Friday, February 20, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికులమత రహిత ధృవీకరణే కాదు, జీవనమూ సాధ్యమే!

కులమత రహిత ధృవీకరణే కాదు, జీవనమూ సాధ్యమే!

- Advertisement -

కులమత రహితంగా జీవనం సాగించడం ప్రస్తుత సాధ్యమేనా? అంటే సాధ్యమేనని నిరూపించిన వారున్నారు. అయితే వారు కొన్ని సవాళ్లను ఎదుర్కుంటూ ముందుకు నడవాల్సి ఉంటుంది. ఇందుకు ఒక మంచి ఉదాహరణ స్నేహ పార్థిబరాజా. న్యాయవాద వృత్తిలో ఉన్న ఆమె, ఎన్ని అడ్డంకులొచ్చినా లెక్కచేయలేదు. ఒక దశాబ్దానికి పైగా అలుపెరుగని పోరాటమే చేశారు. కులమతాలను అధికారికంగా రద్దుచేసుకుని, తను భారతీయురాలినని.. మనిషినని సగర్వంగా చాటుకోగలిగారు. అధికారికంగా కులమత రహిత ధృవ పత్రాన్ని పొందిన తొలివ్యక్తిగా ఆమె తన పేరు నమోదు చేసుకోగలిగారు. ఒక ప్రత్యేకమైన విశిష్ట గౌరవాన్ని స్వంతం చేసుకోగలిగారు.

తమిళనాడులోని వేటారు జిల్లా తిరుపత్తూరు రెట్టమలై శ్రీనివాసన్‌ పేటైకు చెందిన శ్రీమతి స్నేహ పార్థిబరాజా నేపథ్యం ఇలా ఉంది. ఆమె తల్లిదండ్రులది కులాంతర వివాహం. వారికి ముగ్గురు అమ్మాయిలు. వారిలో పెద్దమ్మాయి స్నేహ. తర్వాత ముంతాజ్‌, జెన్నిఫర్‌ అని మరో ఇద్దరమ్మాయిలు. వాళ్లకు కులం, మతం ఏదో తెలియకుండా కావాలనే తల్లిదండ్రులు పేర్లు అలా కలిపిపెట్టారు. వీళ్లను బళ్లో చేర్చేప్పుడు తమకు కులం, మతం లేవని చెబితే పాఠశాల యాజమాన్యం వారు ఒప్పుకోలేదు. ఈ అమ్మాయిల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన చేశారు. దాంతో చివరకు ఎలాగో అప్పటికి వారిని పాఠశాలలో చేర్చుకున్నారు. ఇక అప్పటినుంచి టి.సి (ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్లలో ‘కులరహితం’ అని రాయమని ఒత్తిడిచేస్తూ, సాధిస్తూ వచ్చారు. ఆ తర్వాత కూడా ప్రతిదానికీ కుల ‘ధృవీకరణ పత్రం’ అడుగుతున్నారు కాబట్టి, తమకు కుల మతాలు లేవని స్నేహ నోటరీ అఫిడవిట్‌ సమర్పించారు. అది ఒక తొలి మెట్టయింది. ఇక ”కుల రహిత ధృవపత్రం” ఉంటే ఇంకా బావుంటుందని అందుకోసం సంఘర్షణ ప్రారంభించారు.

మనిషికి పుట్టుకతోనే జాతి, మతం సంక్రమిస్తాయని మన సమాజం, చట్టాలు చెపుతున్నాయి. కానీ, ఎవరైనా సరే, పుట్టుకతోనే కులం, మతం ధరించి పుడతారనే భావనతో స్నేహ పార్థిబరాజా ఎప్పుడూ లేరు. పుట్టేప్పుడు కేవలం మనుషులుగా పుడుతారన్నది ఆమె ఆలోచన! ఆ ఆలోచనతోనే పదేళ్లు అన్ని వ్యవస్థలతో పోరాడి చివరకు కులమత రహిత ధృపపత్రాన్ని సాధించుకున్నారు.
తన తల్లిదండ్రుల మాదిరిగానే స్నేహ పార్థిబరాజాది కూడా కులాంతర వివాహమే-మళ్లీ వారి ముగ్గురు పిల్లలకి కూడా కులమతాలు తెలియకుండా పేర్లు పెట్టారు. ఆదిరై నా స్క్రీన్‌, ఆదిలా ఐరిన్‌, ఆరిఫా జెస్సీ అని. స్నేహది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. ఆమె భర్త పార్థిబరాజా కళాశాలలో ఉపన్యాసకుడు సాహిత్యం బోధిస్తారు. పైగా రచయిత, థియేటర్‌ ఆర్టిస్టు. ఇరవై అయిదు పుస్తకాలు ప్రకటించినవారు. స్నేహ పార్థి బరాజాకు భరతనాట్యంలో పవేశం ఉంది. వృత్తి రీత్యా న్యాయవాది గనుక, ఉచిత న్యాయసేవా శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆమెకు కార్ల్‌మార్క్స్‌, పెరియార్‌, డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ స్ఫూర్తి ప్రదాతలు.

కులమత రహిత ధృవపత్ర సాధనలో ఆమెకు ఆమె తల్లిదండ్రులిద్దరూ సహకరించారు. వారిద్దరూ న్యాయవాదులే. వీరేగాక సినీ నటులు కమల్‌ హాసన్‌, విశాల్‌, సత్యరాజ్‌, రోహిణి, పార్థిబన్‌, సూర్య, విఘ్నేశ్‌ శివన్‌ మొదలైన వారంతా ఆమె ప్రయత్నానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. ప్రొత్సహించారు. రాజకీయ నాయకుల్లో డియంకె నేత దయానిధి మారన్‌, విసికే అధినేత తిరుమావళవన్‌ అభినందించారు. హైకోర్టు న్యాయవాదులు ఎందరో సహాయ సహకారాలు అందించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి ధృవపత్రం కావాలని అడిగితే తప్పుకుండా ఇవ్వాలన్న నిబంధన ఇప్పటికైతే లేదు. విచక్షణ ఆధారంగా మాత్రమే ఇస్తున్నారు. అందుకని ప్రభుత్వం దీన్ని చట్టంగా తీసుకొస్తే బావుంటుంది. కావాలనుకున్న వారికైనా సులభంగా లభిస్తుంది.

నేటి యువత మూడు, నాలుగు విషయాలకు బానిస మారుతున్నారని, వారు అందులోంచి బయటపడాలని స్నేహ పార్థి బరాజా ఆకాంక్షిస్తున్నారు. ఒకటి – మద్యపానం, మాదక ద్రవ్యాల వాడకం, పొగపీల్చడం వగైరా రెండు – సినిమా, టి.వి. సామాజిక మాధ్యమాలు. వీటికి మొత్తం బానిసలు కాకుండా, వేటిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. అలాగే మూడోది- ప్రేమ వ్యవహారాలు! ప్రేమ అనేది కేవలం శారీరక వాంఛలు తీర్చుకోవడానికే అన్నట్లు దాన్ని దిగజార్చారు. ఆ పరిస్థితి మారాలి.వీటన్నిటికీ కారణం సరైన జ్ఞానం సంపాదించుకోకపోవడం.అందుకే యువత పుస్తక పఠనాన్ని పెంచుకోవాలి. దానితో విజ్ఞత పెరుగుతుంది. సమాజ రుగ్మతల్ని రూపుమాపడానికి యువత సంసిద్ధమవుతుంది – అన్నది స్నేహ పార్థి బరాజా అభిప్రాయం.

