Tuesday, June 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసాదాబైనామా ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారంలో వేగం పెంచాలి

సాదాబైనామా ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారంలో వేగం పెంచాలి

- Advertisement -

జిల్లాకో మండలంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి అమలుకు యోచ‌న
ఏడాది కాలంలో 3.65 లక్షల పాస్‌బుక్‌ల జారీ : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రైతు భూమికి చట్టబద్ధమైన రక్షణ, స్పష్టమైన హక్కులు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు వేగం పెంచాలని ఆదేశించారు. సోమ‌వారం హైదరాబాద్‌‌లో రెవెన్యూ శాఖ అధికారుల‌తో మంత్రి టెలికాన్ఫ‌రెన్స్‌ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన 2025 ఏప్రిల్ 14 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3.65 లక్షల పాస్‌బుక్‌లు జారీ చేసినట్టు వివరించారు. గతంలో పాస్‌బుక్ కోసం రైతులు నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితులకు ముగింపు పలుకుతూ రైతు దరఖాస్తు చేసిన వెంటనే పాస్‌బుక్ అందే విధంగా వ్యవస్థను పారదర్శకంగా, వేగవంతంగా రూపొందించామని తెలిపారు. రైతు ఒక్కసారి దరఖాస్తు చేస్తే తిరిగి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.
భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ జత చేసే నిబంధనను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఐదు మండలాల్లో పరిస్థితులను మంత్రి సమీక్షించారు. ఈ విధానం విజయవంతంగా కొనసాగుతోందని అధికారులు వివరించారు. అక్కడి అనుభవాలు, సమస్యలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే రెండో దశలో ప్రతి జిల్లాకు ఒక మండలంలో అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారురాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో మరింత వేగం పెంచాలని మంత్రి కోరారు. మొత్తం 9.25 లక్షల సాదాబైనామా దరఖాస్తుల్లో, ఇప్పటివరకు ఆరు లక్షల దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసినట్టు అధికారులు వివరించారు. మిగిలిన దరఖాస్తులకు వచ్చే 15 రోజుల్లో నోటీసుల జారీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత 30 రోజుల గడువు ముగిసిన వెంటనే అర్హులైన ద‌ర‌ఖాస్తుల‌ను పరిష్కారించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం సాదాబైనామా అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. దరఖాస్తులు స్వీకరించినప్పటికీ వాటి పరిష్కారానికి 2020 ఆర్వోఆర్ చట్టంలో సరైన నిబంధనలు లేకపోవడం వల్ల వేలాది మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు త‌మ ప్ర‌భుత్వం నిబంధనలను సవరించి దరఖాస్తుదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -