ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్
సర్ ప్రక్రియలో నిర్లక్ష్యం వద్దు..
ఇంటింటికీ వెళ్లాలి
అనుకూల ఓట్లను ఉంచి, ఇతర ఓట్లను తొలగించే యత్నం :
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
వరంగల్‌లో బీఎల్ఏల అవగాహన, శిక్షణా సదస్సు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మొదట ఓట్లను చోరీ చేశారని, ఆ తర్వాత రాజ్యసభ సీటును చోరీ చేశారని, అవసరమైతే రాజకీయ పార్టీలను కూడా చోరీ చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటును కాపాడాలని అన్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో హంటర్ రోడ్డులోని డీ కన్వెన్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అవగాహనా సదస్సు, ఓటర్ల జాబితా సవరణపై నిర్వహించిన బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) శిక్షణా కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. వీరికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మీనాక్షి నటరాజన్ ప్రసంగించారు. బీజేపీకి రాజకీయ, ప్రజాస్వామ్య నైతిక విలువలు లేవని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచి రాజకీయ లబ్ది పొందేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ ప్రక్రియను ఉపయోగించి బీజేపీకి అనుకూలమైన ఓట్లను నిలుపుకొని, ఇతరుల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటివరకు ఎస్ఐఆర్ అమలైన రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కాబట్టి అన్నీ సవ్యంగా జరుగుతాయని భావించొద్దని, ఏమరపాటుగా ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాబట్టి అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా పేద ప్రజలు ఈ ప్రక్రియలో మోసపోయే ప్రమాదం ఉన్నందున వారి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు.
అనుకూల ఓట్లను ఉంచి, ఇతర ఓట్లను తొలగించే యత్నం : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు మించిన హక్కు మరొకటి లేదని, దాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా భావిస్తున్న ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, గిరిజనుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, నాగరాజు, ఎంపీ కడియం కావ్య, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మెన్లు రియాజ్, కుసురు పాషా, డీసీసీ అధ్యక్షులు వెంకట్రామ్ రెడ్డి, ఆయూబ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు దుద్దిళ్ల శ్రీనివాస్, నామిండ్ల శ్రీనివాస్, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈవీ శ్రీనివాస్‌రావు, పార్టీ ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మొదట ఓట్లు.. ఆ తర్వాత రాజ్యసభ సీటు చోరీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