కులమత రహిత ధృవీకరణ పత్రం సాధించడం సాధ్యమేనని స్నేహ పార్థి బరాజా వంటి న్యాయవాది నిరూపిస్తే, కులమత రహితంగా జీవించడం సాధ్యమేనని. అందుకు ఏ ప్రచారాలూ అవసరం లేదని మరికొందరు చెప్పకనే చెపుతున్నారు. తమిళనాడులోనే జరిగిన మరొక యదార్థ సంఘటన ఈవిధంగా ఉంది. తిరుచ్చిలోని ఒక కాలనీలో ఉండే ఒక నిరుపేద మహిళ పురిటినొప్పులతో బాధపడుతూ ఉంటే ఆమె భర్త వెంటనే అంబులెన్స్‌ను పిలిచి, అక్కడికి ఏడు, ఎనిమిది కి.మీ దూరంలో ఉన్న ప్రభుత్వఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్‌ పరీక్షించి, ”ఆపరేషన్‌ చేయాలి.రక్తం ఎక్కించాలి” అని అన్నాడు. అప్పుడు అక్కడ లాక్‌డౌన్‌ ఉన్న కారణంగా ”హాస్పిటల్‌లో రక్తం అందుబాటులో లేదు.మీరే ఏర్పాటు చేసుకోవాలి”- అని కూడా చెప్పాడు.

సరే, ఇంటికి తిరిగి వెళ్లి, బంధుమిత్రులను ఎవరినైనా అడిగి- భర్త రక్తం దానమిచ్చే వారిని వెంటబెట్టుకొద్దామనుకున్నాడు. హాస్పిటల్‌ బయటి రోడ్డుమీద వచ్చి చూస్తే – రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఒక్క వాహనమూ కనబడలేదు. ఆయనకు పిచ్చెక్కినంత పనైంది. ఏం చేయాలో తోచలేదు. దగ్గరలో రోడ్డు మీద నిలబడి ఉన్న పోలీసు కానిస్టేబుల్‌ కనిపించాడు. పరిగెత్తు కెళ్లి ఆయన్ని సహాయ మడిగాడు. కానిస్టేబుల్‌ వివరాలు అడిగాడు. భర్త విషయం చెప్పాడు. కొద్దిదూరంలో ఆస్పత్రి గేటు దగ్గర నిలబడ్డ తన భార్యను చూపించాడు. ” సరే- పద. ఏదో ఒకటి చేస్తాను” అని దగ్గర్లో ఉన్న హోటల్‌ వైపు కదిలాడు కానిస్టేబుల్‌.

”లంచ్‌ టైం కదా? ఏదైనా తిని బయలుదేరుదాం”- అన్నాడు కానిస్టేబుల్‌! హోటల్‌ బిల్‌ తననివ్వమంటాడు ఏమోనని బితుకుమన్నాడు భర్త.
”ఇంతకూ మీరు భోం చేశారా?” అడిగాడు కానిస్టేబుల్‌
”లేదు.రాత్రి కూడా ఏమీ తినలేదు” అన్నాడు భర్త. ఉన్న పరిస్థితి చెప్పుకుంటే మంచిదనుకున్నాడతను.
”సరే పదండి…” అని కానిస్టేబుల్‌ ఆ భార్యాభర్తల్ని హోటల్‌కు తీసుకెళ్లి, తను తింటూ వారికి కూడా భోజనం పెట్టించాడు.
మాటల్లో భర్త చెప్పాడు. డాక్టరుగారు వెంటనే రక్తం కావాలన్నారని – అందుకనే ఎవరినైనా తీసుకొద్దామని బయలుదేరాననీ-
బ్లడ్‌ గ్రూపు అడిగాడు కానిస్టేబుల్‌. బ్లడ్‌ గ్రూపు చెప్పాడు భర్త.

”ఓస్‌ అదేనా? నాదీ అదే గ్రూపు, ఏం కంగారు లేదు. నేను రక్తమిస్తాను. పదండి” అన్నాడు కానిస్టేబుల్‌. ఏమిటీ? ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఉన్నా మనకు ఎదురుపడి సహాయపడతారా? – ఆశ్చర్యపోయారు దంపతులిద్దరు.
వంగి దండం పెట్టాడు భర్త. ”అన్నలాగా ఆదుకుంటున్నా రయ్యా!” అని కళ్ల నీళ్లు పెట్టుకుంది భార్య.
”ఏం ఫరవాలేదు రండి!” అని వారితో పాటు ఆస్పత్రికి వెళ్లి, రక్తం ఇచ్చి – ధైర్యంగా ఉండడని చెప్పి వెళ్లిపోయాడు కానిస్టేబుల్‌. డాక్టరు గారు వచ్చి, పరీక్ష చేసి, ఆపరేషన్‌ తేదీ, సమయం నిర్ణయించారు. అలా ఆ మహిళ చక్కని బిడ్డను కన్నది.

కానిస్టేబుల్‌ సమయానికి రక్తదానం చేసి, ఒక మహిళకు సహాయపడ్డాడని తెలిసి పైఅధికారులు అభినందించారు. పోలీస్‌ కమిషనర్‌కు తెలిసి, వెయ్యి రూపాయలు బహుమతి ఇచ్చాడు. ఆ విషయం ఇంకా ఆ పై అధికారులకు తెలిసింది. డి.ఐ.జి పదివేలు బహుమతిగా ఇచ్చాడు. అతని సేవాభావాన్ని ప్రశంసించాడు. ఆ కానిస్టేబుల్‌ అంతటితో సంతోషపడొచ్చు కదా? లేదు – అతను మళ్లీ హాస్పిటల్‌కి వెళ్లాడు. ఆ భార్యాభర్తల్ని కలిశాడు. డాక్టర్‌ను కూడా కలిశాడు. వస్తూ వస్తూ తనకు బహుమతిగా వచ్చిన పదకొండు వేలు పాప దగ్గర పెట్టి, జాగ్రత్తగా చూసుకోండని చెప్పి బయటపడ్డాడు.

ఆ కానిస్టేబుల్‌ పెద్దగా అనుభవమున్నవాడేమీ కాదు. కొత్తగా ఉద్యోగంలో చేరిన యువకుడు. వయసు ఇరవై ఆరేళ్లు. పేరు మహమ్మద్‌ అబ్దుల్‌ సత్తార్‌. ఆ మహిళ పేరు మంగతాయారు. ఆమె భర్త చలపతి. మామూలు పౌరుల్లో కూడా కుల మతాల్ని, ప్రాంతీయ భేదాల్ని పట్టించుకోకుండా మానవత్వం చూపే దయార్ద్ర హృదయులు ఉంటారు. ఉన్నారు. కాబట్టే ప్రపంచం ఇంకా ఇలాగైనా ఉంది.
మంచితనమంతా ఒక మతం వారిలోనే ఉంది. వారే మహానీయులు. మిగతా వారంతా దుర్మార్గులు – అని ప్రచారం చేస్తున్న వారి దుర్మార్గాల్ని సామాన్య పౌరులు పసిగడుతున్నారు. పసిగడుతూనే ఉంటారు!

ఆదివాసీ పిల్లల కోసం, దళితుల పిల్లల కోసం ఒక దయామయుడు తన స్వంత భూమి ఎకరం స్థలంలో ఒక పాఠ శాల భవనం కట్టించాడు. దాన్ని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల నిర్దాక్షణ్యంగా కూల్చేసింది. కారణం ఆ భవనం కట్టించిన వ్యక్తి పేరు అబ్దుల్‌ నయీమ్‌ కావడమే! రాజకీయాలు ఏవైనా, దళిత, ఆదివాసీ బాలబాలికలకు పాఠశాల లేకుండా పోయింది. ఇలాంటిదే మరొక వాస్తవ సంఘటన ఇలా ఉంది. పండిత కండారారు రాజీవరు అనే దేవాలయ పూజారి, దేవాలయం నుండి నాలుగున్నర కిలోల బంగారం దొంగిలించాడు. సి.సి. కెమెరాలు పట్టిచ్చాయి. పజ్ఞా అనే పారిశుద్ధ్య కార్మికురాలు తనకు దొరికిన 45 లక్షల విలువ గల బంగారం పోలీసులకు అప్పగించింది. ఇందులో నైతికత ఎవరిది?ఎవరు ఉన్నతులు?ఎవరు కారు? మనువాదుల వర్గీకరణ ఇక్కడ దేనికైనా పనికొస్తుందా? ఆలోచించండి!

నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ సలహా సంఘ పూర్వసభ్యుడు, జీవశాస్త్రవేత్త.

డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -