బీజింగ్ : చైనా నౌకలు ఇటీవలి కాలంలో తమ ప్రధాన భూభాగానికి చాలా దూరంగా శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాయి. అత్యంత సున్నితమైన సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేశాయి. చైనా సముద్ర తీరానికి ఐదువందల మైళ్లకు పైగా దూరంలో ఉన్న, అత్యంత వివాదాస్పదమైన మడుగులో పరిశోధనలు చేపట్టాయి. పశ్చిమ పసిఫిక్‌లో కీలక నియంత్రణ రేఖగా భావించే ద్వీపాల సమూహానికి ఆవల తమ ఉనికిని విస్తరించుకోవడానికి చైనా, అమెరికాలు చేస్తున్న ప్రయత్నాలలో బీజింగ్ చర్యలు భాగమేనని విశ్లేషకులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనాలో పర్యటించిన తర్వాత ఈ సముద్ర విన్యాసాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నెల ప్రారంభంలో చైనా సంస్థకు చెందిన మూడు నౌకలు తైవాన్‌కు తూర్పున ఉన్న జలాలలో మ్యాపింగ్ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఇందుకోసం ఫిలిప్పీన్స్, తైవాన్ మధ్య ఉన్న బాషి చానల్ మీదుగా ప్రయాణించాయి. దక్షిణ జపాన్ నుంచి తైవాన్-ఫిలిప్పీన్ మీదుగా, బోర్నియో నుంచి సింగపూర్ వరకూ దక్షిణ చైనా సముద్రపు అంచుల వెంబడి విస్తరించిన మొదటి ద్వీప శ్రేణికి తూర్పున తొలిసారిగా ఈ నౌకలు కనిపించాయి.
మొదటి ద్వీప శ్రేణికి ఆవల ఉన్న ప్రాంతం తమ అధికార పరిధిలోనిదేనని చైనా చెబుతోంది. పసిఫిక్‌లో నౌకల కదలికలను ‘చట్టపరమైన ప్రాముఖ్యత-రాజకీయ సంకేతాలు ఉన్న సార్వభౌమత్వ ప్రకటన’గా చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాబ్లాయిడ్ పత్రిక గ్లోబల్ టైమ్స్ అభివర్ణించింది. తైవాన్‌కు తూర్పున ఉన్న సముద్ర గర్భాన్ని తమ నౌకలు మొదటిసారిగా మ్యాపింగ్ చేశాయని చైనా తెలిపింది. ‘తైవాన్ ద్వీపానికి తూర్పున ఉన్న జలాలు మా తీర ప్రాంతానికి చెందినవే. అక్కడ మా ఉనికి ఉంది. అధికార పరిధి ఉంది. ఆ ప్రాంతంలో మేమే పాలన చేస్తాం’ అని చెప్పింది.
పసిఫిక్‌లో చైనా సముద్ర విన్యాసాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



