Saturday, June 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువిద్య..విధ్వంసం

విద్య..విధ్వంసం

- Advertisement -

పదేండ్ల కేసీఆర్‌ పాలనలో జరిగింది అదే
కానీ మేం చదువును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం
అందుకే ఆ శాఖకు మంత్రిగా నేనే కొనసాగుతున్నా
బడ్జెట్‌‌లో 8.5 శాతం నిధులు కేటాయించాం
కులవ్యవస్థ నిర్మూలన, సమానత్వం విద్యతోనే సాధ్యం
విద్యార్థులకు యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ల పంపిణీ
కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బడుల మూసివేత కొనసాగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ‌సర్కారు విద్యాశాఖను విధ్వంసం చేసిందని, ఆ పదేండ్ల అరాచకత్వంతో రాష్ట్రానికి వందేళ్ల నష్టం జరిగిందని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యకు ప్రాధాన్యమిస్తుందనీ, అందుకే ముఖ్యమంత్రిగా తన వద్దే ఆ శాఖను పెట్టుకున్నానని తెలిపారు. ఆ శాఖకు బడ్జెట్ లో 8.5 శాతం నిధులు కేటాయించి, రూ.26,600 కోట్లను విద్య కోసం వెచ్చిస్తున్నామని తెలిపారు. తరగతి గదుల్లో దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుందని నమ్మి తాము ముందుకు వెళుతున్నామని చెప్పారు. కుల వ్యవస్థ నిర్మూలనతోనే సమానత్వం సాధ్యమవుతుందన్నారు. కులాల పేరుతో గురుకులాలకు భిన్నంగా అందరికి సమాన విద్యనందించే దిశగా తమ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను తీసుకొస్తోందని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి అవి అందుబాటులోకి వస్తాయన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఎల్ స్టేడియంలో విద్యాశాఖ, వివిధ సంక్షేమ శాఖల సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో కలిసి గురుకుల, వసతి గృహ, పాఠశాల విద్యార్థులకు ఏడు వస్తువులతో కూడిన యంగ్‌ ఇండియా స్కూడెంట్‌ ‌కిట్స్‌ పంపిణీని ఆయన ప్రారంభించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగానో, పాలనా సౌలభ్యం కోసం ఏర్పడలేదనీ, విద్యార్థుల కలలు సాకారం చేసుకునేందుకు ఆత్మ బలిదానాలు, త్యాగాలతో ఆవిర్భవించిందని గుర్తుచేశారు. విద్యాశాఖను ప్రక్షాళన చేసే క్రమంలో రాష్ట్రానికి ప్రత్యేకంగా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొస్తున్నామన్నారు. విద్యా కమిషన్ ను ఏర్పాటు చేశామనీ, ఆ కమిషన్ సిఫారసులు అందజేసిందని తెలిపారు. విద్యకు వెచ్చించే వ్యయాన్ని ఖర్చుగా కాకుండా భావి తరాలకు పెట్టుబడిగా తాము భావిస్తున్నట్టు చెప్పారు. ఆరుట్లలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ లో ‘నో అడ్మిషన్’ బోర్డును పెట్టారనీ, 1,814 అడ్మిషన్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా 1,500 దరఖాస్తులు అదనంగా వచ్చాయని చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా ప్రభుత్వ బడిలో నో అడ్మిషన్ బోర్డు వచ్చిందనీ, అయినా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడంటూ బుద్ధిలేని విమర్శలు చేస్తున్నారని సీఎం తప్పుపట్టారు. పదేళ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ గురుకుల విద్యార్థుల డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచలేదని విమర్శించారు.

తమ ప్రభుత్వం డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలను 200 శాతం పెంచడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన జీతాలు వేసినట్టుగానే వాటిని కూడా చెల్లించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రీ ప్రైమైరీ విధానం తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామన్నారు. రాబోయే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) రాకతో కోట్లాదిమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారనీ, అందుకే బ్లూ కాలర్ జాబ్స్ వైపు దృష్టి సారిం‌చామన్నారు. యువతకు ఇంగ్లీష్ తో పాటు జర్మనీ, జపాన్ తదితర భాషలను నేర్పించి విదేశీ ఉద్యోగ అవకాశాలు అందుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు అన్ని రంగాల్లో ఉన్నత స్థానాల్లోకి ఎదగాలనీ, దేశాన్ని నడిపించే శక్తిగా మారాలని ఆకాంక్షించారు. ఒక్క అంబేద్కర్ ఎంతో ప్రభావితం చేశారనీ, ఆయన స్పూర్తితో వందలాది మంది అంబేద్కర్ లు తయారు కావాలని పిలుపునిచ్చారు. తలరాతను మార్చే శక్తి చదువుకే ఉందనీ, దానికోసం ఏం కావాలన్నా ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా, స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామనీ, భవిష్యత్తులో విద్యార్థులకు రవాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని సీఎం ప్రకటించారు.

మత్తు వద్దు… జీవితమే ముద్దు : గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
‘మత్తు వద్దు..జీవితమే ముద్దు’అనేనినాదంతో ముందుకెళ్లాలని రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే మంచి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలబడాలన్నారు. ప్రభుత్వం తీసుకునే మంచి నిర్ణయాలను స్వాగతిస్తూనే మద్దతుగా నిలుస్తానని,అదే సమయంలో లోపాలను, తప్పులను ఎత్తిచూపుతూ సరైన సూచనలు చేస్తానని గవర్నర్ అన్నారు. డ్రగ్స్ రహిత సమాజ ఏర్పాటుకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొవ్నం ప్రభాకర్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ మాట్లాడారు. మంత్రులు డి.శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, కె.కేశవరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కాలేజీ విద్యా కమిషనర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -