Friday, June 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలకు మళ్లీ జీవం.!

పాఠశాలకు మళ్లీ జీవం.!

- Advertisement -

పూర్వ విద్యార్థుల గొప్ప సంకల్పం!
శిథిలావస్థ నుంచి విద్యామందిరం వైపు అడుగులు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచర్లలోని వెల్మలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పునరుద్ధరణకు గ్రామస్థుల సన్నద్ధమైయ్యారు.పిల్లల భవిష్యత్తు కోసం కదిలిన ‘అలనాటి’ విద్యార్థులు,అధికారుల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.ఒకప్పుడు విద్యార్థుల కేరింతలతో కళకళలాడిన పాఠశాల..కాలక్రమేణా విద్యార్థుల కొరతతో మూతపడింది.ఆ తర్వాత భవనం శిథిలావస్థకు చేరి, పిచ్చి మొక్కలతో నిండిపోయి నిరుపయోగంగా మారింది.అయితే, తమకు అక్షరజ్ఞానం ప్రసాదించిన విద్యామందిరం మళ్లీ తెరుచుకోవాలని, తమ గ్రామంలోని చిన్నారులు దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులు తప్పాలని భావించిన పూర్వ విద్యార్థులు అద్భుతమైన సంకల్పంతో ముందుకు వచ్చారు.

వెల్మలపల్లిలోని ఉన్నత ప్రాథమిక పాఠశాలకు మళ్లీ జీవం పోసేందుకు వారు చేస్తున్న కృషి ఇప్పుడు గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఈ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించి, నేడు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఎంతోమంది విద్యార్థులు తమ సొంత గ్రామంలోని పాఠశాల దయనీయ స్థితిని చూసి చలించిపోయారు. గ్రామస్థులతో కలిసి పాఠశాల పునరుద్ధరణకు నడుం బిగించారు. పాఠశాల ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించడం, శిథిలమైన భవనానికి మరమ్మతులు చేయడం, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా వారు కార్యాచరణ సిద్ధం చేశారు. తమ పిల్లలు కూడా అదే పాఠశాలలో చదువుకోవాలన్న బలమైన ఆకాంక్ష వారిలో కనిపిస్తోంది.

దూరభారం తప్పేనా.?
ప్రస్తుతం గ్రామంలో పాఠశాల లేకపోవడంతో చిన్నపిల్లలు విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు రానున్న విద్యాసంవత్సరం నాటికి పాఠశాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి, స్థానిక విద్యార్థులను తిరిగి చేర్పించాలని పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు దృఢ నిశ్చయంతో ఉన్నారు. గ్రామ భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ ప్రయత్నంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వం స్పందించాలి.!
అధికారులు చొరవ తీసుకుని పాఠశాల పునఃప్రారంభానికి అనుమతులు మంజూరు చేయాల‌ని కోరుతున్నారు. మౌలిక వసతులు కల్పించి, మెరుగైన విద్యాబోధనకు చర్యలు తీసుకోవాల‌ని కోరుతున్నారు. ఒకప్పుడు శిథిలావస్థకు చేరిన ఈ విద్యామందిరం, ఇప్పుడు గ్రామ విద్యాభివృద్ధికి కొత్త ఆశాకిరణంగా మారుతోంది. అధికారుల సహకారం అందితే, ఆ పాఠశాల మరోసారి పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని, చిన్నారుల విద్యాప్రయాణం సులభతరం అవుతుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి, పాఠశాల పునఃప్రారంభానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -