల్లో 47 మంది మృతి చెందారు. జనావాస ప్రాంతాలపై వరుస దాడులు జరిగాయని స్థానిక వర్గాలు తెలిపాయి. దీంతో ఇజ్రాయిల్ తీరుతో ఒక్క లెబనాన్‌లోనే కాదు.. దాని ప్రభావం అమెరికా-ఇరాన్ చర్చలపై పడి యావత్ ప్రపంచానికీ నష్టాన్ని కలగజేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇజ్రాయిల్ చర్యలు ఆటంకం కలిగించాయి : జేడీ వాన్స్
తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ఇజ్రాయిల్‌పై విమర్శలు గుప్పించారు. లెబనాన్‌లో ఇజ్రాయిల్ సైనిక చర్యలు అమెరికా–ఇరాన్ చర్చలకు ఆటంకం కలిగించాయని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను విమర్శిస్తున్న ఇజ్రాయిల్ నాయకులపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ప్రపంచంలో మిగిలిన ఏకైక శక్తివంతమైన మిత్రదేశాన్ని విమర్శించడం సరైంది కాదు’’ అని ఆయన హెచ్చరించడం గమనార్హం.
ఇజ్రాయిల్ మంత్రుల కఠిన వ్యాఖ్యలు
లెబనాన్‌పై ఇజ్రాయిల్ మంత్రుల విద్వేషపూరిత వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్ గ్వీర్ ‘లెబనాన్ మొత్తం దగ్ధమవ్వాలి’ అని వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ మాట్లాడుతూ.. ‘నరక ద్వారాలు తెరవాలి’ అంటూ మరింత కఠిన సైనిక చర్యలకు పిలుపునిచ్చారు. దక్షిణ లెబనాన్‌లో ఆక్రమించిన భూభాగం నుంచి వెనక్కి తగ్గే ఉద్దేశం లేదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఇజ్రాయిల్ తీరు ప్రస్తుత కీలక చర్చలకు ఆటంకం కలిగిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు.
హార్ముజ్ పరిస్థితి
హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు క్రమంగా పునరుద్ధరించబడుతున్నాయి. అయితే ఇది యుద్ధానికి ముందు ఉన్న స్థాయికి చేరుకోవడానికి ఇంకా కొన్ని వారాలు పట్టవచ్చని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. జలసంధి రాకపోకలపై కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థ పర్యవేక్షణ చేస్తుందని ఇరాన్ జాతీయ భద్రతా మండలి ప్రకటించింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడటం అంతర్జాతీయ మార్కెట్లకు అత్యంత ప్రాధాన్యంగా మారింది.
ఇజ్రాయిల్ మంత్రి వ్యాఖ్యలపై ఇరాన్ ఆగ్రహం
లెబనాన్ మొత్తం దగ్ధం కావాలంటూ ఇజ్రాయిల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్ గ్వీర్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు ఒక సాధారణ వ్యక్తి చేసినవి కావనీ, ఇజ్రాయిల్ ప్రభుత్వంలోని కీలక మంత్రే చేసినవని పేర్కొంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయిల్ ప్రభుత్వానికి శాశ్వత యుద్ధమే లక్ష్యంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. లెబనాన్ భూభాగం లో హిజ్బుల్లా పేలుడు దాడిలో నలుగురు ఇజ్రాయిల్ సైనికులు మరణించిన అనంతరం ఇజ్రాయిల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్ గ్వీర్ ‘లెబనాన్ మొత్తం దగ్ధం కావాలి’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. ఇది ఒక తీవ్రవాద భావజాలం కలిగిన వ్యక్తి ఆవేశపూరిత వ్యాఖ్య కాదనీ, ఇజ్రాయిల్ ప్రభుత్వంలోని జాతీయ భద్రతా మంత్రి చేసిన అధికారిక ప్రకటన అని విమర్శించారు. ఇజ్రాయిల్ ప్రభుత్వం శాంతి కంటే యుద్ధాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
హార్ముజ్ గుండా వెళ్లే నౌకలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి : ఇరాన్
హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల సురక్షిత రాకపోకల కోసం కొత్త నిబంధనలను ఇరాన్ అమల్లోకి తీసుకొచ్చింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలసంధి గుండా ప్రయాణించే అన్ని వాణిజ్య నౌకలు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని అనుమతి పొందాలని ఇరాన్ ప్రకటించింది. నౌక యజమానులు, కెప్టెన్లు ప్రత్యేక అనుమతి పత్రం, బీమా పొందిన తర్వాతే జలసంధిలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంటుందని తాజాగా ఏర్పాటు చేసిన పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ (పీజీఎస్‌ఏ) వెల్లడించింది. అమెరికా–ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ప్రకారం అమలయ్యే 60 రోజుల కాలంలో రిజిస్ట్రేషన్, బీమా, భద్రతా సేవల కోసం ఎలాంటి రుసుములూ వసూలు చేయబోమని ఇరాన్ ప్రకటించింది. ఈ ఖర్చులను ఇరాన్ ప్రభుత్వమే భరిస్తుందని పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ తెలిపింది. అయితే 60 రోజుల గడువు ముగిసిన తర్వాత భద్రత, పర్యావరణ సేవలు, బీమా తదితర అంశాలపై రుసుములు విధించే అవకాశం ఉందని ఇరాన్ సంకేతాలు ఇచ్చింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం తొలి 60 రోజుల తర్వాత కూడా జలసంధి ‘టోల్-ఫ్రీ’గా కొనసాగుతుందని చెప్పారు. అయితే ఇరాన్ తాజా ప్రకటన తో రెండు దేశాల మధ్య ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు కనిపిస్తోంది. జలసంధిలో ఇంకా సముద్ర గనుల (మైన్‌లు) ముప్పు ఉన్నందున నౌకలు నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణిం చాలని ఇరాన్ ఆదేశించింది. నిర్ణయించిన మార్గాన్ని ఉల్లంఘిస్తే జరిగే ప్రమాదాలకు నౌక యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. యుద్ధం, భద్రతా ఆందోళనల కారణంగా నెలల తరబడి హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు తీవ్రంగా తగ్గిపోయాయి. అయితే పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. సముద్ర నిఘా సంస్థ ఏఎక్స్‌ఎస్‌మెరైన్ ప్రకారం గురువారం ఒక్కరోజే 25 వాణిజ్య నౌకలు హార్ముజ్ జలసంధిని దాటాయి. ఏప్రిల్ తర్వాత ఇది అత్యధిక సంఖ్య కావడం గమనార్హం.



